KTR | ‘నిపుణుల సూచన మేరకే విచారణకు హాజరు’

ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విషయంలో దర్యాప్తు సంస్థలు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటపడుతున్నాయి.;

Update: 2025-01-04 08:41 GMT

ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విషయంలో దర్యాప్తు సంస్థలు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటపడుతున్నాయి. తొలుత కేసును ఏసీబీ దాఖలు చేసినా తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఈడీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఏసీబీ కన్నా ముందే జనవరి 7వ తేదీన విచారణకు హాజరవ్వాలంటూ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా తాజాగా ఏసీబీ కూడా కేటీఆర్‌కు నోటీలిచ్చింది. జనవరి 6వ తేదీన విచారణకు రావాలని పిలిచింది. దీంతో మాజీ మంత్రిని విచారించడానికి దర్యాప్తు సంస్థలు పోటీ పడుతున్న తరహాలో ఉంది. ఇదిలా ఉంటే ఈడీ విచారణకు రావాల్సిన హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్.. ఇద్దరూ కూడా సమయం కావాలంటూ లేఖలు రాసి విచారణను వాయిదా వేయించుకున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల విచారణకు కేటీఆర్ ఎంత మాత్రం హాజరవుతారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాగా తాజాగా ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. తనకు ఇచ్చిన నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు తెలిపారు.

అన్నీ తప్పుడు కేసులే

‘‘పార్ములా కేసు విషయంలో ఏసీబీ, ఈడీ అధికారుల విచారణకు హాజరు విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాను. న్యాయ నిపుణుల సూచనల ప్రకారం హాజరు అయ్యే విషయం చెబుతాను. ఇవన్నీ కూడ తప్పుడు కేసులే. నన్ను అరెస్ట్ చేసేందుకే ప్రభుత్వం పన్నిన కుట్ర. ఈ కుట్ర నుండి త్వరలోనే బయటపడుతాను. సీఎం రేసు‌ విషయంలో కేటీఆర్, కవితపై తప్పుడు ‌ప్రచారం చేస్తున్నారు. మా‌ నాయకుడు కేసీఆర్ అయనే ముఖ్యమంత్రి అవుతారు. సీఎం రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పెందుకు రొడ్డు ఎక్కుతున్నాను. కేసులు, అరెస్టులు వంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు. ప్రభుత్వం మెడలు వంచుతాం’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఎస్ నుంచి టీడీగా పేరు మార్చడానికి ఈ ప్రభుత్వం రూ.1000 కోట్లు దుబారా ఖర్చు చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు గతి లేదు కానీ దుబారా ఖర్చుల్లో మాత్రం ఈ ప్రభుత్వం రికార్డులు సృష్టించేలా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఒక్క అక్షరం కోసం అంత ఖర్చా..?

‘‘2014లో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పేరును టీఎస్ అంటే తెలంగాణ స్టేట్‌గా మార్చింది. కానీ 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. టీఎస్‌ను టీజీగా మార్చేసింది. ఆ ఒక్క ఒక్షరం మార్చడానికి ఈ ప్రభుత్వం రూ.1000 ఖర్చు చేసింది. రైతు భరోసా ఇచ్చింది లేదు. రుణమాఫీ సక్కగా చేసింది లేదు. పెన్షన్ పెంచింది లేదు. ఆరుగ్యారెంటీల అమలుకు దిక్కులేదు. కానీ ఆగమేఘాల మీద అనవసరమైన వాటి కోసం వేల కోట్లు ఖర్చు పెట్టడానికి మనసు ఎలా వచ్చింది’’ అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు కేటీఆర్. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా? వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేవు! నాలుగు కోట్ల గుండెలపై కెసిఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవు..! పాలన చేతకాక తెలంగాణ అస్థిత్వాన్ని చెరిపే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం’’ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

Tags:    

Similar News