దక్షిణకొరియా లాగ మన దగ్గర మూసీ ఫ్రంట్ సాధ్యమేనా ?

మురికికూపంగా ఉన్న చంగ్ యే చున్ నది ఇపుడు క్లీన్ రివర్ గా మారిపోయింది. నదీ తీరం ఎంటర్ టైన్మెంట్, కమర్షియల్ కాంప్లెక్సులతో 24 గంటలూ జనాలతో కళకళలాడుతోంది.

Update: 2024-08-15 05:33 GMT
Cheong gye cheon river in South Korea

మురికికూపంగా మారిన మూసీ రివర్ ను మూసీ రివర్ ఫ్రంట్ గా మార్చాలన్నది రేవంత్ రెడ్డి స్వప్నం. దీనికోసం రేవంత్ పదేపదే నిపుణులతో భేటీ అవుతున్నారు. ప్రాజెక్టు కాస్ట్ గురించి కూడా అధ్యయనం చేయిస్తున్నారు. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రెడీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు అమెరికా, దక్షిణకొరియాలో పర్యటించి తిరిగొచ్చారు. ఈ నేపధ్యంలోనే దక్షిణకొరియాలోని ‘చంగ్ యే చున్’ నదిని కూడా సందర్శించారు. ఎందుకంటే ఇప్పటి మన మూసీలాగానే ఒకపుడు దక్షిణకొరియా సియోల్ లోని చంగ్ యే చున్ నది పరిస్ధితి ఉండేది. దాన్ని కొరియా ప్రభుత్వం పట్టుదలగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. నదీతీరం వెంబడే రోడ్లు, స్కైవాక్ లు, వర్తక, వాణిజ్య సముదాయాలు ఏర్పాటుచేసింది.



 మురికికూపంగా ఉన్న చంగ్ యే చున్ నది ఇపుడు క్లీన్ రివర్ గా మారిపోయింది. పైగా నదీ తీరంలో ఏర్పాటుచేసిన ఎంటర్ టైన్మెంట్, కమర్షియల్ కాంప్లెక్సులు తదితరాలతో 24 గంటలూ జనాలతో కళకళలాడుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు గురించి కలవరిస్తున్న రేవంత్ కు దక్షిణకొరియాలోని చంగ్ యే చున్ రివర్ ప్రాజెక్టు లడ్డూలాగ చేతికి దొరికింది. దాంతో దక్షిణకొరియా పర్యటనలో ప్రత్యేకంగా రేవంత్ తన బృందంతో చంగ్ యే చున్ రివర్ను సందర్శించారు. ఒకపుడు నది పరిస్ధితి ఏమిటి ? ఇపుడున్న పరిస్ధితి ఏమిటన్నది అక్కడి అధికారులు రేవంత్ బృందానికి వివరించారు. మురికికూపంగా ఉన్న నదిని అత్యంత సుందరంగా మార్చటానికి తాము పడిన కష్టాన్ని, చేసిన ప్రయత్నాలను, తీసుకున్న చర్యలను దక్షిణకొరియా అధికారులు వివరించారు. దాంతో అలాంటి చర్యలనే మూసీ రివర్ విషయంలో కూడా తీసుకోవాలని రేవంత్ డిసైడ్ అయ్యారు.



 ఒకపుడు మూసీ నది అంటే మంచినీళ్ళందించే నదే. కాకపోతే తర్వాత అనేక కారణాలతో అది మురికికూపంగా మారిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్ళు, పరిశ్రమల నుండి వచ్చే వ్యర్ధాలన్నీ మూసీలోనే కలుస్తున్నాయి. దాంతో మూసీ పక్కనుండి వెళ్ళేవాళ్ళు ముక్కులుమూసుకుని ప్రయాణం చేయాల్సొస్తోంది. నగరంలోని 57.5 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తుంది. రెండువైపులా ఆక్రమణలతో నది తీరం కుచించుకుపోయింది. అందుకనే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ముఖ్యమైనది ఏమిటంటే ఆక్రమణలను తొలగించటమే. ముందు ఆక్రమణలను తొలగించి, మురికి నీరు, వ్యర్ధాలు నదిలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలి. తర్వాత ఇపుడున్న నీటిని శుద్దిచేయటానికి భారీగా ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. మురికినీటిని ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ నీటిని మళ్ళీ నదిలోకి రాకుండా ఇతరత్రా అవసరాలకు వాడుకోవాలి.



