ఈ దృశ్యం ఎంత బాగుందో !

తిట్లకు, కాట్లాటకు కొద్ది సేపు విరామం ప్రకటించి కెటిఆర్, బండి సంజయ్;

Update: 2025-08-28 10:57 GMT
Bandi Sanjay and KTR in Siricilla

ఒకళ్ళని మరొకళ్ళు గౌరవించుకోవటం, సామాజిక స్పృహతో మర్యాదగా మాట్లాడుకోవటం ఇప్పటి రాజకీయాల్లో చాలా అరుదైపోయింది. కానీ ఈరోజు సిరిసిల్ల(Siricilla)లో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. అసలు పార్టీల అగ్రనేతలు ఒకళ్ళకి మరొకళ్ళు ఎదురుపడటానికి కూడా ఇష్టపడటంలేదు. పొద్దున లేచిన దగ్గర నుండి ఒకళ్ళని మరొకళ్ళు అమ్మనాబూతులు తిట్టుకోవటం చాలా మామూలైపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఓడిపోయి కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చి ఎనుముల రేవంత్(Revanth) రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ వాతావరణం పూర్తి కలుషితమైపోయింది. రేవంత్ సీఎం అవటం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ తదితరులకు ఏమాత్రం ఇష్టంలేదు.

అందుకనే రేవంత్ పైన బీఆర్ఎస్ అగ్రనేతలు నోటికొచ్చినట్లుగా రెచ్చిపోతున్నారు. వీళ్ళకన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదవాను అన్నట్లుగా రేవంత్ కూడా అదే పద్దతిలో జవాబులిస్తున్నాడు. ఈరెండుపార్టీల నేతలతో పోల్చుకుంటే బీజేపీ నేతలు కాస్తనయం. ఇపుడు విషయం ఏమిటంటే భారీవర్షాల దెబ్బకు కామారెడ్డి, మెదక్ జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. చెరువులు, రోడ్లు ఏకమైపోతున్నాయి. కాలనీలకు కాలనీలే ముణిగిపోతుంటే ఇక లోతట్టు ప్రాంతాల పరిస్ధితి చెప్పేదేముంటుంది ?

ఈ నేపధ్యంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిరిసిల్లలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు గురువారం మధ్యాహ్నం మల్లారెడ్డిపేటలో పర్యటించారు. భారీవర్షాలకు కామారెడ్డి, మెదక్ బాగా తిన్నప్పటికీ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది కాబట్టే సిరిసిల్లలో పర్యటించేందుకు బండి ప్రాధాన్యత ఇచ్చారు. ఇదేసమయంలో స్ధానిక ఎంఎల్ఏ కేటీఆర్ కూడా మల్లారెడ్డిపేటలోనే ఉన్నారు. ఇద్దరు ఎవరికి వారుగా వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఒక రోడ్డులో ఎదురుపడ్డారు. దాంతో ఇద్దరు దగ్గరకుచేరి ఒకరిని మరొకరు హత్తుకున్నారు. క్షేమసమాచారాలు మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాన్ని గమనించిన వాళ్ళ మద్దతుదారులు చాలా సంతోషించారు. వివిధ పార్టీల్లోని అగ్రనేతల మధ్య ఇలాంటి మంచి సంబంధాలుంటే రాజకీయ కాలుష్యం చాలావరకు తగ్గిపోతుందని మద్దతుదారులు కామెంట్లు చేసుకున్నారు.

Tags:    

Similar News