జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలోకి కవిత ఎంట్రీ..?

ఆసక్తికరంగా మారుతున్న తెలంగాణ రాజకీయ సమీకరణాలు.;

Update: 2025-09-15 10:16 GMT

తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఈ అసెంబ్లీ స్థానాన్ని సొంతం చేసుకోవడం కోసం మూడు ప్రధాన పార్టీలో పోటీ పడుతున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ ఉపఎన్నిక ద్వారా తమ సత్తా చాటుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఉపఎన్నికకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తమ బడా నేతలను రంగంలోకి దించుతున్నాయి ఈ పార్టీలు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎట్టిపరిస్థితుల్లో హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నాయి. అందుకోసం అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే తాజాగా ఈ ఉపఎన్నిక ఎపిసోడ్ మరో కీలక మలుపు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఈ ఉపఎన్నిక పోటీలో మూడు పార్టీలు ప్రధానంగా ఉంటే.. ఇప్పుడు ఈ సమరంలోకి కవిత కూడా ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారన్న తెలుస్తోంది. తెలంగాణ జాగృతి తరపున ఒక అభ్యర్థిని ఉపఎన్నికలో నిలబెట్టాలని కవిత భావిస్తున్నారట.

విష్ణువర్ధన్ రెడ్డితో భేటీ..

ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తన తరపున ఒక నాయకుడిని నిలబెట్టాలన్న అంశంపై కవిత.. తెలంగాణ జాగృతి నేతలతో చర్చించారని తెలుస్తోంది. వారందరి అంగీకారంతో ఒక అభ్యర్థిని తమ తరుపున నిలబెట్టాలన్న ఆలోచనకు కవిత వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కవిత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో కవిత తరుపున నేతగా తాను పోటీ చేయడానికి రెడీ ఉన్నాన్న చెప్పడం కోసమే విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యారని, ఆయన అభ్యర్థిత్వంపై కవిత కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం.

విష్ణువర్ధన్ ప్లాన్ అదేనా..

విష్ణువర్ధన్ రెడ్డి.. కాంగ్రెస్ తరుపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు 2014, 2019 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తనకు అవకాశం దక్కుతుందని భావించిన విష్ణువర్ధన్‌కు బీఆర్ఎస్ ఛాన్స్ ఇవ్వలేదు. పైగా 2023 ఎన్నికల్లో తమ అభ్యర్థి మాగంటి తరుపున ప్రచారం చేయాలని తెలిపింది. దీంతో 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను ఓడించడంలో విష్ణువర్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల మాగంటి గోపీనాథ్ మరణించారు. ఇప్పుడయినా తనకు అవకాశం వస్తుందని ఆయన భావించగా.. బీఆర్ఎస్ మాత్రం మాగంటి గోపీనాథ్ భార్యను బరిలోకి దించింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, అందుకే ఉపఎన్నిక బరిలో నిలబడటానికి ఆయన అవకాశాలు చూస్తున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో కవిత కూడా ఉపఎన్నికపై ఫోకస్ పెట్టారని తెలియడంతో ఆమెతో భేటీ అయ్యారని సమాచారం.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని కవిత భావిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చేశాక రాజకీయంగా తానేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి కవితకు ఎదురైంది. అదే విధంగా పార్టీని స్థాపిస్తే కనీసం తన బలాన్ని, తన వెంట సీనియర్ నాయకులను ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అందుకు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను మంచి ఛాన్స్‌గా కవిత వినియోగించుకోనున్నారని విశ్లేషకులు అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హోరాహోరీగా సాగడం ఖాయం.. ఇప్పుడు అందులో తాను కూడా దూకితే.. గట్టి పోటీ ఇచ్చినట్లు అవుతుంది. అప్పుడు రాజకీయంగా తనకంటూ ఒక గుర్తింపు, బలం వస్తాయని, అదే విధంగా ఒక అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా సొంత పార్టీ స్థాపనదిశగా అడుగులు కూడా వేగవంతం చేయొచ్చని కవిత భావిస్తుండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News