ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఈ సారి కూడా ఈ స్థానం ఏకగ్రీవం అవుతుందని భావించినప్పటికీ అనూహ్యంగా బీజేపీ రంగంలోకి దిగడంతో 22 ఏళ్ల తర్వాత ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది.;

Update: 2025-04-23 10:40 GMT

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 88 ఓట్లు పోల్ అయ్యాయి. పోలింగ్ ముగిసే సమయానికి 78.57 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్‌ను బీఆర్ఎస్ బహిష్కరించడంతో మిగిలిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు, అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.

ఎంఐఎంకే ఆస్కారం..

అత్యధిక ఓట్లు ఎంఐఎం పార్టీకే ఉండటంతో ఈ ఎన్నికల పోలింగ్ లాంఛన ప్రాయంగా ఉండనున్నాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్సీ స్థానంలో ఎంఐఎంకు మొత్తం 49 ఓట్లు ఉన్నాయి. బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు, ఆరుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 25 ఓట్లే ఉన్నాయి. ఈ విషయం తెలిసినప్పటికీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా బీజేపీ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది.

22ఏళ్ల తర్వాత తొలిసారి

అయితే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఈ స్థానంలో ఈ 22 ఏళ్లుగా పోలింగ్ అనేది జరగలేదు. అభ్యర్థి ఏకగ్రీవమే జరిగింది. కాగా ఈసారి పోటీలో నిలబడాల్సిందేనని బీజేపీ నిశ్చయించుకోవడంతో పోలింగ్ అనివార్యమైంది. ఈ ఎన్నికలో మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గౌతంరావు, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ పోటీకి దూరంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఓటింగ్‌లో సైతం పాల్గొనబోమని ప్రకటించింది. దీంతో ఎంఐఎం, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. మే 1న ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీకాలం ముగియనుండటంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ సారి కూడా ఈ స్థానం ఏకగ్రీవం అవుతుందని భావించినప్పటికీ అనూహ్యంగా బీజేపీ రంగంలోకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది.

Tags:    

Similar News