సమస్యల పరిష్కారానికి విద్యార్ధుల 45 కిలోమీటర్ల పాదయాత్ర (వీడియో)

విద్యార్దుల పాదయాత్ర ద్వారా నిరసన తెలపటం ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది;

Update: 2025-07-31 04:36 GMT
Students 45 KM march

సమస్యలను ప్రపంచానికి తెలియజేయటానికి ఒక్కొక్కళ్ళది ఒక్కో మార్గం. రాజకీయ నేతలు ఒకమార్గం అనుసరిస్తే, ఉద్యోగులు మరో విధానాన్ని పాటిస్తారు. రాజకీయపార్టీలు మరో మార్గాన్ని అనుసరిస్తాయి. విద్యార్దులు అందరు ఏకమై నిరసన తెలియజేస్తారు. ఇపుడిదంతా ఎందుకంటే కొందరు విద్యార్ధులు తమ సమస్యలను కలెక్టర్ కు తెలియజేసేందుకు 45 కిలోమీటర్ల పాదయాత్రకు రెడీఅయ్యారు. విద్యార్దుల పాదయాత్ర ద్వారా నిరసన తెలపటం ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే జోగులాంబ గద్వాల(Gadwala) జిల్లాలో అలంపూర్ మండలంలో మహాత్మాజ్యోతిభాపూలే(Jyotibha Pule) బాలుర గురుకుల్ స్కూల్ ఉంది. ఇందులో 560 మంది విద్యార్ధులు చదువుతున్నారు. 5-10 తరగతుల మధ్య 480 విద్యార్ధులు, ఇంటర్మీడియట్ లో 80 మంది విద్యార్ధులున్నారు.

వీరంతా చాలాకాలంగా సమస్యలపరిష్కారానికి స్కూలు హెడ్ మాస్టర్, టీచర్లతో చెప్పుకుంటున్నారు. అయినా ఎవరూ వీళ్ళ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టలేదు. ఇంతకీ వీళ్ళుచెబుతున్న సమస్యలు ఏమిటంటే చాలా చిన్నవే. తాగేందుకు ఫ్లోరైడ్ నీటికి బదులు మంచినీరు కావాలని, మరుగుదొడ్లు(బాత్ రూములు) నిర్మించాలని, పురుగులు లేని అన్నం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్ధుల చిన్న డిమాండ్లే ఉన్నతాధికారులకు చాలా పెద్ద డిమాండ్లుగా అనిపించినట్లున్నాయి. అందుకనే పట్టించుకోకుండా గాలికి వదిలేశారు.

సమస్యలను చెప్పి చెప్పి విసిగిపోయిన విద్యార్ధులు లాభంలేదని అనుకుని చివరకు రోడ్డెక్కారు. స్కూల్ దగ్గర నుండి కలెక్టర్ ఆఫీసుకు పాదయాత్ర చేసి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ స్కూలుకు కలెక్టర్ ఆఫీసుకు మధ్య ఉన్న దూరం ఎంతంటే 45 కిలోమీటర్లు. అంతదూరాన్ని నడవాలని చిన్నపిల్లలు అనుకోవటమే చాలా పెద్ద నిర్ణయం. విద్యార్ధుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు(Telangana police) వెంటనే స్కూలు దగ్గరకు వచ్చి సముదాయించేందుకు ప్రయత్నించారు. అయితే విద్యార్ధులు వినిపించుకోకుండా నిరసనగా పాదయత్ర మొదలుపెట్టి 9 కిలోమీటర్లు నడిచారు. అప్పటికే చాలామంది పిల్లలు పూర్తిగా అలసిపోయారు. అయినా పట్టువదలకుండా ముందుకే నడిచారు. అప్పుడు పోలీసులు మరోసారి విద్యార్ధులను రోడ్డుపైన అడ్డుకున్నారు.

చిన్నపిల్లలు పాదయాత్రగా నిరసన తెలపటం మంచిదికాదని ఉన్నతాధికారులనే స్కూలు దగ్గరకు వచ్చేట్లు తాము మాట్లాడుతామని నచ్చచెప్పారు. పోలీసులు చెప్పిన మాటలపై ఎందుకనో పిల్లలకు నమ్మకం కుదిరింది. దాంతో విద్యార్ధులు పాదయాత్రను విరమించుకున్నారు. వెంటనే పోలీసులు అందరినీ వ్యాన్లోకి ఎక్కించి తిరిగి స్కూల్ దగ్గరకు తీసుకొచ్చి విడిచిపెట్టారు. తర్వాత పిల్లల నిరసనను పోలీసులు అడిషినల్ కలెక్టర్ నర్సింగరావుకు తెలియజేశారు. దాంతో అడిషినల్ కలెక్టర్ స్కూలుకు వచ్చి విద్యార్దులతో మాట్లాడారు. విద్యార్ధులు చెప్పింది ఏమిటంటే టీచర్లు ఫిల్టర్ నీళ్ళు తాగుతుండగా తాము మాత్రం ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. అలాగే అన్నంలో ప్రతిరోజు పురుగులు వస్తోంది. స్కూలుకు 16 మరుగుదొడ్లు ఉన్నప్పటికీ రిపేర్ల పేరుతో అన్నింటినీ మూసేయటంతో వేరేదారిలేక బహిరంగ స్ధలాల్లోనే అవసరాలు తీర్చుకుంటున్నారు. వీళ్ళ సమస్యలు విన్నతర్వాత అడిషినల్ కలెక్టర్ మాట్లాడుతు సమస్యలు చెప్పుకునేందుకు ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటుచేశామని నర్సింగరావు హామీ ఇచ్చారు. మరి విద్యార్ధుల సమస్యలు ఎన్నిరోజుల్లో పరిష్కారమవుతుందో చూడాలి.

Tags:    

Similar News