ఏసీబీ ముందుకు అర్వింద్ కుమార్
కేటీఆర్, బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అర్వింద్ కుమార్‌ను విచారించనున్నారు అధికారులు.;
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్.. గురువారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్, బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అర్వింద్ కుమార్‌ను విచారించనున్నారు అధికారులు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ను రెండు సార్లు, ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డిని రెండు సార్లు అధికారులు విచారించారు.
2023లో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. రేస్ నుంచి ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో) సంస్థ తప్పుకొన్న అనంతరమూ నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకోకపోవడం.. మంత్రివర్గం ఆమోదం పొందకపోవడం.. తదుపరి మూడేళ్లపాటు రేస్‌ల నిర్వహణకు రూ.600 కోట్ల మేర చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అంతర్గత విచారణలో ప్రభుత్వం తప్పుపట్టింది. ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే రూ.54.88 కోట్ల మేర చెల్లించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది. దీనిపై ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. అయితే పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశించడంతోనే తాము నిధులు విడుదల చేసినట్లు అప్పట్లో హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా కొనసాగిన అర్వింద్‌కుమార్ ఇదివరకే ప్రభుత్వానికి లిఖితపూర్వక వాంగ్మూలం ఇవ్వడంతోపాటు ఏసీబీ విచారణలోనూ అంగీకరించారు.