బీఆర్ఎస్ కు కేసీఆర్ ప్లస్సా లేకపోతే మైనస్సా ?
కొన్నికొన్నిసార్లు ప్లస్ పాయింట్ అనుకున్నదే చివరకు మైనస్ అయిపోతుంది. ఈ విషయం గతంలో అనేకసార్లు అనేక పార్టీల్లో నిరూపితమైంది;
కొన్నికొన్నిసార్లు ప్లస్ పాయింట్ అనుకున్నదే చివరకు మైనస్ అయిపోతుంది. ఈ విషయం గతంలో అనేకసార్లు అనేక పార్టీల్లో నిరూపితమైంది. ఇపుడు విషయంఏమిటంటే పూర్వవైభవాన్ని పొందటంకోసం బీఆర్ఎస్ నానా తిప్పలుపడుతోంది. జనాలతో పాటు నేతలు, క్యాడర్ ను ఆకట్టుకునేందుకు ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో అతిపెద్ద బహిరంగసభకు పార్టీ ప్లాన్ చేస్తోంది. పార్టీ రజతోత్సవం సందర్భంగా జరుగుతున్న బహిరంగసభను గతంలో ఏపార్టీ కూడా నిర్వహించనంత భారీగా జరపాలని పార్టీ అధినేత కేసీఆర్(KCR) ఇప్పటికే ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా పార్టీలోని ముఖ్యనేతలతో రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ తరపున బహిరంగసభ జరపటం అన్నది పార్టీ నేతల చేతిలోని పనే. అయితే బహిరంగసభ జరిపినంతమాత్రాన జనాలు మళ్ళీ పార్టీకి దగ్గరవుతారా ? పార్టీకి పూర్వవైభవం సాధ్యమేనా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్నకు మూలకారణం ఏమిటంటే కేసీఆర్ వైఖరే.
టీఆర్ఎస్ అంటే జనాల్లో మంచి క్రేజుండేది. 2000 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమపార్టీగా ఏర్పాటైన టీఆర్ఎస్ ను అధినేత కేసీఆర్ తర్వాత రాజకీయపార్టీగా మార్చారు. సంవత్సరాల ఆందోళనల తర్వాత 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైంది. తెలంగాణ ఏర్పాటుకు అనేక కారణాలున్నా మొత్తం క్రెడిట్ అంతా కేసీఆర్ తన ఖాతాలో వేసేసుకున్నారు. కేసీఆర్ పోరాటాల వల్లే, చావునోట్లో తలపెట్టడం వల్లే తెలంగాణా ఏర్పాటైంది అని కేసీఆర్ చాలాసార్లు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. చావునోట్లో తలపెట్టినా, ఆమరణ నిరాహారదీక్షలు చేశానని చెప్పుకున్నా, సంవత్సరాల తరబడి పోరాటాలు చేసినా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చింది బొటాబొటిగా 64 సీట్లు మాత్రమే.
తెలంగాణ(Telangana)లోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో 60 సీట్లకు పైగా గెలిచిన పార్టీదే అధికారం. అలాంటిది టీఆర్ఎస్ కు జనాలిచ్చింది కేవలం సింపుల్ మెజారిటిమాత్రమే. అంటే దీనిర్ధం ఏమిటంటే ప్రత్యేక తెలంగాణ కేవలం కేసీఆర్ వల్లమాత్రమే రాలేదని, అలాగే టీఆర్ఎస్ కు ఇంతకుమించి సీట్లు అవసరంలేదని జనాలు అనుకున్నట్లు అర్ధంచేసుకోవాలి. అందుకనే తనప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చన్న అనుమానంతోనే కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. నాలుగేళ్ళ పాలన తర్వాత 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ పాలన పర్వాలేదని అనుకున్న జనాలు 80 సీట్లలో టీఆర్ఎస్ ను గెలిపించారు. 80 సీట్లతో అధికారం సుస్ధిరమైనా కేసీఆర్ ఫిరాయింపులను మాత్రం మానలేదు. ఈవిషయాన్ని పక్కనపెట్టేస్తే తెలంగాణలో తనకు ఎదురన్నదే లేకుండా చేసుకోవటం కోసం ప్రతిపక్షాలను రాచిరంపాన పెట్టారు. టీడీపీని సాంతం చంపేసిన కేసీఆర్ కాంగ్రెస్ విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు.
