భూభారతి వల్ల బీఆర్ఎస్‌కు తలనొప్పి తప్పదా..!
‘ధరణి’ పోర్టల్ ఉన్న సమయంలో జరిగిన భూ అవకతవకలన్నింటినీ బయట పెట్టడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేని వెల్లడించారు.;
తెలంగాణలోని భూ సమస్యలకు చెక్ పెట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’ వ్యవస్థను తీసుకొచ్చింది. దీనిని ఈరోజు నుంచి మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే తరహాలో భూమి వివాదాలకు చెక్ చెప్పాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ప్రతి భూమికి సంబంధించిన వివరాలను డిజిటలైజ్ చేసింది. అయితే ఈ ‘ధరణి’ వల్ల ప్రతి ఒక్కరికీ సమస్యలే వచ్చాయి. అప్పటి వరకు ఎటువంటి సమస్య లేని రైతు కూడా ‘ధరణి’ వచ్చాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘ధరణి’ ఏర్పాటు తర్వాత అధికంగా ఇబ్బంది పడినవారు ఎవరైనా ఉన్నారా? అంటే అది రైతులనే చెప్పాలి. పాస్ పుస్తకం ఉన్న భూములను కూడా వేరే వారి పేరుపై చూపడం, ప్రభుత్వ భూమిగా చూపడం, అసలు భూమే లేనట్లు చూపడం.. ఇలా ‘ధరణి’ పోర్టల్‌తో రైతులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీంతో వీటన్నింటికి పరిష్కారాలు ఎతుకుతూ తెలంగాణలోని భూసమస్యలను తొలగించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూభారతి’ని తీసుకొచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ భూమిపై పూర్తి హక్కును పొందుతారని, వారి సమస్యలను పరిష్కరించడానికి కూడా తమ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని అధికారులు ఇప్పటికే చెప్పారు.
హక్కులు కాపాడేందుకే కొత్త చట్టం : సీఎం రేవంత్ రెడ్డి
అర్హులైన ప్రతీ భూ యజమానులు హక్కులు కాపాడేందుకు చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.‘‘ రావి నారాయణ రెడ్డి, అరుట్ల కమలాదేవి, అరుట్ల రాంచంద్రా రెడ్డి, మల్లు స్వరాజ్యం, భీం రెడ్డి నర్సింహారెడ్డి,చాకలి ఐలమ్మ లాంటి వారు పోరాటాలు చేసింది భూమి కోసమే.ఈ భూమిని ఆత్మగౌరవంగా, హక్కుగా భావించారు.భూమినే తమ హక్కుగా భావించి సాయుధ రైతాంగ పోరాటం చేశారు’’అని సీఎం పేర్కొన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుకు కూడా కొంతమంది భూమిపై ఆధిపత్యం చాలాయించడమే కారణమని సీఎం చెప్పారు. భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చి ఇందిరాగాంధీ గారు పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని ఆయన గుర్తు చేశారు.అనుభవం, నైపుణ్యం లేని సంస్థకు ఈ-ధరణి పోర్టల్ ఇవ్వడాన్ని 2014లో కాగ్ తప్పుపట్టిందని అలాంటి లోపభూయిష్టమైన ధరణిని కేసీఆర్ ఎందుకు తెలంగాణ ప్రజలపై రుద్దారో చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని రేవంత్ చెప్పారు.
అయితే ఇప్పుడు ఈ చట్టాన్ని అమలు దశకు తీసుకొచ్చింది ప్రభుత్వం. ‘భూ భారతి’ ద్వారా తెలంగాణ.. భూసమస్య రహిత రాష్ట్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘భూ భారతి’ బీఆర్ఎస్‌కు దెబ్బ కావొచ్చన్న టాక్ బలం పుంజుకుంటుంది. ‘ధరణి’ పోర్టల్ పేరుతో బీఆర్ఎస్ భారీగా భూదందా చేసిందన్న ప్రచారం జరిగింది. వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ నేతలు కాజేశారని, వాటిని తిరిగి యజమాని పొందకూడదన్న ఉద్దేశంతో ఈ సమస్యలను పరిస్కరించే అధికారం ఎవరికీ కట్టబెట్టలదేని కూడా కొందరు విశ్లేషకులు విమర్శలు చేశారు. ‘ధరణి’ పోర్టల్‌లో భూమికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే.. సదరు యజమాని సివిల్ కోర్టును లేదా సీఎం కేసీఆర్‌ను కలిసి పరిష్కరించుకోవాలని అధికారులు చెప్పారు. దీంతో సామాన్య రైతు ఏం చేయాలతో అర్థం కాక సతమతమయ్యాడు. ఇలాంటి సమస్యలు ఉండకూడదనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’లో ఐదంచెల పరిష్కార మార్గాన్ని తీసుకొచ్చింది.
