బీఆర్ఎస్ తప్పులను కాంగ్రెస్ సరిదిద్దుతోంది: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజల మనసులకు తెలుసన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Update: 2025-09-29 09:41 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లాలని బీఆర్ఎస్ శాయశక్తులా ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్‌పై లేనిపోని అభాండాలు వేస్తోందని అన్నారు. వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీనేనని, హస్తం గుర్తుకే ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసని, తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాలకు తెలుసని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ చేసిన అన్ని తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ సరిదిద్దుతోందని చెప్పుకొచ్చారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పెద్దలు రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేశారని, వాటన్నింటిని కూడా తమ ప్రభుత్వం ప్రణాళికా పరంగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్తోందని అన్నారు.

దశాబ్దాల కోరిక నెరవేరింది..

‘‘సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ప్రభుత్వం పోరాడుతోంది. దశాబ్దాలుగా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్న బీసీల కోరికను కూడా కాంగ్రెస్ నెరవేర్చింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాం. ప్రజల కోసం నిలబడిన కాంగ్రెస్‌ని కనిపించకుండా చేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే నోటికొచ్చిన అబద్ధాలతో మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కుట్రపూరితంగా కోర్టులకు పంపిస్తున్నారు’’ అని విమర్శించారు.

హామీల గురించి బీఆర్ఎస్సా మాట్లాడేది..

‘‘మాటకొస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పెద్దలు అమలు చేశారా? లక్ష రూపాయల హామీని కూడా అధికారంలో ఉన్న పదేళ్లలో నెరవేర్చని దద్దమ్మలు బీఆర్ఎస్ నాయకులు. గత పాలకులు రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం వాళ్ల హయాంలోనే కుంగిపోయింది. కానీ కాంగ్రెస్ అలా కాదు. ఇచ్చిన హామీల్లో 99శాతం హామీలను నెరవేర్చింది. యువతకు గ్రూప్1, గ్రూప్2తో పాటు ఇప్పటికే 60వేల ఉద్యోగాలు, రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ, తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు భరోసా, 29లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్తు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్న ధాన్యం సాగు చేసే రైతులకు క్వింటాకు రూ.500 బోనస్, రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు చేస్తున్నాం. మొదటి దశ ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్ల వ్యవయంతో 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం’’ అని వెల్లడించారు.

Tags:    

Similar News