మంత్రివర్గ విస్తరణలో రెడ్లతోనే రేవంత్ రెడ్డికి అసలు సమస్యా ?
మిగిలిన పార్టీల సంగతిని పక్కనపెట్టేస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మంత్రివర్గ కూర్పు లేదా విస్తరణ ముఖ్యమంత్రులకు పెద్ద అగ్నిపరీక్షనే చెప్పాలి;
మిగిలిన పార్టీల సంగతిని పక్కనపెట్టేస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మంత్రివర్గ కూర్పు లేదా విస్తరణ ముఖ్యమంత్రులకు పెద్ద అగ్నిపరీక్షనే చెప్పాలి. ఎందుకంటే పూర్తిస్ధాయి ప్రాజాస్వామ్యం ఉండటమే పార్టీకి పెద్ద మైనస్, పెద్ద ప్లస్. పార్టీఅధిష్ఠానం దగ్గర ముఖ్యమంత్రులకు ఎంతపట్టుంటుందో అంతేపట్టు సీనియర్ నేతలకు కూడా ఉంటుంది. కాబట్టి మంత్రివర్గం అంటేనే ముఖ్యమంత్రులకు పెద్ద తలనొప్పిగా తయారవుతుంది. గతంలో మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నపుడు ఏమి జరిగిందో చాలామందికి తెలిసే ఉంటుంది. పైముగ్గురికి తలనొప్పులు మంత్రివర్గ విస్తరణతోనే మొదలైంది. మంత్రివర్గలోను, తర్వాత జరిగిన విస్తరణలో చోటుదక్కని చాలామంది సీనియర్లు పైముగ్గురికి వ్యతిరేకంగా నానా రచ్చచేశారు. సేమ్ టు సేమ్ ఇపుడు రేవంత్ రెడ్డి(Revanth)కి కూడా అలాంటి తలనొప్పులే తప్పవన్న సంకేతాలు కనబడుతున్నాయి.
ఇపుడిదంతా ఎందుకంటే తొందరలోనే మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)జరగబోతోందన్న విషయం ఖాయమైందనే ప్రచారం అందరికీ తెలిసిదే. మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం చాలామంది సీనియర్లు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఉన్న అవకాశాలు మాత్రం చాలా చాలా తక్కువ. రేవంత్ ను కలిపితే ఇపుడున్న మంత్రుల సంఖ్య 12. మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవటానికి మాత్రమే రేవంత్ కు అవకాశముంది. మంత్రుల సంఖ్య 18 దాటేందుకు లేదు. ఈ నేపధ్యంలో సీనియర్లలో ఎవరిని పక్కనపెట్టినా రేవంత్ కు తలనొప్పులు తప్పవు. సామాజికవర్గాల వారీగా తీసుకున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు పోను అగ్రవర్ణాలకు మిగిలేది మహాయితే రెండు లేక మూడు అవకాశాలు మాత్రమే. అదికూడా మొత్తం ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్ఠానం డిసైడ్ అయితేనే. ఇపుడు నలుగురిని మాత్రమే తీసుకుని మిగిలిన రెండుస్ధానాలను మరోసందర్భంలో భర్తీచేయాలని అధిష్ఠానం డిసైడ్ అయితే రేవంత్ చేయగలిగేది ఏమీలేదు.
