‘అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు’

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళన చేస్తే కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోంది. మూసీ ప్రక్షాళన కు ఎందుకు కిషన్ రెడ్డి నిధులు తీసుకురావడం లేదు.;

Update: 2025-03-02 12:26 GMT

తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని, కలలో కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే ఆలోచిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను మేటి రాష్ట్రంగా మార్చడమే తమ పార్టీ కల అని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు. కానీ ప్రతిపక్షాలు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటా అంటే ఊరుకునేది లేదన్నారు. వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజలకు సంక్షేమం అందించడానికే తమ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ప్రజలు తమను నమ్మారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయమని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని పునరుద్ఘాటించారు.

‘‘వనపర్తి తో నాకు అనుబంధం ఉంది.. వనపర్తి నాకు చదువుతో పాటు సంస్కారాన్ని ఇచ్చింది. వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్న.. రాజకీయాల్లో నేను రాణించడం లో వనపర్తి పాత్ర ఉంది. వనపర్తి ప్రాంతంలో ఎన్నటికి తెగిపోని బంధం నాది. వనపర్తి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో వనపర్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐదేళ్ల క్రితం వనపర్తి లో గెలిచిన ఎమ్మెల్యే రాజకీయాలను కలుషితం చేశారు. వనపర్తి లో అనేక విద్యాసంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వాలే పునాది వేశాయి. వనపర్తిలో నేను నేర్చుకున్న రాజకీయ చైతన్యం తోనే తెలంగాణ ముఖ్యమంత్రి గా మీ ముందు నిలబడ్డా. 25 లక్షల 50 వేల రైతులకు 22 వేల కోట్ల రుణమాఫీ జరిగిందా లేదా గుండెలపై చేయి వేసుకొని చెప్పాలి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి’’ అని ఆరోపించారు.

‘‘మా ప్రభుత్వం ఏర్పడగానే 7625 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేశాం. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్ల కు పైగా పెరిగినా ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా చూస్తున్నాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మహిళలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. యాభై లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. యాభై లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. బీఆర్ఎస్ ,బీజేపీ వాళ్లకి ఆడబిడ్డలు చలాకీ కాల్చి వాత పెట్టాలి. బీఆర్ఎస్, బీజేపీ వాళ్ల కు ఆడబిడ్డ లు గుణపాఠం చెప్పాలి. 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం చేశారు..దాని కోసం 4500 కోట్ల రూపాయలు చెల్లించాం. స్వయం సహాయక సంఘాలను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.. సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేదు. వనపర్తి సాక్షి గా ఈ రోజు 1000 కోట్ల రూపాయల రుణాలను ఆడబిడ్డలకు ఇచ్చాం’’ అని వెల్లడించారు.

‘‘రాష్ట్రంలో 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయి. స్వయం సహాయక సంఘాలను ఆదుకునే బాధ్యత నాదే. హైటెక్ సిటీ శిల్పారామం పక్కనే స్వయం సహాయక మహిళల కోసం 150 స్టాల్స్ ఏర్పాటు చేశాం. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థల పక్కనే మహిళా సంఘాలకు మూడున్నర ఎకరాల స్థలం ఇస్తారని ఎప్పుడైనా ఊహించారా..? అదానీ, అంబానీ లే కాదు స్వయం సహాయక మహిళలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నాం. 1000 బస్సులను స్వయం సహాయక మహిళలతో కొనుగోలు చేయించి ఆర్టీసీ కి అద్దెకు ఇచ్చేలా చేశాం. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు బట్టలు కుట్టే పనిని స్వయం సహాయక మహిళలకు కల్పించాం. ప్రభుత్వ పాఠశాలను నిర్వహించే బాధ్యత ను స్వయం సహాయక సంఘాలకు మహిళలకు ఇచ్చాం’’ అని తెలిపారు.

‘‘రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల ను మహిళల పేరుతో ఇస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు క్రియాశీలకంగా పనిచేశారు. 10 యేళ్లలో కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కాని ఆయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యం లో మొదటి ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వం వచ్చిన యేడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. 22 వేల టీచర్లకు ప్రమోషన్లు, 35 వేల టీచర్లకు బదిలీలు చేసి వారి సమస్యలు పరిష్కరించాం. పదేళ్ల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుని ప్రజల గురించి ఆలోచించలేదు. పదేళ్లలో ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ప్రజలు ఎందుకు వలస పోతున్నారు. వలసలు పోతున్న పాలమూరు ప్రజల గురించి కేసీఆర్ ఏనాడైనా ఆలోచన చేశారా..? పదేళ్లలో పాలమూరును ఎందుకు పూర్తి చేయలేదు.. బీమా,కల్వకుర్తి, నెట్టంపాడు ఎందుకు పూర్తి చేయలేదు..? .ఆర్డీఎస్ ఎందుకు ఎండిపోయింది..?’’ అని ప్రశ్నించారు.

