హైకోర్టులో ఫలించని హరీష్ రావు ప్రయత్నాలు..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్యలకు న్యాయస్థానం నిరాకరణ.;
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికపై మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. శనివారం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం విచారించింది. కాగా పిటిషన్ అభ్యర్థనకు నిరాకరిస్తూ పిటిషన్‌ను క్వాష్ చేసింది. సోమవారం జరిగిన విచారణలో కమిషన్ నివేదికపై అసెంబ్లీలో తీర్మానించకుండానే సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని హరీష్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలో మంగళవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. కాగా ఆయన అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం నో చెప్పింది. హరీష్ రావు తరపు న్యాయవాది పలుమార్లు అభ్యర్థించినప్పటికీ న్యాయస్థానంలో లాభం లేకుండా పోయింది.
అయితే ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆరు గంటలకు పైగానే చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి మాటల యుద్ధం కొనసాగింది. ప్రతి పక్షాలు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు ధీటైన సమాధానాలు చెప్పారు. అదే విధంగా ప్రతిపక్షాల తరపు నుంచి కూడా కమిషన్ నివేదికపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు అయితే.. అసలు కమిషన్ చేసిన విచారణే చట్టవ్యతిరేకమని, నిబంధనలను తుంగలో తొక్కుతూ విచారణ చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా 660 పేజీల నివేదిక ఇచ్చి.. అరగంటలో మాట్లాడాలి అంటే ఎలా సాధ్యమవుతుందని, తనకు కనీసం రెండు గంటల సమయంలో కావాలని అసెంబ్లీలో కోరారు. కాగా ఇరు వర్గాల మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. చిరవకు బీఆర్ఎస్ నేతలు సభ నుంచి ఎటువంటి తీర్మానం జరగకుండా వాకౌట్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.