కేసీఆర్ చేసిన పనివల్ల ఏమైందంటే టీడీపీ(TDP) ప్లేసులోకి బీజేపీ(BJP) వచ్చి కూర్చున్నది. తనను ఎదరించే ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలని కేసీఆర్ అనుకుంటే జనాలే కేసీఆర్ కు ప్రతిపక్షం రూపంలో బీజేపీని లేపి నిలబెట్టారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో జనాలు నాలుగు పార్లమెంటు సీట్లలో బీజేపీని గెలిపించారు. జెండా కట్టేందుకు కార్యకర్తలు కూడా లేని ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలిచిందంటే ఆ పుణ్యం కేసీఆర్ ది మాత్రమే. అంతకుముందు దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో గెలిచినా, తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో 48 డివిజన్లలో గెలవటం కూడా కేసీఆర్ పుణ్యమే అని చెప్పాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల, 2024 పార్లమెంటు ఎన్నికల్లో 8 చోట్ల బీజేపీ గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ కారణంగానే బీజేపీ ఏకుమేకై కూర్చుంది. ఈమధ్యనే జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ల ఎంఎల్సీ ఎన్నికల్లో రెండుచోట్ల బీజేపీ గెలుపే ఇందుకు ఉదాహరణ.
కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా కొడుకు, మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిరోజు చెబుతున్నా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది ? చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ పాలనపై జనాల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చేసింది ? ఎందుకంటే, కేసీఆర్ ఒంటెత్తుపోకడవల్లే అని చెప్పాలి. తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అరాచకం ఒకస్ధాయి దాటిపోయిందని జనాలు బహిరంగంగానే చెప్పుకున్నారు. అసెంబ్లీ ఉపఎన్నికల్లో హుజూరాబాద్ సీటును ఎలాగైనా గెలుచుకుకోవాలని కేసీఆర్ శతవిధాల ప్రయత్నించినా పార్టీఓటమికి అరాచకమే కారణమని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక అత్యంత కాస్ట్లీ ఎన్నికగా రికార్డు సృష్టించింది. ఉపఎన్నికలో గెలుపుకు కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా జనాలు బీఆర్ఎస్ ను ఓడించారు. బీఆర్ఎస్ కు ఓటు వేసేదిలేదని జనాలు బహిరంగంగానే చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
పార్టీ, ప్రభుత్వాన్ని గాలికొదిలేశారు
అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కేసీఆర్ గాలికొదిలేశారు. ఎలాగంటే ముఖ్యమంత్రిగా వారాలతరబడి అసలు సచివాలయంకే వచ్చేవారు కాదు. పార్టీ అధినేతగా నెలల తరబడి నేతలకు అందుబాటులో లేకుండాపోయారు. కేసీఆర్ కు బదులుగా కొడుకు కేటీఆర్(KTR), కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు(Harish) కనబడుతున్నా జనాలు ఓట్లేసి బీఆర్ఎస్ ను గెలిపించింది తనను చూసే కాని వీళ్ళని చూసికాదన్న విషయాన్ని కేసీఆర్ మరచిపోయారు. మంత్రులకు, ఎంఎల్ఏలు, ఎంపీలకే అందుబాటులో ఉండని కేసీఆర్ ఇక కిందస్ధాయి నేతలు, క్యాడర్ మొహం చూస్తారా ? ఇదేసమయంలో అవినీతి, అరాచకాలు బాగాపెరిగిపోయాయనే ప్రచారం విపరీతంగా జరిగింది. హోలుమొత్తంమీద కుటుంబం బాగుకోసమే కేసీఆర్ ముఖ్యమంత్రయ్యారు కాని రాష్ట్రాన్ని బాగుచేయటం కోసం కాదని జనాలు బహిరంగంగానే ఆరోపించారు.
హామీల అమలు అంతంతమాత్రమేనా ?
ఎన్నికల సమయంలో, ఉపఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు అమలుచేయలేదు. దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూముల ఇళ్ళు, దళితబంధు లాంటి అనేక పథకాలు కేవలం ఎన్నికల పథకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. ఒకవైపు పార్టీ, ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నా మరోవైపు కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పాలన్న కోరిక పెరిగిపోయింది. అందుకనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. అవకాశం వస్తే ప్రధానమంత్రిని అయిపోతానని, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని, బీఆర్ఎస్ అజెండానే దేశమంతా అమలుచేస్తానని నోటికొచ్చింది ఏదేదో మాట్లాడేశారు. పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేంద్రప్రభుత్వం ఏర్పాటులో తనదే కీలకపాత్రగా కేసీఆర్ భ్రమల్లో కూరుకుపోయారు.
జాతీయరాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలంటే మిగిలిన పార్టీల అధినేతల మద్దతు చాలా కీలకమన్న చిన్న లాజిక్ ను కేసీఆర్ మరచిపోయారు. అప్పటికే కేసీఆర్ ఎంతమాత్రం విశ్వసించదగ్గ నేతకాదన్న విషయం జాతీయస్ధాయిలో బలపడిపోయింది. అందుకనే తమిళనాడు(MK Stalin), కర్నాటక, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ(Aravind Ketriwal), ఒడిస్సాకు వెళ్ళి ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీల అధినేతలను కలిసినా ఎవ్వరూ మద్దతుగా నిలబడలేదు. దాంతోనే జాతీయరాజకీయాల్లో కేసీఆర్ పోషించబోయే పాత్ర ఏమిటనే విషయంలో జనాలకు క్లారిటి వచ్చేసింది. ఎలాగూ జాతీయరాజకీయాల్లోకి వెళ్ళి చక్రంతిప్పబోతున్న కేసీఆర్ కు తెలంగాణలో ఏమిపనిలే అని జనాలు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడగొట్టి కాంగ్రెస్(Congress) ను గెలిపించారు. పార్టీలో, ప్రభుత్వంలో వ్యతిరేకతను మూటగట్టుకోవటంతో పార్టీనేతలే బీఆర్ఎస్ అభ్యర్ధులకు వ్యతిరేకంగా పనిచేసినట్లు తర్వాత నిర్వహించిన పార్టీ సమీక్షల్లోనే బయటపడింది.
ప్రస్తుత పరిస్ధితి ఏమిటి ?
పార్టీ ప్రస్తుత పరిస్ధితి ఏమిటంటే సోషల్ మీడియాలో ఎక్కువగాను జనాల్లో తక్కువగాను ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్, హరీష్, కవితలు రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం మీద ప్రతిరోజు టైంటేబుల్ వేసుకున్నట్లుగా ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఆరోపణలు, విమర్శల్లో అత్యధికం ట్విట్లర్లో(Twitter)నే కనబడుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ దే ఘనవిజయమని కేటీఆర్, హరీష్, కవితలు చెప్పుకుంటున్నా అంత సీన్ కనబడటంలేదు. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో బీఆర్ఎస్ వైపు జనాలు మొగ్గుచూపుతున్నట్లు కనబడటంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంమీద జనాల్లో అసంతృప్తి ఉన్నది వాస్తవమేకాని ఎన్నికలువస్తే కాంగ్రెస్ ను దింపేసి అర్జంటుగా బీఆర్ఎస్ కు అధికారం అప్పగించాలన్న ఆలోచన అయితే జనాల్లో కనిపించటంలేదు.
తాము తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉండిచేయలేకపోయిన పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలోనే చేసేయాలని కేటీఆర్, హరీష్, కవితలు గోలచేయటాన్ని జనాలు గమనిస్తున్నారు. విద్యారంగం బీఆర్ఎస్ హయాంలో భ్రష్టుపట్టిపోయిందన్నది వాస్తవం. సంక్షేమ హాస్టళ్ళను కేసీఆర్ గాలికొదిలేశారు. ఎన్నికలసమయంలోనే కాళేశ్వరం, మేడిగడ్డ ఇరిగేషన్ ప్రాజెక్టులు కుంగిపోవటంతో కేసీఆర్ అవినీతిపై జనాల్లో పెద్దఎత్తున చర్చ జరగటం పార్టీకి బాగా మైనస్ అయ్యింది. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలను పక్కనపెట్టేస్తే చివరకు వైస్ ఛాన్సలర్లను కూడా కేసీఆర్ నియమించలేకపోయారు. గ్రూప్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించినా క్వశ్చన్ పేపర్ల లీకులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోయేది. ధరణి పోర్టల్ ను ప్రవేశపెట్టి రైతులు, మధ్య తరగతి జనాల్లో వ్యతిరేకత పెంచుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదని అడిగినందుకు, ఆందోళనలు చేసినందుకు రైతుల కాళ్ళకు సంకెళ్ళు వేసి జైళ్ళకుపంపారు.