‘‘ఎస్ ఎల్ బీసీ పదేళ్ల పాటు పడాగ పెట్టడం తో కుప్పకూలిపోయింది.. ఈ పాపం కేసీఆర్ ది కాదా..? ఆంధ్రావాళ్లు రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి కుంటు కేసీఆర్ చూడలేదా..? ప్రగతి భనవ్ కు జగన్ ను పిలిచి పంచభక్ష పరమాన్నం పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాది రాయి వేసింది కేసీఆర్ కాదా..? రోజమ్మ ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని రాయలసీమ రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అనలేదా..? మహబూబ్ నగర్ ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకొని ఎంపీ గా గెలిపించుకుంటే కేసీఆర్ ఏం చేశావు..? పాలమూరు ద్రోహి కేసీఆర్.. కృష్ణా జలాలు ఆంధ్రా తరలించుకు పోతున్నారంటే దానికి కారణం కేసీఆర్ దుర్మార్గం వల్లనే. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణ కు అన్యాయం జరిగేలా సంతకం పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్.. ఆ సంతకమే తెలంగాణకు యమపాశంగా మారింది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘పాలమూరు రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాను. పాలమూరు ను పడాగ పెట్టింది కేసీఆరే.. నమ్మినందుకు నట్టేట ముంచాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యేడాది కాకముందే మమ్మల్ని దిగిపోమని బీఆర్ఎస్ సన్నాసులు అంటున్నారు. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వ లేకపోతున్నారు. మా పాలమూరు బిడ్డలకు పరిపాలించే శక్తి లేదా..? పాలమూరు వాళ్లది అమాయకత్వం కాదు మంచితనం.. తిక్క రేగితే డొక్క చీల్చి డోలు కడతం జాగ్రత్త. కేసీఆర్ నువ్వు చెప్పే హరికథలు, పిట్టకథలు నడవవు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదినది పాలమూరు బిడ్డ జిల్లెల చిన్నారెడ్డి. నానా కష్టాలు పడి వరంగల్ కు ఎయిర్ పోర్టు తీసుకువస్తే కిషన్ రెడ్డి నేనే తీసుకువచ్చానని చెపుతున్నాడు. మెట్రో విస్తరణ అనుమతులు , మూసీ నది ప్రక్షాళనకు నిధులు , రీజనల్ రింగ్ రోడ్డు కు అనుమతులు , పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు, కాళేశ్వరానికి నీటి కేటాయింపులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు’’ అని ఆరోపించారు.

‘‘తెలంగాణ ఏదైనా వస్తే తన ఖాతాలో కిషన్ రెడ్డి వేసుకుంటున్నాడు. 12 యేళ్ల మోదీ 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మోదీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో కిషన్ రెడ్డి లెక్కపెట్టి చెప్పాలి. తెలంగాణలో మోదీ రెండు బోడి ఉద్యోగాలు ఇచ్చాడు..కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి పదవులు ఇచ్చారు. సికింద్రాబాద్ లో వరదలు వచ్చి కొట్టుకుపోతే కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. కిషన్ రెడ్డి కడుపు నిండా అసూయ, కుళ్ళు పెట్టుకుని కాళ్లలో కట్టెలు పెడుతున్నాడు. హైదరాబాద్ కు కేంద్ర మంత్రి వచ్చి సమీక్ష చేస్తే కిషన్ రెడ్డి ఎందుకు హాజరుకాలేదు..? ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి వస్తే గల్లీలో ఉన్న నువ్వు ఎందుకు సమీక్షకు రావు..? నీ దుర్భుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు. కిషన్ రెడ్డి కడుపు నిండా కుళ్లు పెట్టుకున్నాడు. రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, నిధులపైన అన్ని పార్టీల ఎంపీలతో భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహిస్తారు’’ అని వివరించారు.

‘‘అందరం కలిసి కేంద్రం దగ్గరకు వెళ్లి రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడుగుదాం. నిర్మలా సీతారామన్ తమిళనాడుకు మెట్రో తీసుకువెళ్లింది. కేంద్ర మంత్రి శోభా బెంగళూరు కి మెట్రో తీసుకెళ్లింది. సొంత రాష్ట్రం తెలంగాణ కు కిషన్ రెడ్డి ఎందుకు మెట్రో తీసుకురాడం లేదు..? ఎంత కాలం భయపెడతవు కిషన్ రెడ్డి.. చావు మళ్లీ మళ్లీ రాదు.. చావుకు మేం భయపడం. నాకు భేషజాలు లేవు.. నేను స్వయంగా నీ ఇంటికి వచ్చి తెలంగాణ సమస్యలను వివరించాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళన చేస్తే కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోంది. మూసీ ప్రక్షాళన కు ఎందుకు కిషన్ రెడ్డి నిధులు తీసుకురావడం లేదు. కిషన్ రెడ్డి ఎందుకు పాములా బుస కొడుతున్నవు..ఎందుకు పగ పడుతున్నవు..? తెలంగాణ కు ఏదో ఒకటి చేయాలని మోదీ సానుభూతి తో ఉన్నాడు.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. సైంధవుడిలా అడ్డుపడుతున్నాడు. తన మిత్రుడు కేసీఆర్ అధికారం పోయిందని కిషన్ రెడ్డి బాధపడుతున్నాడు. నేను తెలంగాణను అభివృద్ధి చేయవద్దా..? పాలమూరు అభివృద్ధి కి ఎవరూ అడ్డుపడినా సహించను’’ అని హెచ్చరించారు.

Tags:    

Similar News