చంద్రబాబు ‘బనకచర్ల’ సెంటిమెంటు రాజేస్తున్నారా ?

సెంటిమెంటును రాజేసేందుకు బనకచర్ల ప్రాజెక్టును వాడుకుంటున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి;

Update: 2025-07-17 10:50 GMT
Chandrababbu

నారాచంద్రబాబునాయుడు కూడా తెలంగాణలోని భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్) నేతల దారిలోనే నడుస్తున్నారా ? తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు(KCR) నీళ్ళు, నిధులు, నియామకాల పేరుతో సెంటిమెంటు రాజేసిన విషయం తెలిసిందే. ఉద్యమంపేరుతో సెంటిమెంటును రాజేసేందుకు కేసీఆర్ ఏ విధంగా ప్రయత్నించారో ఇపుడు చంద్రబాబు(Chandrababu) కూడా అదేపద్దతిలో సెంటిమెంటును రాజేసేందుకు బనకచర్ల ప్రాజెక్టును వాడుకుంటున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలకు కారణం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టును కట్టాల్సిందే అన్న పట్టుదలతో చంద్రబాబు ఉండటమే.

ఏపిలో బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ(Telangana) చాలా ఇబ్బందులు పడుతుందని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth), ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy), బీఆర్ఎస్ కీలకనేతలు కేటీఆర్, హరీష్ రావు(Harish Rao) తదితరులు నానా గోలచేస్తున్నారు. ఏమిచేయాలో, ఏమిచెప్పాలో తెలీనిస్ధితిలో బీజేపీ నేతలు దిక్కులు చూస్తున్నారు. ఇదేసమయంలో బనకచర్ల వల్ల ఏపీకి నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని ఆంధ్రాలోని కొందరు మేథావులు, ఆలోచనపరుల వేదిక ముఖ్యులు పదేపదే మొత్తుకుంటున్నారు. ఎవరెంతగా మొత్తుకున్నా గోదావరినుండి సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల వరదజలాల్లో 200 టీఎంసీల నీటిని వాడుకుంటానని చంద్రబాబు గట్టిగా చెబుతున్నారు.

ఇటు తెలంగాణలో అటు ఏపీలో ప్రాజెక్టును ఇంతమంది వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాత్రం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాల్సిందే అని మహాపట్టుదలగా ఉండటానికి కారణం ఏమిటి ? చాలామంది ఆరోపిస్తున్నట్లు కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టును టేకప్ చేయబోతున్నారా ? లేకపోతే ఇంకేమైనా ఉందా ? అన్నదే ఇపుడు ఆసక్తిగా మారింది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది గమనిస్తుంటే కాంట్రాక్టర్ల కోసమే కాకుండా సెంటిమెంటు రాజేయటం కూడా మరో అజెండాగా ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో సెంటిమెంటును రాజేయటం ద్వారా రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) లబ్దిపొందిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ప్రత్యేక తెలంగాణకు ఏపీలో పూర్తి వ్యతిరేకత వచ్చినా కేసీఆర్ లెక్కచేయకుండా తెలంగాణ జనాల్లో సెంటిమెంటును రాజేశారు.

సెంటిమెంటువల్లే గరిష్టంగా కారుపార్టీ రెండుఎన్నికల్లో లబ్దిపొందింది. ఇపుడు ఏపీలో కూటమి ప్రభుత్వం మీద జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం కచ్చితంగా పాలకులను కలవరపెడుతుంది అనటంలో సందేహంలేదు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలుచేయలేకపోతున్నారు. ఇదేసమయంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారితప్పిందన్న ఆరోపణలు పెరిగిపోతోంది. ఇపుడే ప్రభుత్వం పరిస్ధితి ఇలాగుంటే ముందు ముందు పరిస్ధితి ఇంకెలాగ ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందుకనే నీళ్ళ సెంటిమెంటును రాజేయాలని చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla)ను తెరమీదకు తెచ్చారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇందులోభాగంగానే ఎంతమంది వ్యతిరేకిస్తున్నా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంకోసం చంద్రబాబు ఇంతగా పట్టుబడుతున్నారు. తాను నిర్మించదలచుకున్న బనకచర్ల ను తెలంగాణలో ఎంతమంది వ్యతిరేకించినా తాను వెనకడుగువేయకుండా ఏపీలోని రాయలసీమ ప్రాంతం కోసం పోరాడుతున్నాను అని చెప్పుకునేందుకే బనకచర్ల కోసం ఇంతగా పట్టుబడుతున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పైగా ఢిల్లీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతు తెలంగాణ-ఏపీ రెండూ తనకు సమానమే అన్నారు. ఉద్యమకాలంలో కూడా రెండు ప్రాంతాలను చంద్రబాబు తనకు రెండుకళ్ళని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. రాయలసీమ కోసమే తాను తెలంగాణలో వ్యతిరేకతను తట్టుకుని బనకచర్ల కోసం ప్రయత్నించాను లేదా సాధించాను అని చెప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బనకచర్లపై తెలంగాణ నుండి వ్యతిరేకత సరే మరి ఏపీలో కూడా ఎందుకు వ్యతిరేకత పెరిగిపోతోంది ? ఈ నేపధ్యంలో చంద్రబాబు సెంటిమెంట్ ప్లాన్ వర్కవుటవుతుందా ?

Tags:    

Similar News