కవితపై జస్టిస్ సంచలన వ్యాఖ్యలు

అసలు కవిత గురించి కామెంట్ చేయాల్సిన అవసరం జస్టిస్ కు ఏమొచ్చిందో ? ఎందుకు కామెంట్ చేశారో కూడా తెలీటంలేదు.

Update: 2024-07-17 11:10 GMT
Justice NarasimhaReddy and Kavitha

కల్వకుంట్ల కవితపై జస్టిస్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు కవిత గురించి కామెంట్ చేయాల్సిన అవసరం జస్టిస్ కు ఏమొచ్చిందో ? ఎందుకు కామెంట్ చేశారో కూడా తెలీటంలేదు. కవిత గురించి మాట్లాడుతు ‘అహంకారంతో ప్రవర్తిస్తే ఏమవుతుందో కవితను చూస్తే తెలుస్తుంది’ అని జస్టిస్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇరుక్కున్న కవిత మార్చినెల 15వ తేదీనుండి తీహార్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యంకావటంలేదు. అనారోగ్యమని, కొడుకు చదువు, పరీక్షలని, ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ హోదాలో ప్రచారం చేయాలనే కారణాలను ఎన్నింటినీ చూపించినా కోర్టు మాత్రం దేనికీ అంగీకరించలేదు. అందుకనే గడచిన నాలుగు నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు.

తాజాగా జస్టిస్ నరసింహారెడ్డి కవితపై చేసిన వ్యాఖ్యలతో జనాలందరికీ పై విషయాలన్నీ గుర్తుకురావటం ఖాయం. అహంకారంతో ప్రవర్తించిన వాళ్ళకు కవితకు పట్టిన గతే పడుతుందని అర్ధమొచ్చేట్లుగా జస్టిస్ కామెంట్ చేశారు. దానిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. జస్టిస్ నరసింహారెడ్డికి అసలు కవిత గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలంటు నిలదీస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఛత్తీస్ ఘడ్ నుండి కొనుగోలు చేసిన విద్యుత్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డితో విచారణ చేయించేందుకు కమిషన్ వేసిన విషయం తెలిసిందే.

ఛత్తీస్ ఘడ్ ఒప్పందంలో అవినీతి, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అవినీతి, అవకతవకలపైన కూడా విచారణ చేశారు. అయితే విచారణపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తు కేసీయార్ సుప్రింకోర్టులో కేసు వేశారు. విచారణ జరిపిన సుప్రింకోర్టు కమిషన్ ఛైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డిని తప్పుకోవాలని ఆదేశించింది. నరసింహారెడ్డి ప్లేసులో మరొకరిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుప్రింకోర్టు ఆదేశాలతో నరసింహారెడ్డి కమిషన్ ఛైర్మన్ గా తప్పుకున్నారు. ఈ నేపధ్యంలోనే ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు విద్యుత్ రంగంలో జరిగిన అవినీతి, అవకతవకలపై తన విచారణ పూర్తయిపోయిందన్నారు. రిపోర్టును ప్రభుత్వానికి అందచేయటం మాత్రమే మిగులుందని చెప్పారు. ఈ విషయం చెబుతునే కవితపైన కూడా కామెంట్ చేశారు.

కవితపైన జస్టిస్ నరసింహారెడ్డి చేసిన కామెంటుపైనే బీఆర్ఎస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. మరి కవితకు వ్యతిరేకంగా జస్టిస్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు ? వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయమై నరసింహారెడ్డే వివరణ ఇవ్వాలి. మరి తాజా వివాదం ఎక్కడకు దారితీస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News