ధరణి పోర్టల్‌లో సమస్య వస్తే దానిని పరిష్కరించే అధికారాలు తహశీస్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు లేదు. కానీ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’లో మాత్రం ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్‌ఏ(చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) కమిషన్ ఇలా మొత్తం ఐదు స్థాయిల్లో ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా ‘ధరణి’ పోర్టల్ ఉన్న సమయంలో జరిగిన భూ అవకతవకలన్నింటినీ బయట పెట్టడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ విషయాలపై ఫోరెన్సిక్ బృందంతో దర్యాప్తు చేయించిన ప్రభుత్వం.. సంబంధిత వివరాలను అతి త్వరలో బట్టబయలు చేయనున్నట్లు సమాచారం.
అదే గనుక జరిగితే బీఆర్ఎస్‌కు చిక్కులు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. ఆనాడు అధికారంలో ఉండగా తమను ప్రశ్నించేవారు లేరన్న ఉద్దేశంతో ‘ధరణి’ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు యథేచ్చగా భూదందా సాగించారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వివరాలను బయటపెడితే.. బీఆర్ఎస్ నాయకులు చాలా మంది అందులో ఇరుక్కుంటారని, దాని ఫలితంగా తెలంగాణలో బీఆర్ఎస్ మరింత క్షీణిస్తుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ధరణితో రైతులకు క్షోభ
రైతు దగ్గర ఉన్న రికార్డుకు భిన్నంగా ధరణిలో రికార్డు ఉంటే, సరి చేయడానికి 2020 చట్టంలో పద్ధతి సూచించలేదు. ధరణిలో తారుమారైన, మార్చిన రికార్డులను సరిదిద్దుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బ్లాక్ చైన్ సాంకేతికత ఉపయోగించని కారణంగా అవినీతి వ్యవస్థ కుతంత్రాలకు రైతులు బలయ్యారు. దిద్దుబాట్ల కోసం, ఫిర్యాదుల కోసం దరఖాస్తులను స్వీకరించి, నిర్దిష్ట కాలపరిమితిలో అధికారులు సృష్టించిన సమస్యలను పరిష్కరించడానికి సరైన పద్ధతిని, అధికారిని గుర్తించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. ఈ వైఫల్యం వలన రైతుల ఆందోళనను సొమ్ము చేసుకోవడానికి ఒక రహస్య యంత్రాంగం ఏర్పడింది. భూ రికార్డుల వ్యవస్థ నిర్వహణలో అవినీతి ఎమ్మార్వో నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి దాటి అంతకంటే ఎక్కువ స్థాయికి మారింది. అంతేకాకుండా ఆ సమయంలో ‘ధరణి పోర్టల్’ను అడ్డగోలుగా వినియోగించకుండా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ దోహదపడుతుందని ఆనాటి ప్రభుత్వం భావించింది.
ఉదాహరణకు..ఎవరైనా భూమి రికార్డులో పేరును మార్చడంలో ఐదు దశలు ఉండవచ్చు. ఐదు దశలు పూర్తయిన తర్వాత, ఒక కొత్త రికార్డు సృష్టించబడుతుంది. ఆ భూమి రికార్డు చెల్లుబాటు అవుతుంది’. భూమి రికార్డులలో పేర్లు మార్చే ప్రక్రియలు అమలులో ఉన్నాయి. అంటే, భూమి రికార్డుకు భరోసా లేదు. ‘ధరణి’ వచ్చాక ఈ భరోసా మరింత సన్నగిల్లింది. అందువల్లే గతంలో న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ డేటాబేస్ (ధరణి) నిర్వహణ ఏ అధికారి ఎలా చేస్తాడో చెప్పమని అడిగింది. ఇప్పుడు ‘భూభారతి’ ఈ సమస్యలన్నింటికీ చరమగీతం పాడుతుందా లేదా అనేది చూడాలి.