బీఆర్ఎస్ ఎంఎల్ఏల కోసం రేవంత్ బిగ్ స్కెచ్ ?

రాబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాలనాటికి వీలైనంతమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏ(BRS MLAs)లను కాంగ్రెస్ లోకి లాగేసుకోవటానికి రేవంత్(Revanth) బిగ్ స్కెచ్ వేస్తున్నారు.

Update: 2024-11-22 09:38 GMT
Revanth reddy

బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాగేసుకోవటానికి రేవంత్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాలనాటికి వీలైనంతమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏ(BRS MLAs)లను కాంగ్రెస్ లోకి లాగేసుకోవటానికి రేవంత్(Revanth) బిగ్ స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి రేవంత్ పదిమంది ఎంఎల్ఏలను లాగేసుకున్న విషయం తెలిసిందే. కోర్టుకేసుల కారణంగా ఫిరాయింపులకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. పదిమంది ఎంఎల్ఏలను లాగేసుకున్న తర్వాత కారుపార్టీ ఎంఎల్ఏలు కేపీ వివేకానంద్ గౌడ్, పాడి కౌశిక్ రెడ్డిలు హైకోర్టులో పిటీషన్లు దాఖలుచేశారు. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలు కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపైన వెంటనే అనర్హత వేటు వేయాలని వీళ్ళు కోరారు. అనర్హత వేటు వేసేట్లుగా స్పీకర్ ను ఆదేశించాలని వీళ్ళు కోరారు. శుక్రవారం డివిజన్ బెంచ్ ఈ కేసులో తీర్పిచ్చింది.

అనర్హత కేసు విషయంలో స్పీకర్ ను ఏ విధంగాను నిర్దేశించలేమని చెప్పింది. గతంలో ఫిరాయింపు ఎంఎల్ఏలపై నాలుగువారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును ఫిరాయింపు ఎంఎల్ఏలు డివిజన్ బెంచ్ లో సవాలుచేశారు. అలాగే అసెంబ్లీ కార్యదర్శి కూడా సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేయాలని కేసు వేశారు. ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హత వేటు, నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం అంటు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎంఎల్ఏల అనర్హత వేటు విషయంలో ఫైనల్ నిర్ణయం స్పీకర్ దే అని తేల్చిచెప్పేసింది. పలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పీకర్ ను ఆదేశించేందుకు లేదని తేల్చేసింది. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటు ఎప్పుడు వేయాలన్న నిర్ణయం సంపూర్ణంగా స్పీకర్ దే అని డివిజన్ బెంచ్ స్పష్టంగా చెప్పేసింది.

కోర్టు తాజా తీర్పు ఫిరాయింపు ఎంఎల్ఏల్లోనే కాకుండా రేవంత్ రెడ్డిలో కూడా ఫుల్లు జోష్ నింపింది. కోర్టులో దాఖలైన కేసు తీర్పు చూసుకున్న తర్వాత ఫిరాయింపులకు ముహూర్తం పెడదామని రేవంత్ కాస్త బ్రేకు తీసుకున్నారు. తాజా తీర్పుతో ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కోర్టు తేల్చేయటం రేవంత్ చర్యలకు ఊతమిచ్చినట్లే అయ్యింది. దాదాపు రెండునెలల క్రితం ఆపేసిన ఆపరేషన్ ఆకర్ష్(Operation Aakarsh) కు రేవంత్ మళ్ళీ స్కెచ్ వేయబోతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుచుకున్న 39 మంది ఎంఎల్ఏల్లో ఇప్పటికే పదిమందిని లాగేసుకున్నారు. మిగిలిన 29 మందిలో ఎంతమందిని వీలైతే అంతమందిని లాగేసుకోవాలన్నది రేవంత్ టార్గెట్.

ఈ టార్గెట్ వెనుక పెద్ద కథే ఉంది. అదేమిటంటే అసెంబ్లీలో ఇపుడు బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షమనే హోదా ఉంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి దాని అధినేత కేసీఆర్(KCR) ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అంటే ప్రోటోకాల్ లో ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రధాన్యత ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి తర్వాత స్ధానం క్యాబినెట్ మంత్రి హోదాతో ప్రధాన ప్రతిపక్ష హోదా నేతకే దక్కుతుంది. ఈ లెక్కప్రకారం రేవంత్ తర్వాత స్ధానం కేసీఆర్ దే. అయితే 119 మంది ఎంఎల్ఏలున్న అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే ఏ పార్టీకి అయినా 10 శాతం సీట్లు తెచ్చుకోవాల్సిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎంఎల్ఏలను గెలుచుకున్నా ఇపుడు బీఆర్ఎస్ లో ఉన్నది 29 మంది మాత్రమే. ఇపుడున్న 29 మందిలో ఓ 20 మంది ఎంఎల్ఏలను లాగేసుకుంటే బీఆర్ఎస్ బలం 9కి పడిపోతుంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. దాంతో ఆటోమేటిక్కుగా కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రద్దవుతుంది. అప్పుడు కేసీఆర్ మిగిలిన ఎంఎల్ఏల్లాగే ఉండాలి.

క్యాబినెట్ హోదా ఉండి, ప్రధాన ప్రతిపక్ష నేతగానే కేసీఆర్ అసెంబ్లీకి రావటంలేదు. అలాంటిది అన్నీ హోదాలు కోల్పోయిన తర్వాత అసెంబ్లీకి వస్తారా ? కేసీఆర్ ను అసెంబ్లీకి దూరంగా ఉంచటమే రేవంత్ కు కావాల్సింది. అందుకనే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. మధ్యలో కోర్టులో కేసులు పడటంతో ఫిరాయింపులకు బ్రేకులు వేశారు. కోర్టు తాజా తీర్పుతో రేవంత్ మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ కు ముహూర్తం పెట్టబోతున్నారు. ఇపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కూడా నిర్భయంగా కాంగ్రెస్ లోకి ఫిరాయించేస్తారనటంలో సందేహంలేదు. ఈసారి ఇంకెంతమందిని లాగేసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News