ములుగు లో భారీ వర్షాలు.. సమీక్షించిన మంత్రి సీత‌క్క‌

సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశాలు;

Update: 2025-07-23 11:19 GMT

ములుగులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ‌ శాఖ మంత్రి సీత‌క్క‌ స్వయంగాపరిస్థితిని సమీక్షించారు.

గుండ్లవాగు, జలగలంచ వాగులు ప్రమాపుటంచులకు చేరడంతో మంత్రి సీతక్క కార్యాచరణలో దిగిపోయారు.

ప్రజలను అప్రమత్తం చేయాలని ములుగు, మ‌హ‌బూబాబాద్ కలెక్ట‌ర్ల‌ను, ఎస్పీల‌ను తన ఫోన్ లో ఆదేశాలు జారి చేశారు. పూర్తిగా శిథిలావ‌స్థ‌లో ఉన్న ఇండ్లను గుర్తించి అప్రమత్తం చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల‌ని అధికారులకు ఆదేశాలు జారి చేశారు. ములుగు జిల్లా పరిధిలోని పసర–తాడ్వాయి మార్గ మధ్యలో ఉన్న జలగలంచ గుండ్ల వాగు వరద పరిస్థితిని సీతక్క స్వయంగా పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా, ప్రత్యేకంగా ములుగు జిల్లాలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని కోరారు.

జిల్లా అధికారులు వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలను ముందుగానే హెచ్చరించాలని ఆమె ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు ములుగు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే ఆ నంబర్‌కు కాల్ చేయాలని ఆమె ప్రజలను కోరారు.

విద్యుత్ తీగలు పడిపోయిన చోట రైతులు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ షాక్ ప్రమాదాలకు గురి కాకుండా త‌గిన జాగ్ర‌త‌లు పాటించాల‌ని సూచించారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను అధికారులు గుర్తించి, అటువంటి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కింది స్థాయి అధికారులతో సమన్వయంగా మానిటరింగ్ చేయాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News