పట్నం సోదరులకు ఎంత కష్టమొచ్చింది

ఏమాశించి అన్నదమ్ములిద్దరు చెరోపార్టీలో ఉండిపోయారో తెలీదు. నరేందర్ బీఆర్ఎస్ లో కంటిన్యు అవటమే కాకుండా రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Update: 2024-11-13 12:04 GMT
Patnam brothers

విడవమంటే పాముకు కోపం..కరవమంటే కప్పకు కోపం అన్న సామెత పట్నం సోదరులకు సరిగ్గా వర్తిస్తుంది. నిజంగా పట్నం సోదరులకు ఎంత కష్టమొచ్చిందో. విషయం ఏమిటంటే బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత పట్నం నరేందర్ రెడ్డిని(Patnam Narendar Reddy) పోలీసులు అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సోమవారం కొడంగల్(Kodangal) నియోజకవర్గంలోని లగచర్ల(Lagacharla) గ్రామసభలో పాల్గొన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్(Vikarabad Collector Pratik Jain0 పైన గ్రామస్తులు దాడిచేసిన విషయం తెలిసిందే. రాజకీయంగా రెండుపార్టీల నేతలు, క్యాడర్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవటం మామూలే. కాని కలెక్టర్ మీద గ్రామస్తులు దాడిచేయటంతో సంచలనమైపోయింది. ఆ దాడికి సూత్రదారుడుగా పోలీసులు ఆధారాలు సేకరించి బుధవారం ఉదయం నరేందర్ ను అరెస్టు చేశారు.

ఇక్కడ వరకు పట్నం అరెస్టు విషయంలో ఎలాంటి సమస్యలేదు. సమస్యంతా ఎక్కడ వచ్చిందంటే పట్నం నరేందరరెడ్డికి అన్న పట్నం మహేందరరెడ్డి ఉన్నారు. సమస్యంతా కుటుంబంలో ఇప్పుడే మొదలైంది. ఎలాగంటే పట్నం మహేందరరెడ్డి(Patnam Mahendar Reddy), పట్నం నరేందరరెడ్డి స్వయానా అన్నదమ్ములు. మహేందర్ రెడ్డేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. తమ్ముడు పట్నం నరేందరరెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు అత్యంత సన్నిహితుడు. అందుకే అన్నదమ్ములిద్దరు చెరోపార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇపుడు సడెన్ గా సమస్య ఏమొచ్చిందంటే కలెక్టర్ మీద దాడికి సూత్రదారుడని తమ్ముడు నరేందర్ ను అరెస్టు చేయటంతోనే వచ్చింది.

కలెక్టర్ మీద జరిగిన దాడికి నరేందర్ సూత్రదారుడు అవునో కాదు ఎవరికీ తెలీదు. దాడి జరిగేట్లుగా గ్రామస్తులను ఉసిగొల్పిన సురేష్ తో నరేందర్ ముందురోజు చాలాసార్లు మాట్లాడారని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు నేతలు ఫోన్లో మాట్లాడుకుంటే అది కుట్ర ఎలాగవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకపార్టీలోని నేతలిద్దరు మాట్లాడకోకూడదా ? మాట్లాడుకుంటే జనాలను రెచ్చగొట్టే ప్లాన్ చేసినట్లేనా ? అని నిలదీస్తున్నారు. మరి కేటీఆర్ ప్రశ్నలకు పోలీసుల దగ్గర ఏమి సమాధానం ఉందో చూడాలి. కోర్టులో ప్రవేశపెట్టినపుడు నరేందర్ తరపున లాయర్ అడిగే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు చెప్పాల్సిందే కదా. కోర్టులో పోలీసులు ఏమని సమాధానాలు చెబుతారో ? దాడికి నరేందర్ రెడ్డే సూత్రదారుడిగా నిరూపించేందుకు పోలీసుల దగ్గర ఏమి సాక్ష్యాలున్నాయో తెలీదు.

ఈ సంగతిని పక్కనపెట్టేస్తే తమ్ముడి మీద ఆరోపణలను అన్నగా మహేందర్ రెడ్డి సమర్ధించలేడు. ఇదే సమయంలో కలెక్టర్ మీద దాడి సూత్రదారుడిగా పోలీసులు చెబుతుంటే కాదనలేడు. దాడి కేసులో అరెస్టయి రిమాండుకు తమ్ముడు వెళుతుంటే చూస్తూ ఉండలేడు. ఘటన జరిగింది రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లోనే. అందులోను దాడికి గురైంది స్వయాన కలెక్టర్. కలెక్టర్ అంటే జిల్లాకు ప్రధమపౌరుడే కాకుండా జిల్లా మెజిస్ట్రేట్ కూడా. అందుకనే దాడి ఘటనను ప్రభుత్వం ఇంత సీరియస్ గా తీసుకున్నది. ఇలాంటి ఘటన మరోసారి ఎక్కడా జరగకూడదంటే ఇపుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని రేవంత్ గట్టిగా డిసైడ్ అయ్యారు. కాబట్టి తమ్ముడు నరేందర్ ను విడిచిపెట్టేయాలని మహేందర్ అడగలేడు. అలాగని రిమాండుకు వెళుతుంటే చూస్తు ఊరుకోలేడు. ఇదే విషయం అన్నదమ్ముల కుటుంబాల్లో చిచ్చుపెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

మొదటినుండి అన్నదమ్ములిద్దరు టీడీపీ(TDP)లో ఉండేవారు. తర్వాత ఇద్దరూ బీఆర్ఎస్ లో చేరారు. రెండు పార్టీల్లోనూ ఇద్దరూ ఒక వెలుగు వెలిగారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత పరిణామాల్లో మహేందరరెడ్డి తన భార్య పట్నం సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్(Congress) లో చేరారు. తమ్ముడు నరేందర్ మాత్రం బీఆర్ఎస్ లోనే కంటిన్యు అవుతున్నారు. అప్పట్లోనే తమ్ముడు కూడా అన్నతో పాటు కాంగ్రెస్ లోకి వచ్చేసుంటే సరిపోయేది. ఏమాశించి అన్నదమ్ములిద్దరు చెరోపార్టీలో ఉండిపోయారో తెలీదు. నరేందర్ బీఆర్ఎస్ లో కంటిన్యు అవటమే కాకుండా రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్నదమ్ములిద్దరు చెరో పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అలాంటిది సడెన్ గా కలెక్టర్ మీద దాడి కేసులో నరేందర్ తగులుకున్నాడు. అందుకనే పట్నం సోదరులిద్దరికి ఎంత కష్టమొచ్చిందో అని మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News