హైదరాబాద్ లో ఇందిరమ్మ క్యాంటిన్లు ప్రారంభం
ఐదు రూపాయలకే టిఫిన్
ఐదు రూపాయలకే టిఫిన్ ఇందిరమ్మ క్యాంటిన్లు సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ఇప్పటికే ఈ పథకం అమలులో ఉంది. పేద ప్రజలు, కూలీలు, ఆటో డ్రైవర్లకు లబ్ది చేకూర్చే ఈ పథకం ద్వారా ప్రతీరోజు సగటున 30 వేల మంది లబ్దిపొందుతున్నారు. మోతీనగర్, మింట్ కంపౌండ్, ఖైరతాబాద్ లలో ఏర్పాటు చేసిన క్యాంటిన్లలో ఆధునిక ఫుడ్ కంటైనర్లు, కూర్చునే సదుపాయం, తాగు నీటి ఆర్వో ప్లాంట్, చేతులు శుభ్రం చేసుకునే బేసిన్, డ్రైనేజి, ఎలక్ట్రి సిటీ కనెక్షన్లు ఉన్నాయి.
ప్రస్తుతం ఐదు రూపాయలకే ఇందిరమ్మ భోజనం పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12.3 కోట్ల భోజనాలు పంపిణీ చేసింది. 254 కోట్ల రూపాయలు వెచ్చించింది. జిహెచ్ఎంసీ పరిధిలో 150 క్యాంటిన్లు నడుస్తున్నాయి. శుచి, శుభ్రతకు పెద్ద పీట వేసే ఇందిరమ్మ క్యాంటీన్లు అల్పాహరం కూడా ప్రారంభించడం పట్ల పలువురు హర్షం వెలిబుచ్చారు. హరికృష్ణ ఫౌండేషన్ భోజనాలు, టిఫిన్ సరఫరా చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. . ఆకలి లేని హైదరాబాద్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు.
అభాగ్యులకు వరం
హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ పథకంలో భాగంగా పలు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ క్యాంటిన్లు పేదలకు రు 5 కే మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాయి. అక్కడ భోజనం చేసేవారందరూ టిఫిన్ కూడా పెడితే ఎంత బాగుంటుంది అనుకోని రోజు లేదు. అలాంటి ఆలోచనే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ టిఫిన్ క్యాంటిన్లు భాగ్యనగరంలోని అభాగ్యులకు వరంలా రాబోతున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో నడుస్తున్న అన్నపూర్ణ కేంద్రాల రూపురేఖలు మార్చి, ఇప్పుడు అమలవుతున్న ఐదు రూపాయల భోజనం తో పాటు ఐదు రూపాయలకు టిఫెన్ కూడా అందుబాటులో వచ్చింది.
మిల్లెట్స్ కూడా..
ఐదు రూపాయలకే మిల్లెట్ టిఫిన్,ఇడ్లీ, ఉప్మా, పూరి వంటి అల్పాహారాలు అందిస్తారు. ప్రతిరోజూ 30 వేల మంది పేదలకు మంచి టిఫెన్ తక్కువకే అందించే ఈ పథకాన్ని జీహెచ్ఎంసీ ,హరేరామ హరేకృష్ణ పౌండేషన్ తో కలిసి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఆగస్టు 15 నుంచి ఇందిరమ్మ టిఫిన్ క్యాంటిన్లు ప్రారంభించాలని అనుకున్నా కుదరలేదు. సెప్టెంబర్ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇందిరమ్మ క్యాంటిన్లు ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. సమయాభావం వల్ల ఈ క్యాంటీన్లు ప్రారంభించలేకపోయారని అధికారులు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో వున్న 150 డివిజన్ లలో ఉన్న ఈ క్యాంటిన్లు కూడా ఆదివారం వుండవు. వారానికి ఆరు రోజులు తెరచి వుంటాయని అధికారులు చెప్పారు.
ఇందిరమ్మ క్యాంటీన్లలో ఒక్కో ప్లేట్ టిఫిన్ కోసం మొత్తం 19 రూపాయలు ఖర్చు అవుతుండగా.. దీనిలో జీహెచ్ఎంసీ వాటాగా రూ.14 చెల్లించనుండగా.. మిగతా 5 రూపాయలను లబ్దిదారుల నుంచి వసూలు చేస్తారు.రూ.5కి అందించే భోజనంలో 400 గ్రాముల రైస్, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల కూరగాయలు 15 గ్రాముల పచ్చడి అందిస్తున్నారు. ఒక్కో ప్లేటు భోజనానికి రూ.27.63 ఖర్చు అవుతుంది. దీనిలో లబ్ధిదారులు రూ.5 చెల్లిస్తుండగా, మిగిలిన రూ.24.83లను జిహెచ్ఎంసీ భరిస్తుంది. ఈ పథకం కోసం జిహెచ్ఎంసీ ప్రతి సంవత్సరం సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేస్తోంది. రూ.5కే భోజనం కార్యక్రమం మాదిరే టిఫిన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు.