కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్ట్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

ఎత్తు పెంచితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకే నీళ్లుండవు.

Update: 2025-09-20 06:32 GMT

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ప్రాజెక్ట్ ఎత్తుపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ డ్యామ్ ఎత్తును పెంచడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలతో తెలంగాణకు ముప్పు ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలని, ప్రాజెక్ట్ ఎత్తు పెంచకుండా కర్ణాటక ప్రభుత్వంతో మంతనాలు జరపాలని సూచించారు. అయితే ఆల్మట్టి ప్రాజెక్ట్  ప్రస్తుతం 519 అడుగుల ఎత్తు ఉంది. దానిని ఇప్పుడు 524 అడుగులకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం మేధోమధనం చేస్తోంది. అదే జరిగితే తెలంగాణకు నీటి కష్టాలు తప్పవని కవిత అన్నారు. అసలు ముందుగా ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు  చుక్క నీరు అందదని కవిత వివరించారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెరగితే దక్షిణ తెలంగాణలో ఐదు జిల్లాలు కరువును ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. 

ఉమ్మడి ఆంధ్రలో జీవో..

‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెరగకుండా జీవో ఉంది. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ను ఎత్తును 5 మీటర్ల వరకు పెంచడానికి రెడీ అయింది. దక్షిణ తెలంగాణలో ఐదు జిల్లాలకు కృష్ణా నది వరప్రదాయిని. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎత్తు పెరిగితే తెలంగాణకు కృష్ణానది ఆనవాళ్లు లేకుండా పోతాయి’’ అని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అదే జరిగితే తెలంగాణ వ్యవసాయ రంగం కుదేలవుతుంది. పంటపొలాలు పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి తప్ప ఇంకెందుకూ పనికి రాకుండా పోతాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా ఉంది. సోనియా గాంధీతో సిద్ధరామయ్యకు ఫోన్ చేయించండి. ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచాలన్న ఆలోచనను వెంటనే ఆపేలా చేయండి’’ అని ఆమె సీఎం రేవంత్‌ను కోరారు. 

సుప్రీంకోర్టుకు వెళ్లండి..

‘‘నది జలాల విషయంలో వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. అదే విధంగా ప్రాజెక్ట్ ఎత్తు పెంచిన తర్వాత కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల లాభం ఉండదు. ఇప్పుడే వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తును పెంచకుండా అడ్డుకోండి. దీనిని ఆపకుంటే మీరు పాలమూరి బిడ్డా.. పేపర్ పులా అనేది అర్థమైపోతుంది’’ అని చురకలంటించారు. ‘‘కృష్ణా ట్రిబ్యునర్ బోర్డు మీటింగ్ జరగనుంది. అందులో సీఎం రేవంత్ స్వయంగా పాల్గొని ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తును పెంచడాన్ని అడ్డుకోవాలి’’ అని కోరారు.

Tags:    

Similar News