జూబ్లీ `హిల్` పై ఎగిరేది ఏ పార్టీ జెండా!
టిక్కెట్ కోసం కాంగ్రెస్ లో కొట్లాట;
జూబ్లీహిల్స్ బై పోల్‌ను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుండగా.. ఎలాగైనా పాగా వేయాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. ఇక సిట్టింగ్ స్థానాన్ని సెంటిమెంట్‌తో దక్కించుకునేందుకు గులాబీ అధిష్టానం ప్రయత్నం చేస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మూడు పార్టీల నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ముందుకు వస్తున్నారు. ఆయా పార్టీల అధిష్టానాలను కలుస్తూ తమకే సీటు ఇవ్వాలని ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.75 లక్షల ఓట్లు ఉండగా, అందులో 1.25 లక్షలపైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే ఈ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ వల్ల ఓట్ల చీలిక జరగకుండా చూసేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది.
జూబ్లీహిల్స్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరగబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లోపలే తీవ్ర టిక్కెట్ పోటీ మొదలైంది. ఇప్పటికే పదిమందికి పైగా కాంగ్రెస్ నేతలు టిక్కెట్ కోసం తెరపైకి వచ్చారు.
కాంగ్రెస్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు
1. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసి ఓడిన బండి రమేష్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. మాగంటి సామాజిక వర్గం. ఏపీ సి.ఎం. చంద్రబాబునాయుడి సపోర్ట్ వుంది. స్లమ్ ఏరియాలో బండికి మంచి పట్టు వుంది.
2. మేయర్ విజయలక్ష్మి జూబ్లీహిల్స్ సీటుపై ఆసక్తి చూపుతున్నారు. అందుకోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారని తెలుస్తోంది. ఇటీవల యూసుఫ్‌గుడ, రెహమత్ నగర్‌లో పర్యటించి ప్రజలకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారని టాక్.
3. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సీ రోహిన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. మాజీ మంత్రి కే.జానారెడ్డి సమీప బంధువు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి రోహిన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.
4. నవీన్ యాదవ్.. గతంలో MIM తరఫున జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేసి.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి వచ్చిన నేత. తనకు ఓ అవకాశం ఇస్తే గెలుస్తానని నమ్మకంగా ఉన్నారు.
5. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉప్పల్ నుంచి టికెట్ ఆశించారు. అప్పట్టి నుంచి లైన్‌లో వున్న తనకు జూబ్లీహిల్స్‌లో టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
6. మహ్మద్ అజారుద్దీన్.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. తనకు హైకమాండ్ సపోర్ట్ కూడా ఉందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.
7. విజయారెడ్డి.. ఖైరతాబాద్ కార్పోరేటర్, పీజేఆర్ కుమార్తె అయిన ఆమె కూడా జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ఉన్నారు.
8. ఫిరోజ్ ఖాన్, నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
9. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్.
10. ఫహీం కురేషీ
ఎంతోమంది నేతలు తమకు టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించారంటే ఈ టిక్కెట్ కోసం పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. మరి ఫైనల్‌గా ఎవరు బరిలోకి దిగుతారో అనే ఉత్కంఠత నెలకొంది.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీఎం రేవంత్రెడ్డిప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థి ఎవరైనా గెలిచేలా ప్రణాళిక రచిస్తున్నారు. ప్రభుత్వంపై జరుగుతోన్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ ఉప ఎన్నిక సరైన వేదిక అని కాంగ్రెస్ భావిస్తున్నది. అభ్యర్థి విషయంలో ప్రచారం, గందరగోళం వద్దని, దీని ద్వారా పార్టీకి డ్యామేజ్ అవుతుందని టికెట్ ఆశిస్తున్న నేతలకు సర్ది చెబుతున్నారు. ఒకవైపు పార్టీ లోపల గొడవలు, మరోవైపు బయట నుంచి రాజకీయ ఒత్తిళ్లతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు అసలైన సవాలుగా మారింది.
MIM ఎటువైపు మొగ్గుతుంది?
ఎంఐఎం పార్టీ తాజాగా సంచలన హెచ్చరిక చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మైనార్టీ అభ్యర్థిని నిలబెడితే, తామూ బరిలోకి దిగుతామని హెచ్చరించింది. ఈ హెచ్చరికతో కాంగ్రెస్ లోని మైనార్టీ అభ్యర్థులు ఊహించని షాక్‌కు గురయ్యారు. ఇది మైనార్టీ ఓట్ల చీలికకు దారి తీయవచ్చన్న ఆందోళనతో, పార్టీ అధిష్టానం మైనార్టీయేతర అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో MIM ఓటు బ్యాంక్ బలంగా ఉంది. MIMతో స్నేహపూర్వక ఒప్పందం ఉన్న నేపథ్యంలో ఈ సారి వాళ్ల మద్దతుతో గెలవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి కాంగ్రెస్ అంతర్గతంగా మద్ధతు ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అంతర్గతంగా ఎంఐఎం సహకరించే పరిస్థితులు ఉన్నాయి.
సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్ఎస్ ఆశలు
జూబ్లీహిల్స్ స్థానాన్ని తిరిగి తమ ఖాతాలోనే వేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు ఆ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ భార్యకే జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. ఇలా చేస్తే సానుభూతి కలిసొస్తుందని పార్టీ భావిస్తున్నది. గులాబీ అధినేత కేసీఆర్ సైతం ఇదే డెసిషన్‌కు వచ్చినట్టు బీఆర్ ఎస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. గోపీనాథ్ అదే నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో ఆ అసెంబ్లీలో ఆయనకు మంచి పట్టు ఉంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి గెలుపు సాధించాలని గులాబీ నేతలు జూబ్లీ పోరుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ టికెట్ మాగంటి గోపీనాథ్ కుటుంబానికే దక్కుతుంది.
పాగా వేసేందుకు ‘కమలం’ ప్రయత్నాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొంది ఎలాగైనా ఆ ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు జనంలో ఉన్న వ్యతిరేకత తమ గెలుపునకు దోహదపడుతుందని బిజెపి భావిస్తోంది. బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా టీడీపీ, జనసేన ఓటర్లు జైకొట్టనున్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సులభంగా గెలుపొంది మేయర్సీటు దక్కించుకోవచ్చనే అంచనాల్లో బీజేపీ వుంది. ఇక్కడి నుంచి ఎంఐఎం పోటీ చేస్తేనే బీజేపీకి గెలుపు అవకాశాలుంటాయి. లేకపోతే ప్రధాన పోటీ కాంగ్రెస్ - బీఆర్ ఎస్ మధ్యనే వుంటుంది. ప్రచారంలో ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన దీపక్‌రెడ్డితో పాటు బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, గౌతమ్‌రావు టికెట్ ఆశిస్తున్నారు.
తెలంగాణ అంతటా కాంగ్రెస్ గెలిచినా, హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయామనే బాధ సి.ఎం. రేవంత్ రెడ్డిలో వుంది. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును చేజిక్కించుకున్న ఘనత రేవంత్‌కు దక్కింది. అదే జోష్‌తో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ సిటీలో కనుక కాంగ్రెస్ ను గెలిపిస్తే నిజంగానే రేవంత్ ఇమేజ్ డబుల్ అవుతుంది. అది సాధ్యమవుతుందా? జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా వ్యూహాలు అమలుచేస్తోంది. ఈ సీటు పై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.