‘వరదలతో ప్రజలు విలవిలలాడుతుంటే సీఎంకు పట్టదా..?’
ఇప్పుడు వరదలకన్నా ముసీ సుందరీకరణ ముఖ్యమందా ఈ మందబుద్ధి సీఎంకు అంటూ ఆగ్రహించిన కేటీఆర్, హరీష్ రావు.;
తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేతకాని తనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని విమర్శలు చేశారు. అంతేకాకుండా ఒకవైపు కుండపోత వర్షాలతో ప్రజలు విలవిలలాడుతుంటే సీఎంకు ఇవేమీ పట్టడం లేదని, వరదలు ముంచెత్తే పరిస్థితుల్లో కూడా ఆయన మూసీ సుందరీకరణపై సమీక్షించడం ఆయన మందబుద్ధికి నిదర్శనమంటూ హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెదక్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో హరీష్, రాజన్న సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగానే వారు ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచన లేకపోవడం దురదృష్టకరమన్నారు. అధికారం అంటే హెలికాప్టర్లలో తిరగడం కాదని, ప్రజల సమస్యలను పరిస్కరించేలా నిర్ణయాలు తీసుకోవడం అంటూ హితవు పలికారు.
ప్రభుత్వ వైఫలమ్యే
రాజాపేట గ్రామంలో వరదలో చిక్కుకొని చనిపోయిన సత్యం కుటుంబాన్ని హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్బంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘ప్రస్తుతం వర్షాల కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు. భారీ వర్షాలు, వరదతో సగం తెలంగాణ ఆగమాగం అవుతుంటే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నిన్న మూసీ సుందరీకరణ మీద, నేడు స్పోర్ట్స్ మీద రివ్యూ నిర్వహిస్తున్నడు. హెలికాప్టర్లు సకాలంలో పంపి ఉంటే బూరుగుపల్లిలో ఇద్దరి ప్రాణాలు పోయేవి కావు. పెళ్లిళ్లకు హెలికాప్టర్లు వాడుతారు కానీ, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్లు వాడరా? ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు ఆందోళన చెందొద్దు
‘‘ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. తొగుట మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం పడి ప్రజలు ఇబ్బంది పడ్డారు. గత 20 సంవత్సరాలలో సిద్దిపేటలో ఇలాంటి వర్షం ఎప్పుడు పడలేదు. భారీ వర్షం వల్ల సిద్దిపేటలో పలు కాలనీలు జలమయమయ్యాయి. సిద్దిపేటలో వచ్చిన వరదను తగ్గించడానికి నర్సాపూర్ చెరువుకు ఒక మీటర్ తొలిగించాము. నర్సాపూర్ చెరువు నీటిని శనిగరం వాగు,మందపల్లి వాగు వైపు నీళ్లు మళ్లించాం. భవిష్యత్తులో వరద వచ్చినపుడు ఎలా చర్యలు చేపట్టాలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు చేయాలని సూచించడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలి. నాలాలు కబ్జాలు చేసి ఇల్లు నిర్మించుకున్నాక వరదలు వస్తే బాధపడితే ఎలా ? లోతట్టు ప్రాంతాలలో తక్కువ ధరకు వస్తున్నాయని ఇల్లు నిర్మాణం విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలి. రానున్న రోజుల్లో ప్రజలు సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మించుకోకూడదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పరవేక్షణ చేయాలి. ప్రజలు ఆందోళన చెందోద్దు’’ అని ధైర్యం చెప్పారు.