బీఆర్ఎస్ రజతోత్సవం వరంగల్‌లో డౌటే..!
వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేశారు. ఈ చట్టం 30రోజుల పాటు అమల్లో ఉంటుందని తెలుపుతూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.;
ఎన్నడూ కనీవినీ ఎరుగని తరహాలో రజతోత్సవ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఆ దిశగా కార్యక్రమ ఏర్పాట్లను కూడా శరవేగంగా చేసుకుంటూ వస్తోంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా వెల్లడించారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 27న ఘనంగా రజతోత్సవ సభలను నిర్వహించాలని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ కోసం అనుమతి కోరుతూ కాజీపేట ఏసీపీ తిరుమల్‌కు వినతి పత్రం అందించారు. కానీ ఇంతవరకు ఈ సభకు సంబంధించి ఎటువంటి అనుమతులు అందలేదు. ఈ క్రమంలో అసలు బీఆర్ఎస్ రజతోత్సవ సభలు జరుగుతాయా? బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లేనట్లేనా? అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ బహిరంగ సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ సభకు అనుమతులు ఇవ్వకుండా చేస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఒకవైపు అనుమతుల కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంటే ఇంతలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేశారు. ఈ చట్టం 30రోజుల పాటు అమల్లో ఉంటుందని తెలుపుతూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశం ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ చట్టం అమల్లో ఉంటే ఆ పరిధిలో మీటింగ్‌లు, ఉరేగింపులకు అనుమతులు ఉండవు. ఎవరైనా నిర్వహిస్తే వారిపై కేసు నమోదవుతుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకే సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారని, బీఆర్ఎస్ సభ పెట్టను అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ ఈ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా ఎదురైన ఈ పరిణామాలతో బీఆర్ఎస్ నేతలు కొందరు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక తలు పట్టుకుంటున్నారు.
వరంగల్ సీపీ ఏమన్నారంటే..
‘‘వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు నెల రోజులపాటు సిటీ పోలీస్ యాక్ట్-30 అమల్లో ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఉరేగింపులను నిర్వహించడంపై నిషేధం ఉంటుంది. తప్పనిసరిగా మైక్‌లను ఏర్పాటు చేయాలనుకునేవారు ఆయా ప్రాంతాల ఏసీపీల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్నా… ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే మైక్ వినియోగించుకోవాలి. ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని సీపీ హెచ్చరించారు.
10 లక్షల మందితో బహిరంగ సభ
బీఆర్ఎస్ రజతోత్స సభను భారీగా నిర్వహించాలని పార్టీ అంతా ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 10 లక్షల మందితో ఈ సభ నిర్శించాలని భావించారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ఆధ్వరయంలో పార్టీ నేతలు సభకు పర్మిషన్ కోరుతూ ఏసీపీని ఆశ్రయించారు. కాగా ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాలనుసారం అనుమతులపై క్లారిటీ ఇస్తానన్నారు.
ఎందుకింత గుబులు..
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. దానికి తోడు సీఎం రేవంత్ ప్రారంభిస్తున్న ఈ పని కూడా ముందుకు సాగడం లేదు. లగచర్ల ఫ్యాక్టరీ, ముసీ ప్రక్షాళన, ఇప్పుడు తాజాగా హెచ్‌సీయూ భూముల వేలం అన్నీ కూడా ప్రజల్లో నెగిటివిటీని సంపాదించుకున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తే దాని ప్రభావం తమ ప్రభుత్వంపై తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్ తమ సభలో ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి సిద్ధమవుతోంది, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటిలో అమలుకు నోచుకోని వాటి పరిస్థితి, తూతూ మంత్రంగా అమలవుతున్న పథకాలు ఇలా ప్రభుత్వం విఫలమైన ప్రతి అంశాన్ని ప్రజల ముందు పెట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఈ విషయం తెలుసుకునే వారి బహిరంగ సభను అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.