 ఇదంతా జరిగిన తర్వాత మూసీలోకి ఫ్రెష్ గా ఇతర ప్రాంతాల నుండి మంచినీటిని తరలించే ఏర్పాటుచేయాలి. మళ్ళీ కొంతకాలం పాటు అలా వచ్చిన ఫ్రెష్ జలాలను శుద్దిచేస్తుండాలి. మూసీలోకి గోదావరి జలాలను వదలాలన్నది ప్రభుత్వం ఆలోచన. గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తో పాటు మూసీలోకి కూడా వదలేందుకు ప్లాన్ జరుగుతోంది. గోదావరి జలాలను నిరంతరం మూసీలోకి వదులుతుంటే మెల్లిగా మూసీని పట్టుకున్న కంపు వదిలిపోతుందని రేవంత్ ఆలోచన. గోదావరి జలాలను హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మూసీలోకి తరలించేందుకు రు. 5600 కోట్లు ఖర్చవుతుందని లెక్క.



 మూసీ పొడువునా కేంద్రప్రభుత్వం అమృత్ పథకంలో భాగంగా 39 సీపేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి మురికి మొత్తాన్ని వదిలించాలని రేవంత్ గట్టి పట్టుదలతో ఉన్నారు. మూసీకి రెండువైపులా ఉన్న ఆక్రమణలను క్లియర్ చేస్తే వచ్చే 25 వేల ఎకరాల్లో కొంత రియల్ ఎస్టేట్ అవసరాలకు కేటాయించవచ్చని రేవంత్ అనుకుంటున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున నిధులు సమకూరుతాయన్నది అంచనా. 



మూసీకి రెండువైపులా 120 కోట్ల చదరపు అడుగుల స్ధలం వస్తుందని దాన్ని వర్తక, వాణిజ్యాలు, ఎంటర్ టైన్మెంట్ పార్కులు తదితరాలకు ఉపయోగించాలన్నది రేవంత్ ఆలోచన. దక్షిణకొరియాలోని హాన్ నదితో పాటు దాని ఉపనదుల నుండి మంచినీటిని నిరంతరం చంగ్ యే చున్ లోకి ప్రవహించేట్లు చేయటం ద్వారా మురికినదిని అత్యంత సుందరంగా కొరియా ప్రభుత్వం చేయగలిగింది. మరి మూసీ నదిని అలా చేయటం సాధ్యమవుతుందా ? తన పర్యటనలో రేవంత్ చంగ్ యే చున్ నదిని కూడా సందర్శించారు. నదికి రెండువైపులా ప్రభుత్వం చేసిన అభవృద్ధిని ప్రత్యక్షంగా గమనించారు.

సమస్యలేమిటి ? మన దగ్గర ప్రతిదీ సమస్యే. ఏదన్నా అభివృద్ధి చేయాలన్నా, ప్రాజెక్టు చేపట్టాలన్నా ముందుగా మొదలయ్యేది రాజకీయ అడ్డంకులే. సమాజంలోని చాలా సమస్యలకు మూలకరాణం రాజకీయ పార్టీలే. ఇపుడు మూసి నదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించటం తలకుమించిన భారమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆక్రమణల్లో అన్నీపార్టీల పాత్రుంది. ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేయగానే రాజకీయంగా వెనక్కు లాగుతాయి లేకపోతే అడ్డంకులు సృష్టిస్తాయి. అదీకాకపోతే కోర్టును ఆశ్రయిస్తాయి. కోర్టు గనుక స్టే ఇస్తే ఇక సంవత్సరాలు పట్టినా కేసు తెమలదు కాబట్టి ప్రాజెక్టు ముందుకు సాగదు.



 ప్రభుత్వం ఏ ప్రాజెక్టు టేకప్ చేసినా సత్సంకల్పంతో కాకుండా హిడెన్ అజెండాతోనే మొదలు పెడుతుందనటంలో అనుమానాలు అవసరంలేదు. అవినీతికి చోటులేకుండా ప్రజాక్షేమమే, సమాజాభివృద్ధే ధ్యేయంగా చిత్తశుద్దితో ఏ ప్రభుత్వమూ ఏ ప్రాజెక్టును టేకప్ చేయటంలేదు. అందుకనే రాజకీయంగా నానా రాద్దాంతం జరుగుతుంటుంది. ఏ ప్రాజెక్టు చూసినా అవినీతి కంపే. మూసీనది కంపుకన్నా అవినీతి కంపే చాలా ఎక్కువగా ఉంటుంది. దక్షిణకొరియాలో మురికికూపంగా తయారైన చంగ్ యే చున్ నదిని ప్రభుత్వం అత్యంత సుదరంగా తీర్చిదిద్దిదంటే అక్కడి సంకల్పబలం. పరిస్ధితులు వేరు. ఇక్కడ మూసీ వ్యవహారం వేరు. రాజకీయ ఒత్తిళ్ళను, ఆర్ధిక ప్రతికూలతలను, న్యాయపరమైన సమస్యలను అధిగమించి రేవంత్ రెడ్డి మూసీనది సుందరీకరణ ప్రాజెక్టును సక్సెస్ చేయగలిగితే అంతకన్నా కావాల్సిందేముంది ? రేవంత్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.

Tags:    

Similar News