కాంగ్రెస్ అస్త్రాలను రెడీచేసుకున్నదా ?

స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీ గెలవాల్సిన అవసరాన్ని రేవంత్ మంత్రులందరికీ రెండుక్యాబినెట్ సమావేశాల్లో వివరించారు;

Update: 2025-07-13 07:12 GMT
Revanth

తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలను స్వీప్ చేయటంకోసం అధికార కాంగ్రెస్ పార్టీ అన్నీ అస్త్రాలను రెడీచేసుకుంటున్నది. ప్రచారంలో ప్రత్యర్ధిపార్టీలను గుక్కతిప్పుకోనీయకుండా దెబ్బకొట్టాలంటే ఏఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకూడదని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh Kumar Goud) తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలందరికీ గట్టిగా చెప్పిన విషయం తెలిసిందే. స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీ గెలవాల్సిన అవసరాన్ని రేవంత్ మంత్రులందరికీ రెండుక్యాబినెట్ సమావేశాల్లో వివరించారు. ఎన్నికల్లో పోటీచేయాల్సిన అభ్యర్ధులఎంపికలో జిల్లా మంత్రులు, ఇన్చార్జిమంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎంఎల్ఏలు, పీసీసీ అధ్యక్షుడు తదితరులతో కమిటీని ఏర్పాటుచేయాలని కూడా రేవంత్ ఆదేశించారు.

ఒకవైపు పార్టీపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి మరోవైపు ప్రచారంలో ప్రత్యర్ధులపై ప్రయోగించాల్సిన అస్త్రాలను కూడా రెడీచేసినట్లు పార్టీవర్గాల సమాచారం. కాంగ్రెస్ అతిపెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఎస్సీవర్గీకరణ చేయటం, బీసీలకు 42శాతం రిజర్వేషన్(BC Reservations) అమలుకు ఆర్డినెన్స్ జారీచేస్తుండటం. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుతో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను బాగా హైలైట్ చేయబోతోంది. అలాగే రైతుభరోసా సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేయటం, రైతురుణమాఫీని సుమారు 65 లక్షలమంది రైతులకు వర్తింపచేయటాన్ని రైతులు, రైతుల కుటుంబాలకు గట్టిగా చెప్పబోతోంది.

ఇదికాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రు. 500 కే సిలిండర్ పంపిణీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలుగా ప్రచారం చేయబోతోంది. ఉచిత విద్యుత్ పథకంలో సుమారు 50లక్షల పేదకటుంబాలు లబ్దిపొందుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా కనీసం రెండుసార్లయినా పై పథకాలపై జనాల్లో విస్తృతంగా ప్రచారంచేయాలన్నది రేవంత్ ప్లాన్. నోటిఫికేషన్ వచ్చేలోగానే ప్రతి నియోజకవర్గంలోను జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచుల స్ధానాలకు పోటీచేయాలని అనుకుంటున్న గట్టి నేతలను గుర్తించాలని రేవంత్ ఇప్పటికే జిల్లాల స్ధాయిలో నేతలకు ఆదేశాలిచ్చారు.

పై చర్యలకు అదనంగా ప్రభుత్వ పనితీరుపై జనాల్లో స్పందన ఎలాగుందనే విషయమై తెలుసుకునేందుకు రేవంత్ రెడ్డి రెండు సంస్ధలతో సర్వేలు చేయిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. పార్టీ-ప్రభుత్వానికి ఉన్న ప్లస్సులు, మైనస్సులను స్పష్టంగా గుర్తించి, మైనస్సులను అధిగమించే మార్గాలను కూడా సర్వే సంస్ధలు రిపోర్టు రూపంలో రేవంత్, బొమ్మకు అందిచబోతున్నట్లు సమాచారం. మొత్తంమీద స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలుపు రేవంత్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలో ఉండటం ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యధిక స్ధానాల్లో గెలవటం ద్వారా ప్రతిపక్షాల నోళ్ళు మూయించటమే టార్గెట్ గా రేవంత్ పెట్టుకున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News