చిరంజీవికి రాజ్యసభ సీటు బీజేపీ ఖాతాలోనా? జనసేనా ఖాతాలోనా?
చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ఖరారైనట్లేనా? ఇదంతా పవన్ చేస్తున్న ప్లానేనా?;
‘మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఎన్‌డీఏ కూటమి తరపున కేంద్ర క్యాబినెట్‌లో ఆయనకు స్థానం దక్కనుంది. మెగా బ్రదర్స్‌తో ఏపీలో పాగా వేయడానికి బీజేపీ ప్లాన్ చేస్తోంది’... కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వార్తలివి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీగా కూడా ఎన్నిక కానీ మెగా బ్రదర్ నాగబాబును.. రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన కూడా పాలిటిక్స్‌లోని రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారన్న టాక్ రోజురోజుకు ఊపందుకుంటుంది. ఆయన రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించనున్నారని కొందరంటే మరికొందరు మాత్రం కాదుకాదు.. జనసేన తరఫునే చిరు.. పెద్దల సభలో అడుగు పెడతారని అంటున్నారు. ఇంకా బీజేపీ తరపున ఆయన రాజ్యసభలో కూర్చోనున్నారన్న టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.
రాజ్యసభ కొత్తేమీ కాదు..
మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ కొత్తేమీ కాదు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి కొన్నేళ్ల తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు రాజ్యసభ ఎంపీ స్థానం, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కాయి. ఆనాడు కాంగ్రెస్ తరపున బలమైన వాయిస్ వినిపించిన చిరంజీవి ఒక్కసారిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆయన సినీ ఇండస్ట్రీ సెకండ్ ఇన్నింగ్స్ హెట్‌తో స్టార్ట్ అయినప్పటికీ ప్రస్తుతం సోసోగానే సాగుతోంది. అందువల్లే మళ్ళీ ఆయన చూపు రాజకీయాల వైపు పడిందని సమాచారం. అందులో భాగంగానే రాజకీయ నాయకులతో సత్సంబంధాలు స్టార్ట్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇటీవల సంక్రాంతి సంబరాల కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో నిర్వహించిన వేడుకల్లో కూడా చిరు పాల్గొనడం ఇందులోని భాగమేన్న వాదన వినిపిస్తోంది. ఆ సమయంలోనే బీజేపీ నేతలతో తన రీ ఎంట్రీ గురించి ప్రస్తావించినట్లు సమాచారం.
చిరంజీవికి అందుకే ఛాన్స్
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ బలంగా కోరుకుంటుంది. ఇందులో ఉత్తరాదిలో బాగానే రాణిస్తున్నా దక్షిణాదిలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఈ క్రమంలోనే మెగా బ్రదర్స్‌ను అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌తో స్టార్ట్ చేసి దక్షిణాది మొత్తం అల్లుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచించిందని, అందుకోసమే చిరంజీవిని పాలిటిక్స్‌లోని రీఎంట్రీ ఇచ్చేలా ప్రోత్సహించిందని కూడా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఏపీతో పాటుగా జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు. అందుకోసమే ఆయన మోదీ నాయకత్వానికి పూర్తి మద్దతు పలుకుతున్నారు. తిరుమల లడ్డూ వివాదం సమయంలో ‘సనాతన ధర్మ పరిరక్ష బోర్డు’ కావాలంటూ చేసిన వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్.. జాతీయ స్థానియలో చర్చలకు కేంద్ర బింధువుగా మారారు. తాము దక్షిణాదిలో ఎదగడానికి కూడా ఇదే మంచి సమయం అని బీజేపీ భావిస్తోంది. అందుకే మెగా బ్రదర్స్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే చిరంజీవిని రాజ్యసభకు పంపించాలన్న పవన్ కోరికకు కూడా బీజేపీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందన్న మాట వినిపిస్తోంది.
రాజకీయాలకు దూరంగా చిరు
కానీ ఒక పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటం చిరంజీవి ప్రస్తుతం ఇష్టం ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత రాజకీయాలంటే చిరంజీవికి విరక్తి పుట్టాయి. అందుకే వైసీపీ రాజ్యసభ స్థానం ఆఫర్ చేసినా చిరు నో చెప్పేశారు. తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు ఎలాగైనా తన అన్నయ్యను గౌరవించుకోవాలన్న పట్టుదలతో ఉన్న పవన్ కల్యాణ్.. చిరును కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, పవన్ ప్లాన్ సక్సెస్ కావడం వల్లే ఇటీవల జరుగుతున్న రాజకీయ కార్యక్రమాల్లో చిరంజీవి అక్కడక్కడ మెరుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది ఫెయిల్ అయినా పవన్ మరో ప్లాన్ వేసుకున్నారని కూడా తెలుస్తోంది.
పక్కాగా ప్లాన్ చేస్తున్న పవన్
ఏదైనా పార్టీలో చేరడానికి చిరంజీవి ససేమిరా అంటే రాష్ట్రపతి కోటాలో ఆయనను రాజ్యసభకు పంపాలని పవన్ ప్లాన్ చేస్తున్నారట. అదే అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించగా వారు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో చిరంజీవిని పెద్దల సభకు పంపేలా పవన్ పావులు కదుపుతున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం లభిస్తే అది బీజేపీ ఖాతాలో పడుతుందా? లేకుంటే జనసేన ఖాతాలో పడుతుందా? అనేది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
రాష్ట్రపతి కోటా అంటే..
దేశంలోని వివిధ రంగాల్లో సుప్రసిద్దులైన వారిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపుతారు. వారికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి విజయేంద్ర ప్రసాద్.. ఈ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రంజన్ గొగోయ్, సుధామూర్తి కూడా ఈ కోటాలోనే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు చిరంజీవిని కూడా అదే కోటాలో రాజ్యసభకు పంపాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.