లద్దాఖ్ లడాయి ఎందుకంటే...హైదరాబాద్ క్లైమెట్ ఫ్రంట్ సంఘీభావం

లద్దాఖ్ సాగుతున్న పోరుకు హైదరాబాద్ క్లైమెట్ ఫ్రంట్ సంఘీభావం ప్రకటించింది. హిమాలయాలు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదీలు మార్చ్ చేశారు.

Update: 2024-04-07 15:32 GMT

భూమి కోసం...భుక్తి కోసం...లద్దాఖ్కు రాష్ట్ర హోదా కోసం లద్దాఖ్ ప్రాంత ప్రజలు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం తీవ్రమైంది. త్రీ ఇడియట్ కథలో రియల్ హీరో, ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ ఎముకలు కొరికే చలిలో మార్చి 6వతేదీ నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. క్లైమెట్ ఫాస్ట్ పేరిట లేహ్ లో వాంగ్ చుక్ చేస్తున్న దీక్షకు దేశవ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తుతోంది. లేహ్, కార్గిల్ లోని కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్ ఆధ్వర్యంలో 5వేల మంది 3 రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టారు. 2019వ సంవత్సరం ఆగస్టు 5వతేదీన 370 ఆర్టికల్ ను రద్దు చేసి యూనియన్ టెర్రటరీగా ప్రకటించడంతో లద్దాఖ్ ప్రాంత ప్రజలు ఆందోళన బాట పట్టారు.



నినాదాలతో మారుమోగిన లమకాన్
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాంగ్ చుక్ చేస్తున్న నిరాహారదీక్షకు మద్ధతుగా, లద్దాఖ్ ను రక్షించాలనే డిమాండుకు తెలంగాణ ప్రజాసంఘాల కార్యకర్తలు మద్ధతు ఇస్తున్నారు. హైదరాబాద్ లోని లమకాన్ లో ఆదివారం ప్రజా స్ఫూర్తి ఉన్న తెలంగాణ పౌరులు, సామూహిక సంఘాలు సమావేశమై లద్దాఖ్ లడాయికి పూర్తి మద్ధతు ప్రకటించారు. లద్దాఖ్ ను రక్షించండి అంటూ ప్రజాస్వామిక వాదులు చేసిన నినాదాలతో లమకాన్ క్యాంపస్ మారుమోగింది. జీవ వైవిధ్యాన్ని, హిమాలయాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ వారు నినాదాలు చేశారు.

అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుతంగా మార్చ్
లద్దాఖ్ కు 6వ షెడ్యూల్, రాష్ట్ర హోదాను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పౌరులు లమకాన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుతంగా మార్చ్ చేశారు. ఈ మార్చ్ లో డాక్టర్ బాబురావు, సాగర్ ధార, సుమిత్ర, నటాషా రామరత్నం, భాను, శ్రీహర్ష, అనిత, రుచిత్, మీరా సంఘమిత్ర తదితరులతో సహా పర్యావరణవేత్తలు, స్త్రీవాదులు, రైతు హక్కులు, యువజన కార్యకర్తలు ఇతర ఆందోళనకారులు కవాతు నిర్వహించారు.

తెలంగాణ సంఘాల ఆందోళన
చాంగ్‌తాంగ్ సరిహద్దు ప్రాంతంలో పశుపోషణ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు,చైనా చేస్తున్న ప్రయత్నాలపై ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.వాతావరణ సంక్షోభం, కార్పొరేట్ దాడుల నుంచి మన జీవావరణ శాస్త్రాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ పౌరులు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంఘీభావ మార్చ్ ను నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్,హైదరాబాద్ క్లైమేట్ ఫ్రంట్, లమకాన్ తెలంగాణ విభాగం నిర్వహించాయి.

లడాఖ్ ప్రాంతం పరిరక్షణ కోసం ఉద్యమం


 ఇవీ డిమాండ్లు

లద్దాఖ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచి, 6వ షెడ్యూల్‌కు హోదా కల్పిస్తామని 2019 ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయడంలో బీజేపీ సర్కారు విఫలమైందని హైదరాబాద్ క్రైమెట్ ఫ్రంట్ డిప్యూటీ డైరెక్టర్ రుచిత్ ఆషా కమల్ ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు. కేంద్రం అభివృద్ధి పేరిట లద్దాఖ్ ప్రాంతంలో పర్యవరణాన్ని దెబ్బతీస్తుంది, లద్దాఖ్ లోని హిమాలయాల నుంచే మన దేశంలో నదులు ప్రవహిస్తున్నాయని, దీనికి విఘాతం కలిగించే చర్యలు కేంద్రం మానుకోవాలి’’ అని రుచిత్ ఆషా కమల్ డిమాండ్ చేశారు. లద్దాఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని, 6వ షెడ్యూల్ ప్రకారం స్థానికులకు భూమి, ఉద్యోగాల్లో హక్కులు కల్పించాలని ఆయన కోరారు. లేహ్, కార్గిల్ ప్రాంతాలకు రెండు లోక్ సభ సీట్లను కేటాయించాలని, ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.


Tags:    

Similar News