దేశంలోనే 128 సంచలన కేసులు.. రూ.18 కోట్లు.. ఇలా బుక్కైపోయారు
స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రాబట్టుకోవచ్చని నగర వాసుల్ని నమ్మించారు.
కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. ఏళ్ళ తరబడి వెయిట్ చేయకూడదు. రాత్రికి రాత్రే రూ. కోట్లు వచ్చేసెయ్యాలి. ఇలా ఈజీ మనీ కోసం సైబర్ నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ట్యాలెంట్ ని టెక్నాలజీని ఉపయోగించి భారీ మోసాలకు పాల్పడుతున్నారు క్రిమినల్స్. విశేషమేమిటంటే వీళ్ళ టార్గెట్ కూడా ఈజీ మనీ కోసం ఆశ పడేవాళ్ళే. ఉదాహరణకి మీరు రూ. 100 పెట్టుబడి పెడితే నెల తిరిగేసరికి రూ.1000 లాభం వస్తుంది అనగానే ఎక్కువ సొమ్ము వస్తుంది అని ఆశపడి పెట్టుబడి పెట్టేస్తుంటారు కదా.. అలాంటి అమాయకులనే వీళ్ళు బురిడీ కొట్టిస్తారన్నమాట.
సరిగ్గా ఇదే తరహాలో స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రాబట్టుకోవచ్చని నగర వాసుల్ని నమ్మించారు. దేశవ్యాప్తంగా 128 కేసుల్లో రూ. 18 కోట్లు కొట్టేశారు. కానీ ఒకరి ఫిర్యాదుతో పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. వేర్వేరు కేసుల్లో ఇద్దరు సైబర్ క్రిమినల్స్ తో పాటు వారికి బ్యాంక్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మరో ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధికలాభాలు వస్తాయని సాయిగౌడ్, సాయికుమార్ బల్కంపేటకి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.58 లక్షల 60వేలు దోచుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నిందితులపై 45 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం రూ.13 కోట్ల రూపాయల వరకు మోసాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధరించారు.
ఇంకొక కేసులో ట్రేడింగ్ పేరిట మోసాలకి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్స్ అందిస్తున్న ఉప్పల్ కు చెందిన సురేంద్ర, నరేశ్ బాబు లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోసాల ద్వారా వచ్చిన డబ్బులో సైబర్ నేరగాళ్లు నిందితులకి ఒకటిన్నర శాతం కమిషన్ ఇస్తున్నట్టు పోలీసులు తేల్చారు. సైబర్ నేరగాళ్లకు ఇప్పటివరకు నిందితులు 8 ఖాతాలు సమకూర్చినట్టు, వీటి ద్వారా రూ. 5 కోట్ల ట్రాన్సక్షన్స్ జరిపినట్టు దర్యాప్తులో బయటపడింది. NCRB (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నిందితులపై 83 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.