హోలుమొత్తంమీద రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, పేదలు, దళితులు ఇలా చాలా వర్గాలు దూరమవ్వటంతోనే బీఆర్ఎస్ ఓడిపోయింది. తన పాలనలోని లోపాలను అంగీకరించకుండా కాంగ్రెస్ ను గెలిపించి జనాలు తప్పుచేశారని ఇప్పటికీ కేసీఆర్ శాపనార్ధాలు పెడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ‘కత్తి కాంగ్రెస్ చేతికిచ్చి తనను యుద్ధంచేయమంటే ఎలాగ’ అని ఇప్పుడు కూడా నేతల సమీక్షల్లో కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. ‘కాంగ్రెస్ ను గెలిపించిన జనాలు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని తనతో అంటున్నార’ని కేసీఆర్ నేతల సమీక్షల్లో చెబుతుండటమే ఆయన మనస్తత్వానికి అద్దంపడుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత చెప్పుకుంటున్నట్లు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ దే ఘనవిజయమని అనుకుందాం కాసేపు. ఇదేనిజమైతే మరి ఈమధ్యనే జరిగిన మూడు ఎంఎల్సీఎన్నికల్లో పార్టీ ఎందుకు పోటీచేయలేదని అడిగితే ఒక్కళ్ళూ సమాధానం చెప్పటంలేదు.
అవినీతిగురించి జనాలు పెద్దగా మాట్లాడుకోవటంలేదు. ఎందుకంటే ఏపార్టీ అధికారంలో ఉన్నా జరిగేదిదే అని జనాల్లో అభిప్రాయం బలపడిపోయింది. జనాలు చూసేదంతా పాలనలో వైఫల్యాలు, ముఖ్యమంత్రి తమకు అందుబాటులో ఉంటున్నారా లేదా ? తమసమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా అనిమాత్రమే. ఈవిషయాల్లోనే రేవంత్-కేసీఆర్ ను జనాలు పోల్చిచూసుకుంటున్నారు. సచివాలయంకు రావటంలో, జనాలను కలవటంలో, సమస్యలను తెలుసుకోవటంలో రేవంత్ చాలా బెటర్ అని జనాల్లో అభిప్రాయముంది.
పార్టీ భవిష్యత్ ఏమిటి ?
ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న డెవలప్మెంట్ల ఆధారంగానే పార్టీ భవిష్యత్ ఆధారపడుంటుంది. ఇపుడు కూడా కేసీఆర్ తన పద్దతిని మార్చుకోలేదు. ఈనెలాఖరులో బహిరంగసభ ఉంది కాబట్టే నేతలను తరచూ కలుస్తున్నారు. లేకపోతే అసలు ఫామ్ హౌస్ వదిలిపెట్టి బయటకు రారు, నేతలను లోపలకు రానీయరు. జనాలు తనను ప్రతిపక్ష నేతగా పనిచేయమని తీర్పిచ్చారన్న విషయాన్ని కేసీఆర్ మరచిపోయారు. తుపానులు వచ్చినా, ఎడతెరిపిలేని భారీ వర్షాలకు ఇబ్బందులుపడినా, ఏరకంగా జనాలు అవస్తలు పడుతున్నా కేసీఆర్ అయితే ఒక్కసారి కూడా పరామర్శిందిలేదు. తనను ఓడించిన జనాలకు శాస్తి జరగాల్సిందే అన్నట్లుగా ఉన్నాయి కేసీఆర్ వ్యాఖ్యలు. కేసీఆర్ వైఖరిలో స్పష్టమైంది ఏమిటంటే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జనాలనైతే పట్టించుకోరని. ఒకవైపు జనాలకు పార్టీ దూరమైపోయిందని అర్ధమవుతున్నా ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం బీఆర్ఎస్ దే అని ప్రతిరోజు కేసీఆర్, కేటీఆర్ చెప్పుకుంటున్నారు.
ఎన్నికలకు ఇంకా మూడున్నరఏళ్ళుంది కాబట్టి ఇప్పటినుండి జనాల్లో తిరగటం వేస్టని కేసీఆర్ అనుకున్నట్లున్నారు. అందుకనే జనాలను పట్టించుకోవటంలేదు. అయితే కేసీఆర్ మరచిపోయింది ఏమిటంటే తనకు అధికారం కావాలి కాని జనాలకు కేసీఆర్ అవసరంలేదు. తనకు ప్రత్యామ్నాయంగా జనాలకు కాంగ్రెస్, బీజేపీలున్నాయన్న విషయాన్ని కేసీఆర్ మరచిపోయారా ? లేకపోతే గుర్తించటానికి ఇష్టపడటంలేదా అన్నదే అర్ధంకావటంలేదు. జనాలకు దూరమైపోయిన ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకుంటే మంచిది. 27వ తేదీన జరగబోయే బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడేదానిపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడుంది. హోలు మొత్తంమీద అర్ధమవుతున్నది ఏమిటంటే కేసీఆరే పార్టీకి బలము, బలహీనతని. కేసీఆర్ వైఖరివల్ల పార్టీ మరింతగా బలహీనపడుతుందా ? లేకపోతే వైఖరి మార్చుకుని పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తారా అన్నది చూడాలి.