జీవన్ రెడ్డి.. తెగేదాగా లాగుతున్నాడా..!
రేవంత్‌తో కూర్చుని మాట్లాడుకోవడమే జీవన్ రెడ్డి ముందున్న ఏకైక మార్గమా..?;
జీవన్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ.. వ్యవహారం కొంతకాలంగా నడుస్తూనే ఉంది. 1984లో కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీ కార్యకలాపాల్లో క్రియాశాలంగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి.. 2024 అక్టోబర్ నుంచి పార్టీకి వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. సందు దొరకడం ఆలస్యం పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనపై విజయం సాధించిన డాక్టర్ సంజయ్.. కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి పార్టీపై జీవన్ రెడ్డి అసంతృప్తి ఉన్నారు. అది తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య జరిగినప్పటి నుంచి మరింత అధికమైంది. అవకాశం రావడం ఆలస్యం మీరే ఏలుకోండి అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. గంగారెడ్డి హత్య జరిగిన రోజే ‘‘నేను రాజకీయల నుండి తప్పుకుంటా. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. నిన్నటి దాకా వాళ్లే రాజ్యం ఎలిండ్రు. ఇవ్వాళా వాళ్ళే రాజ్యం చేస్తుండ్రు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో పార్టీ వైఖరిని తప్పుబట్టేలా, పార్టీని తక్కువ చేసేలా, కాంగ్రెస్‌కు అధికారమే ముఖ్యం తప్పితే పార్టీ కోసం కష్టపడిన వారు కాదు అన్న మెసేజ్ ఇచ్చేలా జీవన్ రెడ్డి అనేక సార్లు వ్యాఖ్యానించారు.
అయితే ఈ విషయంలో జీవన్ రెడ్డి కావాలనే రాద్దాంతం చేస్తున్నారా? అన్నట్లు ఉంది. పార్టీతో, పార్టీ సిద్ధాంతాలతో సమస్య ఉంటే.. కూర్చుని మాట్లాడుకోవచ్చు. జీవన్ మాత్రం ఆ మార్గానికి ససేమిరా అంటున్నారు. పార్టీలోని ప్రతి నేతతో విభేదిస్తున్నారు. తనకు ఉన్న ఇబ్బందులపై రేవంత్, టీపీసీసీ చీఫ్‌లతో కలిసి చర్చించుకుంటే సరిపోయేదానికి, ఆయన మాత్రం పార్టీ పరువును బజారున పెట్టాలన్న పద్దతిని అవలంబిస్తున్నారు. సీఎం రేవంత్‌ను కలవడానికి కూడా ఇష్టపడటం లేదు. అన్నీ రచ్చకెక్కేలా చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలను జీవన్ రెడ్డి కావాలని రాద్దాంతం చేయడం పార్టీకి కూడా మింగుడుపడటం లేదు. కానీ సీనియర్ నేత కావడంతో చూసీచూడనట్లు ఉంటున్నారని కొందరు విశ్లేషకులు చెప్తున్న మాట.
అయితే జగిత్యాల ఎంఎల్‌ఏ డాక్టర్ సంజయ్‌ను పార్టీలోకి తీసుకునేటప్పుడు తనకు ఒక్క మాట కూడా చెప్పలేదన్న అక్కసు కూడా జీవన్ రెడ్డిలో కనిపిస్తోందని టాక్ నడుస్తోంది. అసలు సంజయ్.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించడాన్ని జీవన్ తీవ్రంగా వ్యతిరేకించారు. సంజయ్ చేరికను అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ జీవన్ రెడ్డి అభ్యంతరాలకు రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. సంజయ్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకే పార్టీపై జీవన్ ఆగ్రహం ఉన్నారని సమాచారం. కానీ ప్రస్తుతం ఉన్న సమయంలో రాజకీయపరంగా చూసుకుంటే సంజయ్.. ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉన్న ఎమ్మెల్యే. మరోవైపు జీవన్ ఏమో మాజీ ఎమ్మెల్సీ అయిపోయారు. వీరిద్దరిలో రేవంత్ రెడ్డి కచ్ఛితంగా సంజయ్‌కే మద్దతుగా నిలుస్తారు. అంతేకాకుండా రేవంత్ హామీపైనే సంజయ్.. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ రేవంత్‌తో చర్చలకు కూర్చుంటే ఈ విషయాలను వివరించి తనను చల్లబరిచేస్తారని తెలిసే జీవన్ రెడ్డి.. చర్చలకు వెళ్లడానికి ఇష్టపటం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగని పార్టీపై ఉన్న అక్కసును వెలగక్కడానికి మీడియాను ఆసరాగా తీసుకుంటున్నారు.
ప్రతి చిన్న విషయంలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. బీఎస్పీ నేత విజయ్.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకు అడ్లూరి లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగానే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్.. నేనే బీఎస్పీలోకి వద్దామని అనుకుంటున్నా. ఈ పార్టీలో ఏదో ఉందని అనుకుని నువ్వు పార్టీలోకి వచ్చావ్’’ అని అన్నారు. అప్పట్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దానిని కూడా పార్టీ పెద్దగా పట్టించుకోలేదు.
