హిడ్మాకోసం వందలాది ద్రోన్లతో ‘ఆపరేషన్ మాన్ సూన్’

సుమారు 25వేలమంది నేషనల్ పార్క్ అడవులను అణువణువు జల్లెడపడుతున్నారు;

Update: 2025-07-09 08:40 GMT
Maoist hunt with Drones

చత్తీస్ ఘడ్ ఇంద్రావతి నేషనల్ పార్క ఏరియా అడవుల్లో వేలాదిమంది భద్రతాదళాలు మావోయిస్టు కీలకనేత హిడ్మా కోసం వేట మొదలుపెట్టాయి. సుమారు 25వేలమంది నేషనల్ పార్క్ అడవులను అణువణువు జల్లెడపడుతున్నారు. 2026, మార్చి 30 తేదీ డెడ్ లైన్ దగ్గరపడుతున్నకొద్దీ మావోయిస్టుల(Maoists) అగ్రనేతలను వేటాడటమే భద్రతాదళాలు ఆపరేషన్ కగార్ లో టార్గెట్ గా పెట్టుకున్నాయి. మావోయిస్టులను వేటాడేందుకు భద్రతాదళాలు ద్రోన్ల(Drones)ను విరివిగా ఉపయోగిస్తున్నాయి. పోలీసువర్గాల సమాచారం ప్రకారం మావోయిస్టుల ఏరివేతకు భద్రతాదళాలు వందలాది ద్రోన్లను ఉపయోగిస్తున్నాయి. ఈమధ్యనే లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ లభించినట్లు తెలిసింది. అందుకనే వర్షాకాలం అయినప్పటికీ అగ్రనేతలను మట్టుబెట్టడమే లక్ష్యంగా భద్రతాదళాలు అడవుల్లో కూంబింగ్ మొదలుపెట్టాయి.

మామూలుగా వర్షాకాలం మొదలైందంటే మావోయిస్టులకు ఊపిరితీసుకునే సమయంగానే భావించాలి. ఎందుకంటే ఈసమయంలో పోలీసులు అడవుల్లో కూంబింగ్ చేయరు. వర్షాకాలం అడవులంతా చిత్తగా ఉంటుంది. పైగా సీజనల్ వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉంది. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తుండగా, కింద నేలంతా చిత్తడిచిత్తడిగా ఉండటంతో కదలటం కూడా భద్రతాదళాలకు కష్టమే. భారీవర్షాల కారణంగా ఎదురుగా పది అడుగుల దూరంలో ఉన్నది ఎవరో కూడా పోలీసులు గుర్తించలేరు. వర్షాల్లో తడుస్తు చలి కారణంగా జలుబు, దగ్గులతో జ్వరాలు వచ్చేస్తాయి. అనారోగ్యాలతో మావోయిస్టులను అడవుల్లో పట్టుకోవటం, కూంబింగ్ చేయటం దాదాపు కష్టమే. ఈ అడవులన్నీ మావోయిస్టులకు బాగా తెలిసి ఉండటంతో పోలీసులపైన ఎదురుదాడులు చేయటం వాళ్ళకి చాలా సులభం.

ఇదంతా గ్రహించిన తర్వాత అడవుల్లో పోలీసులు కూంబింగ్ చేయటాన్ని పోలీసులు మానుకున్నారు. కాబట్టే వర్షాకాలం మావోయిస్టులకు బ్రీతింగ్ సమయంగా భావిస్తారు. అయితే ఇపుడు సీన్ మారిపోయింది. వర్షాకాలంలో కూడా కూంబింగ్ చేయటానికి అవసరమైన అన్నీ ఏర్పాట్లను భద్రతాదళాలు చేసుకున్నాయి. గతంతో పోల్చితే సాంకేతిక పరిజ్ఞానం పెరగటం, మొబైల్ ఫోన్లు ఉపయోస్తుండటం, ద్రోన్లు, అధునాతన ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి. దానికితోడు అడవులను గాలించేందుకు ఇపుడు వేలదిమంది భద్రతాసిబ్బంది కంకణం కట్టుకున్నారు. అందుకనే రెట్టించిన ఉత్సాహంతో భద్రతాదళాలు అడవుల్లో వందలాది ద్రోన్లతో కూంబింగ్ మొదలుపెట్టారు.

ఇన్నివేలమంది వందలాది ద్రోన్లతో అడవులను గాలిస్తున్నారంటేనే మాడ్వీ హిడ్మా(Maoist leader Hidma) ఎంత కీలకనేతో అర్ధమవుతోంది. వర్షాకాలంలో మొదలైన కూంబింగ్ కాబట్టే దీనికి భద్రతాదళాలు ‘ఆపరేషన్ మాన్ సూన్’ అని పేరు పెట్టారు. ఈమధ్యనే బస్తర్(Bastar) ఐజీ సుందర్ రాజ్ మీడియాతో మాట్లాడుతు ‘మావోయిస్టులు లొంగకపోతే ఎన్ కౌంటర్ చేయటం ఖాయమ’ని చేసిన హెచ్చరికలు అందరికీ తెలిసిందే. మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ భద్రతాదళాలకు తెలిసిన కారణంగానే వేలాదిమంది ఒకేసారి అడవుల్లో గాలింపు మొదలుపెట్టారు. లొంగిపోయిన మావోయిస్టులే తమఅగ్రనేతల హైడ్ అవుట్ల ఆచూకీని భద్రతాదళాలకు ఉప్పందించారన్నది సమాచారం.

ఇపుడు మొదలైన కూంబింగ్ అచ్చంగా హిడ్మా టార్గెట్ గానే అని చెప్పచ్చు. హిడ్మా ఆచూకీకోసమే భద్రతాదళాలు ఏళ్ళతరబడి ప్రయత్నిస్తున్నారు. ఈమధ్యనే ఈఅగ్రనేత ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. కర్రెగుట్టల్లో రెండుసార్లు భద్రతాదళాల ఎన్ కౌంటర్ల నుండి తృటిలో తప్పించుకున్నాడు. అప్పటినుండి హిడ్మాను ఎలాగైనా పట్టుకుకోవాలన్న కసి భద్రతాదళాల్లో పెరిగిపోయింది. హిడ్మాతో పాటు మరో అగ్రనేత గణపతి, కేంద్రకమిటి సభ్యులు సుజాత, పుల్లూరి ప్రసాదరావు ఆచూకీకి కూడా భద్రతాదళాలకు దొరికినట్లు సమాచారం. 1500 అడుగుల ఎత్తులో ఎగురుతూ హై రిజల్యూషన్ ఫోటీలు, వీడియోలను కమాండ్ కంట్రోల్ రూముకు పంపగల వందలాది ద్రోన్లు అడవుల్లో గాలిస్తున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News