కేసీఆర్ వ్యాఖ్యలతోనే పార్టీకి సింపతీ కరువైందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది. ఇప్పటివరకు కేవలం మాజీలకు మాత్రమే పరిమితమైన వలసలు సిట్టింగ్ ల వరకు వచ్చేశాయి.

Update: 2024-03-18 16:23 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది. ఇప్పటివరకు కేవలం మాజీలకు మాత్రమే పరిమితమైన వలసలు సిట్టింగ్ ల వరకు వచ్చేశాయి. రేవంత్ సర్కార్ కూలిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిని అలర్ట్ చేసినట్టు కనిపిస్తున్నాయి. మా ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తే ఏం చేయాలో మాకు కూడా వ్యూహం ఉందంటూ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ చేశారు. మేము మొదలుపెడితే మీ పార్టీలో ముగ్గురు లేదా నలుగురు మాత్రమే మిగులుతారని హెచ్చరించారు. చెప్పినట్టే వలసలకు గేట్లు ఎత్తారు. ఆ విషయం స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పారు.

సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల ముందు వారు పార్టీ మారడం అంత కలవరపెట్టే విషయం కాదు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పార్టీ మారడం పార్టీ పెద్దలను ఆందోళనకి గురి చేస్తోంది. ఆయనపై యాక్షన్ తీసుకోవాలంటూ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు.

మరోవైపు దానం బాటలోనే ఇంకెంతమంది ఎమ్మేల్యేలు పార్టీని వీడతారో అనే భయం BRS లో మొదలైంది. ఎమ్మెల్యేల కదలికలపై నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. ఫిరయిస్తారు అని అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను కేటీఆర్, హరీష్ రావులు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.

బీఆర్ఎస్ కి ఈ స్థితి రావడానికి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి లాంటి కీలక నేతలు చేసిన వ్యాఖ్యలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హస్తం నేతల్ని డిఫెన్స్ లో పడేయడానికి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ వారు చేసిన కామెంట్స్ కొంప ముంచాయని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాకుండానే వలసలకు కాంగ్రెస్ గేట్లు ఎత్తేసింది. మరోవైపు కాంగ్రెస్ లోకి, బిజెపిలోకి నేతలు క్యూ కడుతున్నా సింపతీ మాత్రం లభించట్లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసింది కూడా ఇదే కాబట్టి.

దానం వ్యవహారంపై సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎంపీ వినోద్ జంపింగ్ ల విషయంలో బీ ఆర్ ఎస్ చేసిన తప్పే మీరూ చేస్తారా అంటూ ప్రశ్నించడం కొసమెరుపు. మేము తప్పు చేశాము అని స్వయంగా ఒప్పుకున్నట్లు అయింది.

ఇక పాడి కౌశిక్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేసి మరింత రెచ్చగొట్టినట్టు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. "నువ్వు కొట్టినవ్ మేము తీసుకున్నాం.. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా అయితవ్.. మేము గేట్లు తెరిచిన రోజు మీరు మొత్తం భుస్థాపితం అయితారు.. సింహం ఒకడుగు వెనక్కి వేసిందంటే నాలుగడుగులు ముందల్కి దుంకడానికే" అంటూ డైలాగ్స్ చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలన్నీ పార్టీకి సింపతీ తీసుకురాకపోగా విమర్శలపాలు చేస్తున్నాయి.

Tags:    

Similar News