హెచ్‌సీఏ మెడకు బిగుస్తున్న ఉచ్చు..
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి జగన్ మోహన్ రావు.. నకిలీ పత్రాలను వినియోగించారు.
తానోటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లు ఉంది.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) పరిస్థితి. కొన్ని ఎక్స్‌ట్రా టికెట్‌ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో గొడవపడింది. వీరి మధ్య గొడవ తీవ్ర వివాదంగా మారింది. ఇప్పుడు ఈ వివాదం కాస్తా హెచ్‌సీఏకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. అసోసియేషన్‌లో జరిగిన అనేక అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఐదుగురు అధికారులను అరెస్ట్ చేసిన సీఐడీ.. ఇప్పుడు కొత్తగా వెలుగు చూసిన నకిలీ పత్రాల అంశంపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ రావు చేసిన అవకతవకలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన సమయంలో కూడా జగన్ మోహన్ రావు నకిలీ పత్రాలనే సమర్పించారని సీఐడీ అధికారులు గుర్తించారు.
ఇప్పటికి ఐదుగురు అరెస్ట్..
ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ మధ్య కొనసాగిన వివాదం.. సీఎం రేవంత్ చెంతకు చేరింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. విజిలెన్స్ అధికారుల దర్యాప్తుకు ఆదేశించారు. మరుసటి రోజే హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. కానీ హెచ్‌సీఏకు అసలు చిక్కులు అప్పటి నుంచే మొదలయ్యాయి. దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అధికారులు అనేక విషయాలు కనుగొన్నారు. వాటిలో హెచ్‌సీఏ నిధులు దుర్వినియోగం అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ అంశంలోకి సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటించింది. హెచ్‌సీఏ అధ్యక్షులు జగన్ మోహన్ రావు, హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంటే, చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు జి.కవితను సీఐడీ అరెస్ట్ చేసింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువా రెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ.. అనేక కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తోంది.
హెచ్‌సీఏలో నకిలీ పత్రాల కలకలం..!
జగన్ మోహన్ రావు.. అధ్యక్షుడిగా పోటీ చేయడానికే కాకుండా క్లబ్ ఏర్పాటుకు కూడా నకిలీ పత్రాలను వినియోగించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ క్రమంలోనే గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సీ కృష్ణ యాదవ్ సంతకాన్ని కూడా జగన్ మోహన్ రావు ఫోర్జరీ చేశారు. అదే విధంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కోసం నకిలీ పత్రాలను కూడా జగన్ మోహన్ రావు సృష్టించినట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. జగన్ మోహన్ రావు , సీజే శ్రీనివాస్ రావు, ట్రెజరర్, హెచ్‌సీఏ సీఈవో సునీల్ కుట్రపూరితంగా ఎన్నిక అయినట్లు విచారణలో సీఐడీ బయటపెట్టింది.
ఎస్‌ఆర్‌హెచ్‌తో వివాదం ఇదే..!
కాంప్లిమెంటరీ పాస్‌ల వ్యవహారంలో హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య వివాదం జరుగుతుంది. ఐపీఎస్ 2025 ఒప్పందం ప్రకారం 10శాతం టికెట్లు హెచ్‌సీఏకు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా 50 టికెట్ల సామర్థ్యం ఉన్న కార్పొరేట్ బాక్స్‌ను హెచ్‌సీఏకు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఆ బాక్స్ సామర్థ్యం 30కి తగ్గింది. దీంతో తమకు అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ డిమాండ్ చేసింది. దీనిపై చర్చించాలని ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధులు సూచించారు. దీంతో ఒక మ్యాచ్ సందర్భంగా ఆ హెచ్‌సీఏ ప్రతినిధులు తమ కార్పొరేట్ బాక్స్‌కు తాళం వేశారు. తమకు రావాల్సిన అదనపు 20 టికెట్లు ఇస్తేనే తాళం తీస్తామని హెచ్‌సీఏ ప్రతినిధులు చెప్పారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్.. హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావుకు లేఖ రాసినట్లు సమాచారం. ఈ లేఖలో గత రెండేళ్లుగా హెచ్‌సీఏ వేధింపులు ఎక్కువయ్యాయని, తాము ఉప్పల్ స్టేడియంలో ఆడటం ఇష్టం లేనట్లు హెచ్‌సీఏ ప్రవర్తిస్తోందని, ఇలానే కొనసాగితే ఇదే విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో చర్చించి మరో హోమ్ గ్రౌండ్ చూసుకోవాల్సి రావొచ్చని పేర్కొన్నారు. ఈ వివాదం తీవ్రతరం కావడంతో సీఎం రేవంత్ స్పందిస్తూ.. విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు.