‘ఫ్యూచర్ సిటీ’నే తెలంగాణ ఫ్యూచరా..?

అభివృద్ధిలో హైదరాబాద్‌కు మాత్రం దేశంలో ఏ నగరం పోటీ కాదని అన్నారు.;

Update: 2025-07-03 13:30 GMT

తెలంగాణ ఫ్యూచర్‌కు ఫ్యూచర్ సిటీ ఒక్కటే మార్గమా? అంటే.. సీఎం రేవంత్ మాటలు చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్ట్‌ను రేవంత్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది. ఇప్పటికే పలుసార్లు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికే ‘ఫ్యూచర్ సిటీ’ అని చెప్పారు రేవంత్. అదే విధంగా గురువారం.. హైదరాబాద్ నగరానికి పోటీ అనేది ప్రపంచ నగరాలతోనే అని పునరుద్ఘాటించారు. అన్ని రంగాల్లో హైదరాబాద్‌ తన హవా చూపిస్తోందని, తెలంగాణ కూడా అభివృద్ధిలో తమిళనాడు, కేరళతో పోటీ పడుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌కు మాత్రం దేశంలో ఏ నగరం పోటీ కాదని అన్నారు. ఆయన మాటలు చూస్తుంటే.. ఫ్యూచర్ సిటీపైనే తెలంగాణ, హైదరాబాద్ ఫ్యూచర్ ఆధారపడి ఉందని అనిపిస్తోంది. విశ్లేషకులు కూడా ఇదే మాట అంటున్నారు.

‘పెట్టుబడుల్లో తెలంగాణ హవా’

దేశంలో అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందంజలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా అన్ని రంగాల్లో పెట్టుబడులను గణనీయంగా తీసుకొస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అభివృద్ధి విషయానికి వస్తే తెలంగాణ, తమిళనాడు, కేరళ పోటీ పడుతున్నాయని ఆయన వెల్లడించారు. దేశంలో మరే నగరంతో కూడా హైదరాబాద్‌కు పోటీ లేదని చెప్పారు. హైదరాబాద్‌కు పోటీ అంటే అది ప్రపంచ నగరాలతోనేనని పేర్కొన్నారు. రానున్న వందేళ్లను దృష్టిలో పెట్టిని తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రణాళికను రూపొందించామని వెల్లడించారు.

ఫ్యూచర్ సిటీ కోసమే ఈ మాటలా..!

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి తలపెట్టదలచిన ‘ఫ్యూచర్ సిటీ’కి అనేక సవాళ్లు ఎదురుగా ఉన్నాయి. కచ్ఛితంగా ప్రతిపక్షాల నుంచి ప్రశ్నల సునామీ వచ్చి పడుతుంది. వాటన్నింటిని అడ్డుకోవడానికి, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను సాఫీగా స్టార్ట్ చేయడానికి, అంతే సాఫీగా పూర్తి చేయడం కోసమే రేవంత్ ఇప్పటి నుంచి బాటలు వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫ్యూచర్ సిటీతోనే హైదరాబాద్, తెలంగాణ ఫ్యూచర్ బ్రైట్‌గా ఉందని ప్రజలకు చిన్నచిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని వారు అంటున్నారు. ఇప్పటికే అనేక సందర్భల్లో ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడిన రేవంత్.. ఇది దేశంలోనే అత్యంత గొప్ప నగరం అవుతుందని బల్లగుద్ది చెప్పారు. కొన్ని రోజులు ఈ ప్రస్తావన ఎందుకో రాలేదు. అయితే ‘ఫ్యూచర్ సిటీ’ అనేది అద్భుతమైన ప్రాజెక్ట్, దీంతో తెలంగాణ ఫ్యూచర్‌తో పాటు ఫేట్ కూడా మారుద్దని ప్రజల్లో నమ్మకం తీసుకురావడం ఎలా అని ప్రణాళికలు సిద్ధం చేయడానికే రేవంత్ గ్యాప్ తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

రేవంత్ చెప్పే ఫ్యూచర్ సిటీ ఇదే..!

‘‘తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది.. అదే తెలంగాణ రైజింగ్. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ…ఫ్యూచర్ సిటీ ని నిర్మించాలని నిర్ణయించుకున్నాం. న్యూయర్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుంది. భారతదేశంలోనే గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం.. ఇందులో సేవా రంగం మాత్రమే ఉంటుంది. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించాం. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం తెలంగాణ. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, EVలు, సోలార్ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం. ప్రపంచంలో హైదరాబాద్ ను చైనా కు ప్లస్ సిటీ గా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణలో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల వంటి పైన దృష్టి పెడతాము. తెలంగాణకు తీరప్రాంతం లేదు. అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నాం. ఏపీలోని బందర్ ఓడరేవుతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారితో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని, మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము’’ అని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి మాస్టర్‌ ప్లాన్ తో హైదరాబాద్ ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే తెలంగాణతో పాటు హైదరాబాద్ ఫ్యూచర్‌కు కూడా ‘ఫ్యూచర్ సిటీ’నే మార్గమని అనిపిస్తోంది.

Tags:    

Similar News