తెలంగాణలో కౌంటింగ్ ఎలా చేస్తారంటే..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ పర్వం మంగళవారం ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానుంది.పోలీసు బందోబస్తు,మధ్య ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.

Update: 2024-06-03 13:02 GMT
ఓట్ల లెక్కింపు పర్వం (ఫైల్ ఫొటో)

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్‌ నగరంతోపాటు తెలంగాణలో పోలీసులు సీఆర్‌పీసీ 144 సెక్షన్ విధించారు. నలుగురు కంటే ఎక్కువ మంది సమావేశమవడాన్ని నిషేధిస్తూ ఈ సెక్షన్ విధించారు.హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల కౌంటింగ్‌ కేంద్రాలకు మంగళవారం ఎక్కువ మంది ఏజెంట్లు హాజరు అయ్యే అవకాశముంది.కౌంటింగ్ హాలు నుంచి 200 మీటర్ల దూరం వరకు ఎవరినీ అనుమతించమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు.

మద్యం దుకాణాలు మూసివేత

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తెలంగాణలో మద్యం దుకాణాలను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు. మంగళవారం (జూన్ 4) ఉదయం 6 గంటల నుంచి బుధవారం (జూన్ 5) ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.జూన్‌ 4వ తేదీ మంగళవారం వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌, ఫలితాల దృష్ట్యా నగరంలోని వైన్‌షాపులు, కల్లు కాంపౌండ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మద్యం అమ్మకాలు నిషేధించనున్నారు.
పోలీసుల నిషేధాజ్ఞలు
2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం అభ్యర్థుల విజయాన్ని పురస్కరించుకుని బహిరంగ ప్రదేశాల్లో పటాకులు పేల్చడంపై కూడా పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.హైదరాబాద్ నగరంలోని 16 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం పోలీసుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద నగర పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుమోహరించారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిని శిక్షిస్తామని నగర పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వుల్లో తెలిపారు.ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఆయుధాలు, రాళ్లు తీసుకెళ్లరాదు. ఊరేగింపులు,సమావేశాల్లో ఆయుధాలు, కర్రలు ఉపయోగించరాదు ప్రజలు ఎవరైనా లేదా పార్తీల నేతలు మైకులు/పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఉపయోగించడాన్ని నిషేధించారు.

17 పార్లమెంట్ స్థానాలు..1855 టేబుళ్లు
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 34 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. 4వ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్‌ జరిగింది.మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1,855 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లలో, అత్యల్పంగా మూడుచోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతామని తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
తెలంగాణలో 2.18 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వీటి లెక్కింపు కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాల్‌ చొప్పున కేటాయించారు. చేవెళ్ల, మల్కాజిగిరి లోక్ సభ స్థానాలలో రెండేసి హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 500 పోస్టల్‌ బ్యాలెట్లు మించకుండా ఉండేలా ప్రణాళికను సిద్ధం చేశారు.

24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పుర స్థానాల్లో 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది.సిర్పూర్,ఆసిఫాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్, ముథోల్, మానకొండూరు, ఆందోలు, జహీరాబాద్, గజ్వేల్, కార్వాన్, నకిరేకల్, శేరిలింగంపల్లి, ఆలేరు సెగ్మెంట్లలో 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటల్లో 13 రౌండ్లు మాత్రమే ఉంటాయి.

మూడు దశల్లో ఓట్ల లెక్కింపు పరిశీలన
ప్రతి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయిన తరవాత మూడు దశల్లో పరిశీలన ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఓట్ల లెక్కింపు పరిశీలకుడి ఆమోదం తరవాత ఆ రౌండ్‌లో ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ప్రకటిస్తారు.

ర్యాండమ్ గా వీవీ ప్యాట్ల పరిశీలన
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక ఆ నియోజకవర్గంలోని వీవీప్యాట్ల నుంచి ర్యాండమ్‌గా ఐదింటిని ఎంపిక చేసి అందులోని ఓట్లను లెక్కించి ఆ పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన టేబుళ్లలోని ఓట్ల లెక్కలతో సరిచూస్తారు.అన్నీ సక్రమంగా ఉన్నాయని గుర్తించిన తర్వాతే ఓట్ల లెక్కింపును అనుసరించి పరిశీలకుడు ఫలితాన్ని ప్రకటిస్తారు.


Tags:    

Similar News