కాంగ్రెస్ లో చేరేందుకు ఇంద్రకరణ్ రెడ్డి స్ట్రాటజీ!!

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారడంలో కొద్దిగా వెనకడుగేసి కొత్త స్ట్రాటజీ అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది.

Byline :  Vanaja Morla
Update: 2024-03-23 15:52 GMT

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏడు పదుల వయసున్న సీనియర్ పొలిటీషియన్. నాలుగుసార్లు నిర్మల్ ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఆదిలాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. కేసీఆర్ క్యాబినెట్ లో రెండుసార్లు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరతారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేపింది. దీంతో గులాబీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు హస్తం బాట పట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. వీరిలో ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తావన హాట్ టాపిక్ గా మారింది.

ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో యాక్టివ్ గా కనిపించడం లేదు. సీనియర్ నేత కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడే ఇంద్రకరణ్ కూడా ఈరోజో రేపో పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. రెండు రోజుల క్రితం ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది.

ఇంద్రకరణ్ రెడ్డిని రెండు వారాల కిందట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన ఆయన తన అనుచరులతో సమావేశం కూడా నిర్వహించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయిందని, ముహూర్తం ఫిక్స్ అయిందని అనుకున్నారు.

కానీ, ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలనుకున్నా స్థానిక కాంగ్రెస్ క్యాడర్ ఒప్పుకోవడం లేదు. నిర్మల్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు వర్గం అడ్డుపడుతోంది. ఆయన రాకను వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ మారడంలో కొద్దిగా వెనకడుగేసి కొత్త స్ట్రాటజీ అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. ముందు తన అనుచరులను కాంగ్రెస్  లోకి పంపి సమయం చూసి ఆయన కూడా జంప్ అయ్యేందుకు ప్రణాళిక రచించారని తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే తన కేడర్ లోని నిర్మల్ జిల్లా జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లు కారుకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ హై కమాండ్ కి రాజీనామా లేఖలు సమర్పించి కాంగ్రెస్ బాట పట్టారు. అంతా అనుకూలిస్తే ఈ నెల 26 న ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుంటే గులాబీ శ్రేణులు కలవరం చెందుతున్నారు.

Tags:    

Similar News