ఇదేజరిగితే ఇపుడు నలుగురికి మాత్రమే అవకాశం వస్తుందని అనుకోవాలి. నలుగురికి అవకాశం వస్తుందన్నది సరేకాని ఆ నలుగురు ఎవరన్నదే అసలైన సమస్య. ఎందుకంటే ప్రతి సామాజికవర్గంనుండి మంత్రివర్గంలో చోటుకోసం పెద్దఎత్తున ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. మంత్రివర్గంలో చోటుదక్కని ఎంఎల్ఏలు రేవంత్ నే కాదు చివరకు అధిష్ఠానాన్ని కూడా లెక్కచేయరన్న విషయం తెలిసిందే. మిగిలిన సామాజికవర్గాల సంగతిని పక్కనపెట్టేసినా రేవంత్ కు సమస్యంతా సొంతసామాజికవర్గం రెడ్లనుండే పెరిగిపోతుంది. రెడ్లలో మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి(Komatireddy Rajagopal Reddy), బోధన్ ఎంఎల్ఏ సుదర్శనరెడ్డి, పరిగి ఎంఎల్ఏ తమ్మన్నగారి రామ్ మోహన్ రెడ్డి, ఇంబ్రహింపట్నం ఎంఎల్ఏ మల్ రెడ్డి రంగారెడ్డి నుండి గట్టిపోటీ ఉంది. తెరమీద కనబడకుండా ఇంకెంతమంది రెడ్లు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారో తెలీదు. పై నలుగురు తమకు మంత్రపదవి ఇచ్చితీరాల్సిందే అని బహిరంగంగానే వార్నింగుల్లాంటి డిమాండ్లు చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే.
నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలనుండి మంత్రివర్గంలో ఎవరికీ చోటు దక్కలేదు. నిజామాబాద్ కోటాలో సుదర్శనరెడ్డి, రంగారెడ్డి జిల్లా కోటలో మల్ రెడ్డి తమకు అవకాశం ఇచ్చితీరాల్సిందే అని పట్టుబడుతున్నారు. తనకు మంత్రిపదవి రాకపోతే ఎంఎల్ఏగా రాజీనామా చేస్తానని ఇప్పటికే మల్ రెడ్డి ప్రకటించటం పార్టీలో కలకలం రేపుతోంది. కోమటిరెడ్డి కూడా దాదాపు ఇదే రకమైన మాటలు మాట్లాడుతున్నారు. అయితే రాజగోపాలరెడ్డికి పెద్ద మైనస్ ఉంది. అదేమిటంటే ఇప్పటికే ఈయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkata Reddy) మంత్రిగా ఉన్నారు. అయినా సరే తనకు మంత్రిపదవి ఇవ్వాల్సిందే అని రాజగోపాలరెడ్డి పట్టుబడుతున్నారు. అన్నకుతోడుగా తమ్ముడిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే రేవంత్ పనిగోవిందానే. రెడ్లలో మిగిలిన ఎంఎల్ఏలు, ఇతర సామాజికవర్గాల ఎంఎల్ఏలు రేవంత్ ను దుమ్ముదులిపేయటం ఖాయం.
ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్డి కోటాలో రేవంత్ తో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy) ఉన్నారు. కాబట్టి రెడ్లకు మహాయితే ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. ఒక్కరికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించి మిగిలిన రెడ్లను వదిలేస్తే రెడ్డి సామాజికవర్గంనుండి సమస్యలు మొదలవుతాయి. ప్రస్తుత రాజకీయవాతావరణంలో బీసీ వాదన చాలా బలంగావినబడుతోంది. బీసీలను వదిలిపెట్టేందుకు లేదు కాబట్టి బీసీలకు పెద్దపీట వేయాల్సిందే. ప్రస్తుత మంత్రివర్గంలో బీసీ కోటాలో కొండాసురేఖ(Konda Surekha), పొన్నం ప్రభాకర్ మాత్రమే ఉన్నారు. బీసీలను తీసుకోవటం అన్నది ‘నీడ్ ఆఫ్ ది డే’ అన్నట్లుగా తయారైంది వాతావరణం. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ ఎంఎల్ఏ వాకిటి శ్రీహరి ముదిరాజ్, కొత్తగా ఎంఎల్సీ అయిన విజయశాంతి మంత్రిపదవికోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బీసీ కోటాలో ఇద్దరిలో ఒకరికి అవకాశం ఖాయం. రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలుపులో భాగంగా బీసీలకు పెద్ద పీట వేశామని చెప్పుకోవాలంటే ఇద్దరికీ అవకాశం దక్కినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎస్టీల్లో నల్గొండ జిల్లా దేవరకొండ ఎంఎల్ఏ బాలూనాయక్ గట్టిగా ప్రయత్నంచేసుకుంటున్నారు. ఎస్సీలో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎంఎల్ఏ గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ముస్లింలకు అవకాశం ?
