బీఆర్ఎస్ లో ‘కాళేశ్వరం’ టెన్షన్ పెరిగిపోతోందా ?
రిపోర్టును ఈనెలాఖరులోగా అంటే బహుశా 30 లేదా 31 తేదీల్లో ప్రభుత్వానికి అందచేయబోతున్నట్లు సమాచారం.;
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలకనేతలు ఎన్నిరకాలుగా అయినా తమచర్యలను సమర్ధించుకోవచ్చు. ప్రభుత్వంపై ఎన్నిరకాలుగా అయినా ఎదురుదాడులు చేయవచ్చు. అయితే అవన్నీ తమను తాము కాపాడుకునేందుకు చేస్తున్న ఎదురుదాడులుగానే అందరికీ అర్ధమైపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)పై జస్టిస్ పినాకినీ చంద్రఘోష్(పీసీ ఘోష్) విచారణ పూర్తయిపోయింది. ఆ రిపోర్టును ఈనెలాఖరులోగా అంటే బహుశా 30 లేదా 31 తేదీల్లో ప్రభుత్వానికి అందచేయబోతున్నట్లు సమాచారం. ఈనెల 27వ తేదీన పీసీ ఘోష్ హైదరాబాద్ వస్తున్నారు. 2024 మార్చిలో ఏర్పాటైన కమిషన్ సుమారు 15 మాసాలు దాదాపు 117 మందిని విచారించింది. సుమారు రు. 90 వేల కోట్ల ప్రజాధనంతో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, సందిళ్ళ, అన్నారం బ్యారేజీలు ఇపుడు నీటినిల్వకు పనికిరాకుండాపోయాయి. వేలకోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు, బ్యారేజీలు నిర్మించిన మూడేళ్ళల్లోనే వాడకానికి పనికిరాకుండాపోవటంపై కేసీఆర్ పైన చాలా ఆరోపణలున్నాయి. దాంతో ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అవకతవకలపై విచారణ చేసేందుకు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది.
తన విచారణలో కమిషన్ అనేకమంది ఇంజనీరింగ్ నిపుణులను, ఇరిగేషన్ శాఖలో పనిచేసిన ఇంజనీరింగ్ ఉన్నతాదికారులు, పనిచేస్తున్న ఇంజనీర్లను, ఉన్నతాధికారులను, ఇరిగేషన్ శాఖ నిపుణులను విచారించింది. చివరగా కేసీఆర్(KCR) తో పాటు ఇరిగేషన్, ఆర్ధికశాఖలకు మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు(Harish Rao), ఈటల రాజేందర్(Eatala Rajendar) ను కూడా విచారించింది. విచారణలో అందరి దగ్గరనుండి వాగ్మూలాలు, అఫిడవిట్లను సాక్ష్యాలుగా తీసుకున్నది. విచారణకు హాజరైన వారిలో అత్యధికులు అప్పటి పాలకులు ఎలాచెబితే అలా చేశామని అఫిడవిట్లలో చెప్పినట్లు సమాచారం. మొత్తంమీద అన్నీకోణాల్లోను విచారణ జరిపిన కమిషన్ తనరిపోర్టును రెడీచేసినట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. అనేకమందిని విచారించిన కమిషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అవకతవకలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి(ఎన్డీఎస్ఏ) నివేదికలను కూడా అధ్యయనంచేసింది. వీటి రిపోర్టుల ఆధారంగానే కమిషన్ చాలామందిని విచారించింది. విచారణ ముగిసి రిపోర్టు రెడీచేయటం కూడా అయిపోయింది కాబట్టి దాన్ని ప్రభుత్వానికి అందించటం ఒకటే మిగిలింది.
కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల్లో లోపాలు కేసీఆర్ హయాంలోనే బయటపడ్డాయి. 2023 ఎన్నికలముందు బయటపడిన లోపాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బాగా ఇరుకునపెట్టింది. అప్పట్లోనే వేలకోట్ల రూపాయల ప్రజాధనంలో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలకు బీఆర్ఎస్ దగ్గర సమాధానం లేకపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు ప్రభుత్వంపై ఎదురు ఆరోపణలు మొదలుపెట్టారు. కాళేశ్వరం నిర్మాణంలో ఎక్కడా అవినీతి జరగలేదని సమర్ధించుకుంటున్నారు. చిన్న చిన్న లోపాలపై రేవంత్(Revanth) ప్రభుత్వం అబద్ధాలు చెబుతు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు కేటీఆర్, హరీష్ నానా గోలచేస్తున్నారు. ప్రాజెక్టు, బ్యారేజీల నిర్మాణాలు నాసిరకంగా ఎందుకు నిర్మించారంటే సమాధానాలు చెప్పకుండా ఎదురుదాడులతో నెట్టుకొస్తున్నారు.
చివరకు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేటీఆర్ పిచ్చిలాజిక్కులు కూడా వినిపించారు. ఆయన చెప్పిన లాజిక్ ఏమిటంటే కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి పిల్లర్లను పేల్చేశారేమో అని చెప్పటమే విచిత్రంగా అనిపించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయం కళ్ళకు కనబడుతోంది. అవినీతి జరిగిందని ఎలా చెప్పగలమంటే నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయి కాబట్టే పిల్లర్లు కుంగిపోయాయి. పిల్లర్లు కుంగిపోయాయి కాబట్టే డ్యాం ప్లాట్ ఫారమ్ చీలిపోయింది. అలాగే అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్లో నుండి నీళ్ళు కారిపోతున్నాయి. ఇంత నాసిరకంగా నిర్మాణాలు జరిగాయి కాబట్టే ఇపుడు ఇవి నీటినిల్వకు పనికిరాకుండాపోయాయి. అందుకనే రేవంత్, మంత్రులు కాళేశ్వరంను కూలేశ్వరంగా ఎద్దేవాచేస్తున్నది. కొద్దిరోజులు ఆగితే కమిషన్ రిపోర్టులో ఏముంది అన్న విషయాన్ని ప్రభుత్వం ఎలాగు బయటపెడుతుంది. అప్పటినుండి బీఆర్ఎస్ అధినేతతో పాటు కీలకనేతలకు కష్టాలు తప్పవనే అనిపిస్తోంది.
కాళేశ్వరం రిపోర్టును పక్కనపెడితే టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ చాలా జోరుగా జరుగుతోంది. కీలకపాత్రదారి టీ ప్రభాకరరావు విచారణ పూర్తయితే తర్వాత విచారణ కేసీఆర్, కేటీఆరే అనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదేసమయంలో కేటీఆర్ కీలకపాత్రదారిగా ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణ జరుగుతోంది. దీన్ని ఏసీబీ, ఈడీలు విచారిస్తున్నాయి. ఫార్ములా కేసులో కూడా అవినీతి, అధికార దుర్వినియోగం స్పష్టంగా బయటపడింది. అలాగే విద్యుత్ రంగంలో అవినీతి, అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై నియమించిన జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ తన విచారణ ముగించి రిపోర్టును ప్రభుత్వానికి చాలాకాలం క్రితమే అందించింది. అందులోని విషయాలు ఇంకా బయటకు రాలేదు. మొత్తంమీద బీఆర్ఎస్ లో కాళేశ్వరం టెన్షన్ పెరిగిపోతోందన్నది అర్ధమవుతోంది. మరి రిపోర్టులో ఏముంటుందో చూడాల్సిందే.