పదవుల కోసమేనా ? ప్రజాసేవ ఉత్తదేనా ?

కవిత తొందరలోనే జనాలను నేరుగా కలుసుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు;

Update: 2025-05-27 13:47 GMT
Kalvakuntla Kavitha

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే తన ఇంట్లో సింగరేణి గనులున్న ప్రాంతాల నేతలతో సమావేశమైన కవిత కొత్తగా ‘సింగరేణి జాగృతి’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి ప్రాంతాల్లో ఇప్పటికే బీఆర్ఎస్(BRS) సంఘం, నేతలుండగా కొత్తగా జాగృతి(Jagruthi) కమిటీని ఏర్పాటుచేయాల్సిన అవసరం కవితకు ఏమొచ్చిందనే చర్చ పెరిగిపోతోంది. నేతలతో సమావేశమైన సందర్భంగా జాగృతి సంస్ధలో చేరిన నేతలకు ఆమె జాగృతి కండువాలను మాత్రమే కప్పారు. గతంలో ఎక్కడ సమావేశాలు జరిగినా, పార్టీలోకి కొత్తగా ఎవరుచేరినా బీఆర్ఎస్ కండువాలను కప్పి ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది కొత్తగా మంగళవారం జాగృతికండువాలను కప్పి జాగృతి సంస్ధలోకి ఆహ్వానించటాన్ని కారుపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

జాగృతినేతలు చెప్పేదాని ప్రకారం జూన్ 2వ తేదీన కవిత(Kavitha) కొత్త పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయి. కొత్తపార్టీకి ‘తెలంగాణ జాగృతి’ అనే పేరు లేకపోతే ‘బహుజన తెలంగాణ రాష్ట్ర సమితి’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రాధాన్యం లేని పార్టీలో కవిత ఉండదలచుకోవటంలేదని జాగృతినేతలు చెబుతున్నారు. అందుకనే తన సొంతసంస్ధ పేరుమీదే కొద్దిరోజులుగా కవిత కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఆమె సన్నిహితులు గుర్తుచేస్తున్నారు. బహుజన సామాజిక న్యాయం అనే ట్యాగ్ లైనుతోనే కవిత తొందరలోనే జనాలను నేరుగా కలుసుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో కవిత ఒక విషయాన్ని మరచిపోయారు. అదేమిటంటే తన టార్గెట్ అంతా పదవుల కోసమే కాని ప్రజాసేవ కోసం కానేకాదన్న విషయం జనాలకు అర్ధమైపోయిందని. తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)తో విభేదించింది, సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు దూరమైంది పార్టీలో హోదా, భవిష్యత్తులో పదవులపై హామీ కోసమే అన్న ప్రచారం అందరికీ తెలిసిందే. పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తండ్రి తరపున అధికారాలను చెలాయిస్తుంటే తాను మాత్రం ఉత్త ఎంఎల్సీగా, కేసీఆర్ కూతురుగా మాత్రమే ఉండిపోవాల్సొస్తోందనే బాధ, ఆగ్రహం కవితలో పెరిగిపోతున్నట్లుంది. కేటీఆర్ యాక్టివ్ గా ఉన్నపుడు కేసీఆర్ కూతురుగా తనను ఎవరూ పట్టించుకోవటంలేదన్న అసూయ కూడా కవితలో పెరిగిపోతున్నట్లు అనుమానంగా ఉంది. అందుకనే ముందు కేటీఆర్ తో ను తర్వాత కేసీఆర్ తో కూడా కవిత విభేదించిన విషయం జనాలకు అర్ధమైపోతోంది.

రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవచేయటానికే అని అందరు చెప్పేమాటే. కాని అసలు విషయం మాత్రం పదవులకోసమే అని జనాలందరికీ బాగా తెలుసు. పదవులుంటే ప్రజాసేవ చేయటానికి అవకాశం దొరుకుతుందని అంటారు కాని పదవులు వచ్చిన తర్వాత జనాలను పట్టించుకునే నేతలు ఎంతమందుంటారు ? మిగిలిన నేతల సంగతిని వదిలేసి ఇపుడు కవిత విషయమే చూస్తే అధికారంలో ఉన్న పదేళ్ళలో ఎప్పుడూ బీసీ సమస్యలు, జ్యోతిరావుపూలే విగ్రహం ఏర్పాటు, 33 శాతం మహిళా రిజర్వేషన్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ గురించి ఏరోజూ నోరిప్పిందిలేదు. అలాంటిది అధికారంలోనుండి దిగిపోయి ప్రతిపక్షంలోకి రాగానే వెంటనే కవితకు బీసీలు గుర్తుకొచ్చేశారు, మహిళా రిజర్వేషన్ గుర్తుకువచ్చేసింది, జ్యోతిరావుపూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ మొదలైపోయింది.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నపుడు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని కవిత ఎందుకు అడగలేదు ? మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పార్టీలోను, పదవులు, మంత్రివర్గంలో అమలుచేయాలని కేసీఆర్ ను ఎందుకు డిమాండ్ చేయలేదు. భౌగోళిక తెలంగాణాతో పాటు సామాజికతెలంగాణ ఎందుకు సాధించలేకపోయామని కేసీఆర్ ను పదేళ్ళల్లో కవిత ఎన్నడైనా అడిగారా ? ఇపుడు కేసీఆర్, కేటీఆర్ తో విభేదించింది కూడా ప్రజాసమస్యల మీద కాదు పార్టీలో తన హోదా గురించి, భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తనకు ఇవ్వబోయే పదవులపై హామీ గురించే. ఈ రెండు అంశాలు జనాల్లో తనను పలుచన చేస్తుందన్న విషయం కవిత గుర్తించటంలేదా ? అనే చర్చ కూడా పెరుగుతోంది.

Tags:    

Similar News