మంత్రివర్గంలో ఇపుడు ముస్లింలు ఎవరూ లేరు. 2023 ఎన్నికల్లో పోటీచేసిన షబ్బీర్ ఆలీ, మహమ్మద్ అజారుద్దీన్ ఓడిపోయారు. ఓడిన వారికి ఎంఎల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవద్దని అధిష్ఠానం గట్టిగా చెప్పటంతో పై ఇద్దరు అవకాశాలు కోల్పోయారు. అయితే ఎంఎల్ఏ కోటాలో భర్తీ అయిన ఎంఎల్సీల్లో అమైర్ ఆలీఖాన్ ఉన్నారు. కాబట్టి తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)(GHMC) ఎన్నికల్లో ముస్లిం సామాజికవర్గం ఓట్లకోసం అమైర్ కు అవకాశం దక్కినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మరిన్ని ప్రతిబంధకాలను దాటుకుని మంత్రివర్గ విస్తరణలోకి రేవంత్ ఎవరిని తీసుకుంటారో చూడాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వ్యవహారం ఎప్పుడూ కాళ్ళు, చేతులు కట్టేసి నీళ్ళల్లోకి తీసేసి ఈతకొట్టుకుని ఒడ్డుకురమ్మనట్లే ఉంటుంది. ఎక్కడో దివంగత్ ముఖ్యమంత్రి వైఎస్సార్(YSR) లాంటి వాళ్ళు మాత్రమే మినహాయింపుగా ఉంటారు.
ఫిరాయింపులకు నో ఛాన్స్ ?
బీఆర్ఎస్(BRS) నుండి కాంగ్రెస్ లోకి పదిమంది ఎంఎల్ఏలు ఫిరాయించిన విషయం తెలిసిందే. వీరిలో కొందరికి రేవంత్ మంత్రివర్గంలో అవకాశం ఇస్తానని హామీఇచ్చారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిచటం కష్టమని అర్ధమవుతోంది. కారణం ఏమిటంటే ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రింకోర్టులో వేసిన కేసు విచారణ జరుగుతోంది. ఫిరాయింపుల వివాదం కోర్టులో నలుగుతున్నపుడు వీళ్ళను మంత్రివర్గంలోకి తీసుకోవటం మంచిదికాదని రేవంత్ నిర్ణయించారు. మంగళవారం ఇదే కేసును సుప్రింకోర్టు జస్టిస్ లు బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ విచారణ చేస్తున్నారు.
ప్రత్యామ్నాయాలు రెడీగా ఉన్నాయా ?
ఆశావహులు ఎక్కువ, అవకాశాలు తక్కువ కాబట్టి రేవంత్ కు తలనొప్పులు తప్పవు. అందుకనే మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు దక్కనివారిని సంతృప్తి పరిచేందుకు రేవంత్ ప్రత్యామ్నాయాలను రెడీచేసినట్లు పార్టీవర్గాల సమాచారం. అవేమిటంటే డిప్యుటీ స్పీకర్, చీఫ్ విప్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, క్యాబినెట్ ర్యాంకుతో కార్పొరేషన్ల ఛైర్మన్లుగా నియమించాలని అధిష్ఠానాన్ని రేవంత్ ఒప్పించినట్లు సమాచారం. డీప్యుటి స్పీకర్, క్యాబినెట్ ర్యాంకుతో కార్పొరేషన్ ఛైర్మన్ల పోస్టులన్నీ మంత్రిపదవి ముందు తక్కువే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే చాలామంది దృష్టి మంత్రిపదవులపైన మాత్రమే ఉంది. మరి రేవంత్ ఏమిచేస్తారో చూడాల్సిందే.