'ముగ్గురు పిల్లల' నిబంధన ..ఆశావహుల్లో టెన్షన్

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీదారులను వెంటాడుతున్న పాత నిబంధన.వారు అనర్హులేనా?

Update: 2025-09-29 09:37 GMT

తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో పల్లెల్లో రాజకీయ వేడి రాజుకుంది. అయితే తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో మార్పుకు నోచుకోని ముగ్గురు పిల్లల నిబంధన ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఎంతోమంది ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల ప్రకటనతో సంతోషించాలో, ఈ నిబంధన చూసి నిరాశ చెందాలో తెలియని గందరగోళంలో పలువురు నేతలు ఉన్నారు.ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ నిబంధన కారణంగా చాలా మంది నాయకులు పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనను ఇప్పటికే రద్దు చేసింది. కానీ, తెలంగాణలో మాత్రం పాత నిబంధనే కొనసాగుతోంది.ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో, ఈ 'ముగ్గురు పిల్లల' నిబంధనపై ప్రభుత్వం ఏమైనా స్పష్టత ఇస్తుందా? అనే చర్చ మొదలైంది. ప్రభుత్వం ఈ నిబంధనను సడలిస్తే ఎంతోమందికి అవకాశం లభిస్తుందని, లేకపోతే అనర్హత వేటు తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు అక్టోబర్‌ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా, గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్‌ 31న, రెండో విడత నవంబర్‌ 4న, మూడో విడత నవంబర్‌ 8న నిర్వహించనున్నారు.కాగా రాష్ట్ర వ్యాప్తంగా 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు,12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Tags:    

Similar News