కాంగ్రెస్ కి కలిసొచ్చిన హైకోర్టు తీర్పు!!

మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Update: 2024-09-10 14:56 GMT

మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కులగణన పూర్తి చేసి నివేదిక  ఇవ్వాలని పేర్కొంది. హైకోర్టులో 2019లో బీసీ కులగణన చేపట్టాలని పిటిషన్ దాఖలైంది. బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ వేసిన ఈ పిటిషన్ పై మరోసారి సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. బీసీ కులగణన పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని సత్యన్నారాయణ పిటిషన్ లో పేర్కొనగా... కులగణన అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ యాదవ్ కోర్టుకు వెల్లడించారు. దీంతో బీసీ కులగణనను చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు... పిటిషన్ పై విచారణ ముగించింది.

కాగా, రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టేందుకు ప్రభుత్వం సైతం కసరత్తు చేస్తోంది. బీసీ కులగణన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి పోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల స్టేట్ బీసీ కమిషన్ నూతన చైర్మన్, సభ్యులను కూడా నియమించినట్లు స్పష్టం అవుతోంది. కులగణన పూర్తి అయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోన్న తరుణంలోనే.. మూడు నెలల్లో క్యాస్ట్ సెన్సెస్ కంప్లీట్ చేయాలని హైకోర్టు ఆదేశించడం కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశమనే చెప్పొచ్చు.

లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే బీసీ కులగణన...

ఇటీవల బీసీ కమిషన్ కొత్త చైర్మన్ గా నియమితులైన నిరంజన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే బీసీ కులగణన చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుందని, బీసీ సంఘాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమాజ శ్రేయస్సు తన ప్రధాన ఎజెండా అని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ సైతం డిమాండ్ చేస్తున్నారని, రాష్ట్రంలో కులగణన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు చెప్పారు. ఆ లక్ష్యం దిశగా బీసీ కమిషన్ పని చేస్తుందన్నారు. గత బీసీ కమిషన్ కులగణన విషయంలో ఎంత మేరకు పని చేసిందో వివరాలు తెప్పించుకుని, వాటిని పరిశీలించి తామెంత త్వరగా పూర్తి చేయగలమో చేస్తామన్నారు. అన్ని బీసీ కుల సంఘాలు సహకరిస్తే ఎన్నికలలోపే కులగణన జరుగుతుందన్నారు. అందువల్ల బీసీ సంఘాలు ఆందోళన బాటలో కాకుండా సహకారం బాటలో ఉండాలని కోరారు. కులగణన విషయంలో బీసీ కమిషన్ కు ఏ విధంగా సహకరించాలో అనే దృక్పథంతో ఆలోచన చేయాలన్నారు. 

Tags:    

Similar News