జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ భయపడుతోందా ?
కాంగ్రెస్ అభ్యర్ధిని మజ్లిస్ పార్టీ అభ్యర్ధిగా బీజేపీ ప్రచారంచేయటంలోనే ఎంఐఎం అంటే ఎంతగా భయపడుతోందో అర్ధమవుతోంది
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ నేతల ప్రచారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. కేంద్రమంత్రి(Kishan Reddy) జీ. కిషన్ రెడ్డి, రాష్ట్రపార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు దగ్గర నుండి కిందిస్ధాయి నేతలవరకు ప్రతి ఒక్కరు ఒకేలైనులో ప్రచారం చేస్తున్నారు. అదేమిటంటే(Congress Telangana) కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్(Naveen Yadav)ను ఎంఐఎం(AIMIM) అభ్యర్ధిగా ప్రచారంచేస్తున్నారు. ఉపఎన్నికల్లో పోటీ బీజేపీ-ఎంఐఎం మధ్యే జరుగుతోంది అనే ప్రచారాన్ని విపరీతంగా చేస్తున్నారు. ఇక్కడ పోటీచేస్తున్నది కాంగ్రెస్ అభ్యర్ధి అయితే బీజేపీ మాత్రం ఎంఐఎం అభ్యర్ధి అని ఎందుకు ప్రచారం చేస్తున్నట్లు ?
అలాగే ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలిస్తే అసెంబ్లీలో ఎంఐఎం సీట్లసంఖ్య 7 నుండి 8కి పెరుగుతుందని ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ కు వేసే ప్రతిఓటు ఎంఐఎం బలపడటానికి వేసినట్లే అవుతుందని అంటున్నారు. నవీన్ గెలిస్తే హైదరాబాదులో మజ్లిస్ అరాచకాలు పెరిగిపోతాయని ఓటర్లను భయపెడుతున్నారు. నవీన్ ఎంఐఎం అభ్యర్ధి అని ప్రచారంచేయటానికి కారణం ఏమిటంటే మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేయటమేనట. టికెట్ ప్రకటన కాగానే నవీన్ కూడా ఎంఐఎం ఆఫీసుకు వెళ్ళి అసదుద్దీన్ కలిశాడనే విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మజ్లిస్ ఎందుకు పోటీచేయటంలేదో చెప్పాలని చేస్తున్న డిమాండ్ కూడా విచిత్రంగానే ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్-ఎంఐఎం మిత్రపక్షాల తరహాలో ఒకఅవగాహనతో సాగుతున్నాయి. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్, ఎంఐఎం రెండూ ఒకటిగానే ఉంటున్నాయి. ఈమధ్యనే కాంగ్రెస్ పార్టీ ఒక ఎంఎల్సీ స్ధానాన్ని మజ్లిస్ పార్టీకి కేటాయించింది. అందుకుగాను జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేయకుండా కాంగ్రెస్ కు ఎంఐఎం సహకరిస్తోంది. రెండుపార్టీలు ఒక అవగాహనతో వెళుతున్నపుడు మధ్యలో బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్ధంకావటంలేదు. మిత్రపక్షాలు అంటేనే ఒకపార్టీ మరోపార్టీకి సహకరించుకోవటంకదా.
కాంగ్రెస్ అభ్యర్ధిని బీజేపీ మజ్లిస్ పార్టీ అభ్యర్ధిగా ప్రచారంచేయటంలోనే ఎంఐఎం అంటే ఎంతగా భయపడుతోందో అర్ధమవుతోంది. ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కష్టమని అర్ధమవుతోంది. నియోజకవర్గంలోని 4 లక్షల ఓట్లలో ముస్లిం ఓట్లు 1.2 లక్షలున్నాయి. వీటిల్లో మెజారిటి ఓట్లు కాంగ్రెస్ కు పడితే నవీన్ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. ముస్లిం ఓట్లు బీజేపీ పడేది అనుమానమే. అందుకనే పదేపదే ఎంఐఎంతో పాటు నవీన్ను విలన్ గా చిత్రీకరించేందుకు బీజేపీ నేతలు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాచేస్తే హిందువుల ఓట్లు తమకు పడతాయనే భ్రమలో కమంలంపార్టీ నేతలున్నట్లున్నారు.
కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకోకుండా నవీన్ అని, ఎంఐఎం అని ఒకటే తీరులో ఎందుకు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో అర్ధంకావటంలేదు. పోటీ కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే అనే ప్రచారం పెరిగిపోతున్న సమయంలో కూడా బీజేపీ ప్రచారంలో తన తీరును మార్చుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.