కేటీఆర్ ‘ఆశల’పై సుప్రింకోర్టు నీళ్ళు చల్లిందా ?
అనర్హత వేటు వేస్తుందని, ఉపఎన్నికలు జరుగుతాయని, అన్నింటిలోను బీఆర్ఎస్(BRS) గెలిచేస్తుందని కేటీఆర్(KTR) ఎన్నిసార్లు బహిరంగంగా ప్రకటనలు చేశారో లెక్కేలేదు;
ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఫిరాయింపు ఆశలపై సుప్రింకోర్టు నీళ్ళ చల్లేసింది. ఫిరాయింపు ఆశలు అని అనటానికి కారణం ఫిరాయింపు ఎంఎల్ఏలపై సుప్రింకోర్టు(Supreme Court) అనర్హత వేటు వేస్తుందని, ఉపఎన్నికలు జరుగుతాయని, అన్నింటిలోను బీఆర్ఎస్(BRS) గెలిచేస్తుందని కేటీఆర్(KTR) ఎన్నిసార్లు బహిరంగంగా ప్రకటనలు చేశారో లెక్కేలేదు. అలాంటిది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలపై మూడునెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశింది. ఇదేసమయంలో కేటీఆర్ ప్రధాన డిమాండ్ అయిన ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటును సుప్రింకోర్టు తోసిపుచ్చింది. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయటం తమపనికాదు అన్నట్లుగా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తేల్చిచెప్పేసింది.
అనర్హతవేటును సుప్రింకోర్టు తోసిపుచ్చటం అంటే కేటీఆర్ ఆశలపై నీళ్ళుచల్లేయటం కాక మరేమిటి ? పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వచ్చేస్తుందని ఇంతకాలం పార్టీ నేతలతో చెబుతున్నారు. ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలు కాకుండా ఇంకెవరూ పార్టీ ఫిరాయించకుండా ఉండటంకోసమే తనతో పాటు ఎంఎల్ఏలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డితో కోర్టుల్లో కేసులు వేయించారు. ఇక్కడ కేటీఆర్ ప్లాన్ వర్కవుటైంది. ఎలాగంటే ఫిరాయింపు ఎంఎల్ఏల మీద అనర్హత వేటుపడుతుందని, తొందరలోనే వాళ్ళంతా మాజీలు అవుతారనే సందేశాన్ని పార్టీలోని మిగలిన ఎంఎల్ఏలకు గట్టిగానే చేరింది. దాంతో ఫిరాయింపు ఎంఎల్ఏల్లోనే కాకుండా ఫిరాయింపులు చేయాలని అనుకుంటున్న ఎంఎల్ఏల్లో కూడా గట్టిగానే కేటీఆర్ టెన్షన్ పెంచగలిగారు.
అనర్హత భయంతోనే మరికొందరు ఎంఎల్ఏలు బీఆర్ఎస్ నుండి వెళ్ళాలని అనుకున్నా ఆగిపోయారనే ప్రచారం అప్పట్లో జరిగింది. కేటీఆర్ కు కావాల్సింది దక్కిందనే సెటైర్లు కూడా అప్పట్లో వినిపించాయి. అయితే బాగా ఆశలు పెట్టుకున్నట్లు ఫిరాయింపులపై అనర్హతవేటు పడలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వచ్చే అవకాశాలులేవు. అయినా ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటుపడే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే మూడునెలల్లో ఫిరాయింపులపై యాక్షన్ తీసుకోమని అసెంబ్లీ స్పీకర్ ను సుప్రింకోర్టు ఆదేశించింది. అంతేకాని అనర్హత వేటు వేయాలని చెప్పలేదు. కాబట్టి ఫిరాయింపు ఎంఎల్ఏలకు స్పీకర్ కార్యాలయం విచారణకు పిలుస్తు మూడునెలల్లో నోటీసులు జారీచేసే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.
ఈవిచారణ ప్రభుత్వశాఖల్లో ఫైళ్ళు కదిలినట్లుగా నత్తనడకన నడవటం ఖాయం. ఫిరాయింపులపై వేటుపడటం ఎనుముల రేవంత్ రెడ్డికి(Revanth) ఏమాత్రం ఇష్టంలేదు. రేవంత్ ఇష్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెళ్ళే అవకాశాలు లేవు. కాబట్టి పైన చెప్పుకున్నట్లు విచారణ ప్రక్రియను స్పీకర్ మూడునెలల్లో ప్రారంభిస్తారు. అయితే ఈ విచారణ ఎప్పటికి ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పలానా సమయంలోగా విచారణ ముగించి నిర్ణయం తీసుకోవాలని సుప్రింకోర్టు స్పీకర్ ను నిర్దేశించలేదు. కాబట్టి ఎంతకాలం విచారణ చేయాలన్న విషయం స్పీకర్ ఇష్టమనటంలో సందేహంలేదు. స్పీకర్ నిర్ణయం తీసుకునేలోపు పుణ్యకాలం గడిచి మళ్ళీ ఎన్నికలు వచ్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
కేసీఆర్ హయాంలో ఏమి జరిగింది ?
తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్(KCR) ఫిరాయింపులకు తెరలేపారు. తన తొమ్మిదేళ్ళలో 23 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను కేసీఆర్ బీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు. టీడీఎల్పీని నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ఎల్పీలో కలిపేసుకున్నారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ ఎంఎల్ఏలు కోర్టుల్లో పిటీషన్లు వేసినా ఎలాంటి ఉపయోగంలేకపోయింది. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎన్నిసార్లు అప్పట్లో స్పీకర్లుగా పనిచేసిన వారికి ఎన్నివిజ్ఞప్తులు చేసినా ఉపయోగంలేకపోయింది. తాము అధికారంలో ఉన్నపుడు యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి చట్టం, న్యాయం, ధర్మం గురించి మాట్లాడుతు ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని నానా రచ్చచేయటం ఆశ్చర్యంగా ఉంది.