గోల్కొండ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్‌లో తొలి రోప్‌వే నిర్మాణానికి జీహెచ్ఎంపీ రెడీ.

Update: 2025-09-23 07:27 GMT

గోల్కొండ కోట నుంచి లూంబ్స్ వరకు రోప్ వే నిర్మించడానికి హైదరాబాద్ మెట్రొపొలిటన్ డెవెలప్‌మెంట్ అథారిటీ(HMDA) సిద్ధమైంది. 1.5 కిలోమీటర్ల పాటు రోప్‌వే నిర్మించడానికి తాజాగా నిర్ణయించుకుంది. ఈ రోప్ వే నిర్మాణం అనేది కొంతకాలంగా చర్చల్లో ఉంది. కాగా తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయడానికి హెచ్ఎండీఏ ఓకే చెప్పింది. చారిత్ర నగరంలో పర్యాటకులకు ఈ రోప్ వే ప్రయాణం మరింత ఆహ్లాదాన్ని అందిస్తుందని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోప్‌ వే గోల్కొండ పర్యాటకానికి మంచి బూస్ట్ ఇస్తుందని పర్యాటక రంగం అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేసేందుకు నైట్‌ఫ్రాంక్‌ సంస్థ కన్సల్టెన్సీగా ఎంపికైంది. రైట్స్, నైట్‌ ఫ్రాంక్, కెఅండ్‌జే అనే  మూడు సాంకేతిక సంస్థలు కన్సల్టెన్సీ హోదాను దక్కించుకొనేందుకు పోటీపడగా నైట్‌ఫ్రాంక్‌కు అవకాశం లభించింది. 

మూడు నెలల్లో నివేదిక రెడీ..

రోప్ వే ప్రాజెక్ట్ నిర్మాణంపై ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ కంపెనీని అనేక ప్రమాణాలు పరిశీలించి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. సంస్థ సామర్థ్యం, అనుభవం చూసిన తర్వాత నైట్‌ఫ్ఱాంక్‌ను ఓకే చేసినట్లు వెల్లడించారు. ఈ సంస్థ ప్రాజెక్ట్ నిర్మాణంలోని సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లు వంటి అన్ని అంశాలను పరీక్షించి మూడు నెలల్లో నివేదిక అందిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్ట్ నిర్మాణానికి బిడ్డింగ్‌కు పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్‌షిప్ పద్దతిలో చేపట్టాలని హెచ్ఎండీఏ భావిస్తోంది.

పెరగనున్న పర్యాటకం..

హైదరాబాద్‌లో ప్రతి రోజూ దాదాపు 10వేల మంది పర్యాటకులు గోల్కొండ కోటను సందర్శిస్తున్నారు. వారిలో సుమారు 3వేల మంది విదేశీయులు ఉంటున్నారు. ట్రాఫిక్, రోడ్డు మార్గంలో ఎదురయ్యే అనేక సమస్యల వల్ల పర్యాటకుల్లో అధికశాతం మంది గోల్కొండ నుంచి వెనుదిరుగుతున్నారు. కుతుబ్‌షాహీల సమాధులను సందర్శించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు ఈ రోప్ వే నిర్మాణమైతే గోల్కొండ కోట తరహాలోనే శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ సమాధులను కూడా పర్యాటకులు సులభంగా వీక్షించగలుగుతారు. రోప్‌వే అందుబాటులోకి వస్తే 1.5 కి.మీ.మార్గాన్ని కేవలం 10 నిమిషాల్లో చేరుకొనే సదుపాయం లభించనుంది. పైగా రెండు చారిత్రక ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.100 కోట్ల వరకు వ్యయం కానున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పీపీపీ పద్ధతిలో దీన్ని నిర్వహించడం వల్ల పర్యాటకుల నుంచి టిక్కెట్‌ల రూపంలో ఆదాయం అందుతుంది.

Tags:    

Similar News