తాజాగా ఇప్పుడు మంత్రి పొంగులేటి.. జగిత్యాల పర్యటనలో జీవన్ రెడ్డి ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి పథకంపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి పొంగులేటి వెళ్లారు. అక్కడకు జీవన్ రెడ్డి.. భ్యారీ ర్యాలీగా వచ్చారు. కలెక్టరేట్‌లోకి రావాలని కోరినా అందుకు నిరాకరించి.. బయటే జగిత్యాల లో ఇసుక స్టాక్ ఏర్పాటు చేయాలని కోరుతున్న వినతి పత్రాన్ని మంత్రి పొంగులేటికి అందించారు. ఆ సమయంలో పొంగులేటి ఆలింగనం చేసుకోవడానికి ముందుకు రాగా.. జీవన్ రెడ్డి వెంటనే వెనక్కి జరిగి నమస్కారం పెట్టారు. అంతటితో అయిపోలేదు.. ఆయనను కూడా కలెక్టర్ల సమావేశానికి రావాలని కోరితే.. అందుకు నిరాకరించి.. ‘‘మా పని అయిపోయింది.. మీ పని చేసుకోండి’’ అని అన్నారు. మళ్ళీ వెంటనే పొంగులేటి, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ లోపలికి వెళ్తున్న క్రమంలో ‘‘మీరు రాజ్యం ఏలుకోండి’ అని జీవన్ వ్యాఖ్యానించారు.
ఇదంతా ఒక ఎత్తయితే.. నియోజకవర్గంతో తన హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడం కోసమే జీవన్ రెడ్డి.. భారీ ర్యాలీతో కలెక్టరేట్‌కు వచ్చారు. ఆయన అనుచరులు.. మంత్రి పొంగులేటి ముందే జీవన్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి, జై జీవన్, జైజై జీవన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. వినతి అందించిన అనంతరం వారు మరోసారి భారీ ర్యాలీగానే వెనుదిరిగారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. చిన్న విషయాన్ని జీవన్ రెడ్డి.. తెగేదాకా లాగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతి పార్టీలో సమస్యలు ఉంటాయి, విభేదాలు సహజం. కానీ వాటిని రోడ్డుపై పెట్టకుండా, చర్చించుకుని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవడం సరైన పద్దతి. కానీ జీవన్ రెడ్డి మనసులో ఏముందో కానీ.. చర్చలు అన్న అంశాన్ని మర్చిపోయారు. ఏకాడికి మీడియా ముందు కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.
తనకు గిట్టని ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలోకి తీసుకురావడం, అతని అనుచరుల వల్లే తన ప్రధాన అనుచరుడుగు గంగారెడ్డి హత్యగావించబడ్డాడన్న దుగ్దతోనే జీవన్ ఇలా ప్రవర్తిస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కానీ ఆయన చేస్తున్న ఈ విమర్శల పర్వాలు మాత్రం పరిష్కారాన్ని అందించవు. కాసేపు మీడియాలో హైలెట్ చేయడం తప్ప వీటి వల్ల జీవన్‌కు ఒరిగేదేమీ లేదు. దానికి తోడు ప్రస్తుతం జీవన్ రెడ్డికి పార్టీలో గతంలో ఉన్నంత చరీష్మా ఉన్నట్లు కనిపించడం లేదు. పార్టీకి తన ప్రియారిటీస్ బాగా తెలుసు. మాజీ ఎమ్మెల్సీ నేత కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేను ఏ పార్టీ పక్కనబెట్టదు. ఈ చిన్న లాజిక్‌ను జీవన్ ఎలా మిస్ అయ్యారో అర్థం కావట్లేదు. ప్రస్తుతం జీవన్ రెడ్డి ప్రయత్నామంతా నియోజకవర్గంలో తాను ఇప్పటికీ ఒక బలమైన నాయకుడినే అని నిరూపించుకోవడానికి పడుతున్న కష్టంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. అలా కాకుండా ఏదైనా సమస్య ఉంటే మాత్రం ఆయన చర్చల మార్గాన్నే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
తన సమస్యపై చర్చించడానికి జీవన్ రెడ్డి.. రేవంత్‌ను మించిన ఆప్షన్ కూడా లేదు. ఢిల్లీకి వెళ్లి అక్కడ జాతీయ నేతలతో మాట్లాడి.. రేవంత్‌ను పిలిపించి పంచాయితీ చేయించుకోవాలి అనుకుంటే అది జరగదు. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్‌లో రేవంత్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా అక్కడకు రేవంత్‌ను కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్‌గా పిలిపించుకుంటుంది. అలాంటి పార్టీ.. ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్సీ వెళ్లి రేవంత్‌పై ఫిర్యాదు చేస్తే ఏం చేస్తుంది? కాబట్టి అలా చేయడం వల్ల జీవన్‌కు రవ్వంత కూడా లాభం ఉండదు. కాబట్టి తన సమస్య పరిష్కారం కావాలంటే రేవంత్‌తో కూర్చుని మాట్లాడుకోవడమే జీవన్ రెడ్డి ముందున్న ఏకైక మార్గమని, అలా కాకుంటే ఇలానే మరికొన్ని రోజులు మీడియా ముందు ఘాటు వ్యాఖ్యలు చేసి క్రమశిక్షణ చర్యలకు లోనవడమే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ విషయాన్ని జీవర్ రెడ్డి.. తెంచుతాడా, ముడేసి ఉంచుతాడో చూడాలి.