HYDERABAD | లగ్జరీ ఇళ్ల విక్రయాల్లో హైదరాబాద్ అధరహో
హైదరాబాద్ నగరం దేశంలోనే మూడవ అతిపెద్ద లగ్జరీ రియాలిటీ మార్కెట్ గా వృద్ధి చెందింది.హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోళ్లలో స్వల్ప పెరుగుదల కనిపించింది.;
By : The Federal
Update: 2025-02-07 13:37 GMT
హైదరాబాద్ నగరం దేశంలోనే మూడవ అతిపెద్ద లగ్జరీ రియాలిటీ మార్కెట్ గా వృద్ధి చెందింది. 2024వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో రూ.10 కోట్లకు పైగా ధశర ఉన్న 689 లగ్జరీ రెసిడెన్షియల్ ఇళ్ల విక్రయాలు సాగాయి. రూ.10,312 కోట్ల విలువ గల లగ్జరీ ఇళ్ల విక్రయాలు జరిగాయని సీఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదిక తెలిపింది. దేశంలో లగ్జరీ ఇళ్ల విక్రయాల్లో ముంబయి, ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నగరం బెంగళూరు, చెన్నై, పూణే నగరాలను అధిగమించి ఎక్కువ లగ్జరీ ఇళ్లు విక్రయించారని తేలింది. హైదరాబాద్ రియాల్టీ రంగంలోకి కొత్తగా గోద్రేజ్ ప్రాపర్టీస్, బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ సంస్థలు రంగంలోకి దిగాయి.
హైదరాబాద్ నగరంలో చెరువులు,నాలాలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో కొనుగోలు దారులు అప్రమత్తమయ్యారు. ఇండిపెండెంట్ ఇళ్లు, ఫ్లాట్లు కొనేముందు కొనుగోలుదారులు అన్ని వివరాలను పరిశీలించి, వాస్తవాలు, స్థలాల డాక్యుమెంట్లను నిర్ధారించుకున్న తర్వాతే ఇళ్లను కొనుగోలు చేస్తున్నారని స్క్వేర్ యార్డ్స్ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. గత ఏడాది జులై నెలలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) ఏర్పాటయ్యాక గృహాల రిజిస్ట్రేషన్లు ఆశించినంతగా పెరగలేదని తేలింది. కొనుగోలు దారులు గృహ నిర్మాణ ప్రాజెక్టులను నిశితంగా పరిశీలిస్తుండటంతో ఇళ్ల లావాదేవీలు మందగమనంగా సాగాయని వెల్లడైంది.
ఇళ్ల కొనుగోళ్లలో స్వల్ప పెరుగుదల
2023వ సంవత్సరంలో 74,495 ఇళ్ల కొనుగోలు లావాదేవీలు జరిగాయని స్క్వేర్ యార్డ్స్ తన నివేదికలో పేర్కొంది. 2024వ సంవత్సరంలో 75,512 ఇళ్లను కొనుగోలు చేశారని తేలింది. అంటే హైదరాబాద్ నగరంలో ఇళ్ల కొనుగోళ్లలో స్వల్ప పెరుగుదల ఉంది.ఎక్కువ మంది రూ.60 లక్షల నుంచి కోటిరూపాయల విలువ గల ఇళ్లను కొనుగోలుకు ఎక్కువ మంది ముందుకు వచ్చారు. ఐటీ పార్కులు, నగరంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తుండటంతో ఇళ్ల కొనుగోళ్లు క్రమేణా పెరుగుతున్నాయని వెల్లడైంది.
టాప్ టెన్ రియాల్టీ సంస్థల జోరు
హైడ్రా దెబ్బకు గత ఏడాది అక్టోబరు,డిసెంబరు నెలల్లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయి.మైక్రోసాఫ్ట్ తోపాటు ఐటీ సంస్థల విస్తరణతో హైదరాబాద్ నగరంలో టాప్ టెన్ రియాల్టీ సంస్థలైన అపర్ణ కన్ స్ట్రక్షన్స్, బ్రిగేడ్, ప్రెస్టేజ్ గ్రూప్, కే రహేజా కార్పొరేషన్, డీఎస్ఆర్ శ్రీ శ్రీనివాస కన్ స్ట్రక్షన్, వాసవి గ్రూప్, అరబిందో రియాల్టీ, ఇండీస్ గ్రూప్, రాంకీ గ్రూప్, కాన్సెప్ట్ ఆంబియన్స్ గ్రూప్ రియల్ సంస్థలు కోట్లాది రూపాయల ఇళ్లను విక్రయించాయి.
వెస్ట్ జోన్ లో పెరిగిన ఇళ్ల కొనుగోళ్లు
కోటి రూపాయల విలువపైగా ఇళ్ల కొనుగోలు చేసే వారి సంఖ్య 13 శాతం పెరిగిందని తాజా నివేదికలో వెల్లడైంది.బాచుపల్లి, మియాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, పుప్పాలగూడ ప్రాంతాల్లో 16 శాతం ఇళ్ల విక్రయాలు పెరిగాయని నివేదిక తెలిపింది. హైదరాబాద్ నగరంలో 15,941 ఇళ్ల కొనుగోళ్లు జరగ్గా ఒక్క వెస్ట్ జోన్ లోనే 7,291 ఇళ్లను కొనుగోలు చేశారు. ఈస్ట్ జోన్ లోనూ 2,591 మంది ఇళ్లను కొనుగోలు చేశారు. మూసీ నదీ పునరుజ్జీవ ప్రాజెక్టు, ఐటీ పార్కుల్లో పెరిగిన పెట్టుబడులతో హైదరాబాద్ ప్రాభవం పెరుగుతుందని అంచనా వేశారు.