ఆడిట్ లేనందువల్లే అక్రమాలు..ఎంపీ ఎన్నికల నిర్వహణ నిధుల దుర్వినియోగం

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెచ్చించిన రూ.622 కోట్ల నిధుల్లో దుర్వినియోగం జరిగిందా ? అంటే అవునంటోంది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్.

Update: 2024-06-27 08:30 GMT
ఫొటో క్రెడిట్ : ఫేస్ బుక్

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ 622 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గంలో రూ.36.58 కోట్లను వెచ్చించింది.

- అసెంబ్లీ అయినా పార్లమెంట్ ఎన్నికలైనా ఎన్నికల నిర్వహణకు అయ్యే నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయి. అసలే అప్పుల భారంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణలో ఎన్నికల నిర్వహణ వ్యయం అదనపు భారమైంది.
- తెలంగాణలో గత ఏడాది డిసెంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 701.11 కోట్లరూపాయలను ఖర్చు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 17 నియోజకవర్గాల్లో రూ.622 కోట్లను ఎన్నికల కమిషన్ వెచ్చించింది. మొత్తం కలిపి 1323.11కోట్ల రూపాయల ప్రజా ధనం ఎన్నికల నిర్వహణకు ఖర్చు చేశారు.

అభ్యర్థి వ్యయం కంటే అధికం
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ప్రచారం కోసం చేసే వ్యయం కంటే ఎన్నికల నిర్వహణకు చేసే వ్యయం అధికంగా ఉంది. ఎంపీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.95 లక్షలు వెచ్చించేలా ఎన్నికల కమిషన్ వ్యయనియంత్రణ విధించింది. కానీ ఎన్నికల నిర్వహణకు చేసే నిధుల వినియోగంలో మాత్రం ఎలాంటి నియంత్రణ లేదు. దీంతో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు రూ.36.58 కోట్లను వెచ్చించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక్కో నియోజకవర్గానికి 5.9 కోట్లను ఖర్చు చేశారు. అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలు కాగా ఎన్నికల నిర్వహణ వ్యయం మాత్రం పలు రెట్లు పెరిగింది.

అభ్యర్థుల వ్యయంపై ఉన్న నియంత్రణ నిర్వహణ వ్యయంపై ఏది ?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ విధించిన వ్యయనియంత్రణ ఈసీ నిర్వహణ వ్యయంపై లేదు. అభ్యర్థుల ఖర్చు పెరగకుండా ఎన్నికల కమిషన్ వ్యయ పరిశీలకులు నిఘా పెడుతున్నారు. కానీ ఎన్నికల నిర్వహణ వ్యయంపై ఎలాంటి నిఘా లేదు.దీంతోపాటు ఎన్నికల నిర్వహణ ఖర్చులపై ఆడిటింగ్ లేదు. దీంతో ఎన్నికల నిర్వహణ వ్యయం పెరగడమే కాకుండా ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపించింది.

ఎన్నికల నిధుల దుర్వినియోగం?
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నిధులు దుర్వినియోగం జరిగిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాహనాల వినియోగం, ఎన్నికల సామాగ్రి కొనుగోలు, భోజనాలు ఇలా ఒకటేమిటి ? అన్నింటిలోనూ ఎన్నికల అధికారులు విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల ఖర్చులకు ఆడిటర్ జనరల్ నుంచి ఎలాంటి ఆడిట్ లేక పోవడంతో నిధులు దుర్వినియోగమవుతున్నాయని పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ వ్యయం విషయంలో ఎన్నికల కమిషన్ పారదర్శకత పాటించడం లేదు. ఎన్నికల నిర్వహణ ఖర్చుల వివరాలను కూడా వెల్లడించడం లేదు. దీంతో ఎన్నికల నిధులను కొందరు అదికారులు దుర్వినియోగం చేశారని తమకు అనుమానాలున్నాయని పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

సమాచారం ఇవ్వని ఎన్నికల అధికారులు
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ వ్యయంపై సమాచారం ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు లేఖ రాసినా సమాచారం మాత్రం అందలేదు. ఎన్నికల నిర్వహణ వ్యయంపై సమాచారాన్ని అందజేయాలని ఎన్నికల కమిషన్ జిల్లా రిటర్నింగ్ అధికారులైన కలెక్టర్లకు రాసి చేతులు దులుపుకుంది. జిల్లా కలెక్టర్లు దీనిపై సమాచారం పంపించాలని ఆర్డీఓలకు లేఖ రాశారు. ఆర్డీఓలు మండల రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. ఇలా ఒకరు మరొకరికి లేఖలు రాయడమే తప్పా ఎన్నికల నిర్వహణ వ్యయం వివరాలు మాత్రం అందించలేదు. తాము అడిగిన సమాచారం ఇవ్వకుండా ఎన్నికల అధికారులు తాత్సారం చేస్తున్నారంటే ఈ నిధుల దుర్వినియోగం జరిగిందని తాము భావిస్తున్నామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

తెలంగాణ ఆర్థిక శాఖ నుంచి అందిన సమాచారం
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రూ.622.01 కోట్లు ఖర్చు చేసినట్లు తెలంగాణ ఆర్థిక శాఖ సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇచ్చారు. ఆర్థిక శాఖ పబ్లిక్ ఇన్ ఫర్ మేషన్ ఆఫీసరు లేఖ నంబరు 2548847 /151ఎఫ్ బీఎస్.1/2024తో జూన్ 22వతేదీన వివరాలు పంపించారు. ఈ నిధులను దేనికెంత వెచ్చించారో వివరాలు ఇవ్వాలని కోరినా ఎన్నికల అధికారులు కిక్కురు మనలేదు. ఎన్నికల ఖర్చుల సమాచారం ఇవ్వకుండా అధికారులు గుట్టుగా ఉంచడంలోనే నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏజీ ఆడిట్ చేయించండి : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు చేసినరూ.622 కోట్ల ఖర్చుపై ఆడిటర్ జనరల్ ద్వారా ఆడిట్ చేయించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు కోరింది.ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఎ.జి. ద్వారా ఆడిట్ చేయవలసిందిగా ప్రధాన ఎన్నికల అధికారిని అభ్యర్థించింది.అయితే ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదు.


Tags:    

Similar News