రాష్ట్ర రాజకీయాల నుంచి ‘తెలంగాణ సెంటిమెంట్’ గల్లంతేనా?

రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగవుతోంది. టీఆర్ఎస్‌ పేరును బీఆర్ఎస్‌గా మార్చడంతో కేసీఆర్‌‌కు తెలంగాణ ప్రజల మద్దతు కోల్పోయిందా..

Update: 2024-03-15 06:28 GMT
Source: Twitter


హైదరాబాద్: భారత రాష్ట్ర సమితికి ఇంత గడ్డు కాలం వస్తుందని అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కలలో కూడా ఊహించి ఉండరు. తెలంగాణ సెంటిమెంట్ తనకు మిగలడం లేదు. తను పెంచి పోషించిన నేతలు పార్టీకి మిగలడం లేదు. సీనియర్లు ముఖం చాటేస్తున్నారు. జూనియర్లు భయపడుతున్నారు. ఈ పరిస్థితులో లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయి. వీటిలో కూడా పరాజం ఎదురైతే బీఆర్‌ఎస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. బీఆర్‌ఎస్ కష్టాల్లో ఉన్నపుడే బలపడాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం పాల్పడిన కరప్షన్ మీద దృష్టి పెట్టి ఫ్యామిలీ మొత్తాన్ని దోషులుగా నిలబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కేసీఆర్ దగ్గిర నుంచి తెలంగాణ సెంటిమెంట్‌ను లాగేసుకోవాలని బీజేపీ చూస్తోంది.


తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ని భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్)గా మార్చడంతోనే తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ వదలుకున్నారు. ఆయన ఎప్పుడో చేసిన నిరాహారదీక్షతో ‘మృత్యుముఖంలో తలదూర్చిన కేసీఆర్’ అంటూ ప్రచారం చేసి తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసే ప్రయత్నం చేశారు. అది పని చేయలేదు. పార్టీ దారుణంగా ఓడిపోయింది. దీంతో తెలంగాణ సెంటిమెంట్ ఇక ఎన్నికల ప్రచారానికి పనికి రాని అస్త్రమేమో అనిపిస్తోంది. అందువల్ల రాష్ట్రంలో ఎక్కడైనా అంతో ఇంతో తెలంగాణ సెంటిమెంట్ ఉంటే దాన్ని లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ పక్కా ప్రణాళికలో భాగంగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం గత మంగళవారం నాడు గెజిట్‌ను విడుదల చేసింది.

నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17వ తేదీని ఇకపై ప్రతి ఏటా ‘హైదరాబాద్‌ విమోచన దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రకటించింది. బ్రిటిష్‌ పాలకుల నుంచి భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ ప్రాంతానికి స్వాతంత్య్రం రాని విషయాన్ని, ఆ ప్రాంత ప్రజల పోరాటాల నేపథ్యంలో 1948 సెప్టెంబరు 17న ‘ఆపరేషన్‌ పోలో’ పేరిట నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చేపట్టిన సైనిక చర్యతో నిజాం నవాబు దిగివచ్చిన విషయాన్ని ఈ నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఇలా చేసింది అనే విమర్శలు కూడా వినిపించడం వేరే విషయం.

గత రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ అంశంపై గుత్తాధిపత్యంతో రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీకి ఈ క్రెడిట్ ఇవ్వకుండా ఉండేందుకు దీనిని తెలంగాణ విలీన దినమనో, తెలంగాణ విద్రోహ దినమనో చెబుతూ ఈ అంశాన్ని చర్చనీయాంశం చేశాయి. బీజేపీ మాత్రం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు విలీన దినంగా పాటిస్తుండగా, ఎంఐఎం మాత్రం విద్రోహ దినంగా పరిగణిస్తున్నాయి.

తెలంగాణ అంశాన్ని రాజకీయంగా వాడుకొని తెలంగాణలో బలపడి, ఎప్పుడో ఒకసారి అధికారంలోకి రావాలనే ప్రణాళికతో బీజేపీ పనిచేస్తోంది. దీనికి కమ్యూనిస్టు పార్టీల నుంచి కొంత ప్రతిఘటన ఎదురు కావచ్చు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చూపుతూ కమ్యూనిస్టు పార్టీలు కూడా తెలంగాణ అంశాన్ని సొంతం చేసుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాయి. గతంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. నల్గొండ జిల్లాలోని గుండ్రంపల్లిని సందర్శించి, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తులను సన్మానించి, పార్టీలకు అతీతంగా తెలంగాణ యోధులను బీజేపీ గౌరవిస్తుందనే సంకేతాలు ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు నిర్మించిన తెలంగాణ సాయుధ పోరాటం యోధుల స్థూపం, రజాకార్లు 200 మందిని సమాధి చేసిన బావి ఎదురుగానే బీజేపీ సభ నిర్వహించింది.

బీజేపీ రాష్ట్ర నాయకులు మదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చి తెలంగాణ సెంటిమెంట్‌ను వదిలేసుకున్నారని అన్నారు. “పార్టీ పేరు నుంచి తెలంగాణ పదంను తొలగించడంతో ప్రజలలో అంతర్గతంగా ఆ పార్టీపై వ్యతిరేకత ఏర్పడింది. తెలంగాణ అంశం బీఆర్‌ఎస్ సొత్తు కాదు. తెలంగాణ అంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే కాదు. దానికి ఒక చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం ఉంది. తెలంగాణ ప్రజల్లో పోరాట పటిమతో పాటు, రాజకీయ చైతన్యమూ ఎక్కువే. వారే మున్ముందు వాస్తవాల ఆధారంగా రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తారు” అని అన్నారు.



Tags:    

Similar News