చంద్రబాబు-కేసీయార్ మధ్య తేడా ఏమిటో వివరించిన కడియం

టీడీపీకి బీఆర్ఎస్ కు మధ్య చాలా తేడా ఉందన్నారు. ఏ ప్రాంతీయపార్టీ అయినా ప్రైవేటు లిమిటెడే అని కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు.

Update: 2024-04-22 05:28 GMT
naidu and kcr

కడియం శ్రీహరి తెలుగురాష్ట్రాల్లోని సీనియర్ నేతల్లో ఒకరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీలో ఒక వెలుగు వెలిగారు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ లో చేరి కీలకనేతగా వ్యవహరించారు. అలాంటి కడియం ఈమధ్యనే బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి మారారు. నాలుగుసార్లు స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏగా, ఒకసారి ఎంపీగా గెలిచి రెండుసార్లు ఎంఎల్సీ అయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీగా పోటీచేస్తున్నారు. ఎన్టీవీ రిపోర్టర్లతో నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను కీలకంగా పనిచేసిన టీడీపీ, బీఆర్ఎస్ మధ్య తేడాను వివరించారు.

రెండు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలే

టీడీపీకి బీఆర్ఎస్ కు మధ్య చాలా తేడా ఉందన్నారు. ఏ ప్రాంతీయపార్టీ అయినా ప్రైవేటు లిమిటెడే అని కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. అయితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల్లాంటి రెండుపార్టీల్లో పనిచేయటంలోని తేడాను వివరించారు. ఆ తేడా ఏమిటంటే టీడీపీలో పాలిట్ బ్యూరో సభ్యుడు లేదా ప్రధాన కార్యదర్శి లేదా ఇంకేదైనా పోస్టున్నదంటే ఆ హోదాకు వచ్చే గౌరవమే వేరన్నారు. ఏ విషయంపైన అయినా నిర్ణయం ప్రకటించేముందు చంద్రబాబునాయుడు పాలిట్ బ్యూరో సమావేశం, సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించేవారని గుర్తుచేశారు.

చంద్రబాబుతో సమావేశాల్లో ఎవరి అభిప్రాయాలను వాళ్ళు స్వేచ్చగా చెప్పేవారమన్నారు. సీనియర్ నేతల అభిప్రాయాలను చంద్రబాబు పరిగణలోకి తీసుకునే వారా కాదా అన్నది వేరే విషయమన్నారు. కీలకమైన విషయాలపై పదిమంది అభిప్రాయాలు తీసుకునేందుకు సమావేశాలు నిర్వహించటమే ముఖ్యమన్నారు. అయితే బీఆర్ఎస్ లో అసలు ఆ ముచ్చటే లేదన్నారు. కారుపార్టీలో ఎంతపెద్ద పదవిలో ఉన్నా అందరు సఫోకేషన్లోనే ఉండేవారని చెప్పారు. ఎంతపెద్దపోస్టులో ఉన్నా ఏమాత్రం ఉపయోగంలేదన్నారు. అభిప్రాయాలు తీసుకోవటం, సీనియర్లతో సమావేశం నిర్వహించటం లాంటివి కేసీయార్ దగ్గర సాధ్యంకాదని చెప్పారు. పార్టీ ఓడిపోయిన వెంటనే కేసీయార్ కు ప్రమాదం జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ను నియమించమని తాను ఇచ్చిన సలహాను కేసీయార్ పట్టించుకోలేదన్నారు. అలాగే శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ ను నియమించాలని అంటే పట్టించుకోలేదని చెప్పారు. చాలామంది చాలా సందర్భాల్లో సలహాలు ఇవ్వాలని అనుకున్నా సాధ్యంకాలేదన్నారు. టీడీపీలో ఎవరి బాధ్యతలను వాళ్ళకు చంద్రబాబు అప్పగించేస్తారని గుర్తుచేశారు. పదవులను తనచేతుల్లో నుండి ఇంకోరికి కేసీయార్ పోనివ్వరని కడియం చెప్పారు.

కేసీయార్ తీసుకునే నిర్ణయాలు చాలామందికి అసలు తెలిసేవికావన్నారు. కేసీయార్ ను కలవటమే దుర్లభమయ్యేదని ఆరోపించారు. తనను కలవటానికి ఎవరికీ కేసీయార్ అవకాశం ఇచ్చేవారు కాదన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. కలిసే అవకాశమే ఇవ్వని కేసీయార్ ఇక ఏ విషయంపైనైనా నలుగురితో మాట్లాడేది, సమావేశం జరిపేది ఎక్కడిదని కడియం ఎదురు ప్రశ్నించారు. కేసీయార్ ను కలిసే అవకాశంరాని చాలామంది కేటీయార్, హరీష్ రావుతో తమ సమస్యలను చెప్పుకునేవారని గుర్తుచేశారు. అయితే కేసీయార్ ను కలిసి వివరించేందుకు కేటీయార్, హరీష్ కు కూడా పరిమితులుండేవన్నారు. టీడీపీ కూడా ప్రైవేటు లిమిటెడ్ పార్టీయే అయినా అందులో పనిచేసేవాళ్ళంతా ఇది తమపార్టీ అనే ఆత్మవిశ్వాసంతో, సంతోషంగా పనిచేసేవాళ్ళన్నారు. బీఆర్ఎస్ లో ఆ విధంగా అనుకునే అవకాశం ఇంకెవరికీ లేదన్నారు. పార్టీకి అధినేత, ఓనర్ అంతా కేసీయార్ మాత్రమే అని గుర్తుచేశారు.

కృష్ణమాదిగతో ఎక్కడ చెడింది ?

ఇదే ప్రోగ్రామ్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్ధాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ పైన కూడా ఘాటువ్యాఖ్యలు చేశారు. కృష్ణమాదిగ వైఖరి వల్లే ఎంఆర్పీఎస్ చీలికలు పీలకలైపోయిందన్నారు. ఎంఆర్పీఎస్ దెబ్బతిన్నదే కృష్ణమాదిగ కారణగా అని కడియం మండిపడ్డారు. తనపైన కృష్ణమాదిగ చేస్తున్న ఆరోపణలను పట్టించుకోనని చెప్పారు. చాలాకాలంగా కృష్ణమాదిగకు కడియంకు పడదన్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఇద్దరిదీ మాదిగ సామాజికవర్గమే అయినా కడియంను కృష్ణమాదిగ చాలా తక్కువగా చూస్తారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అందుకనే కృష్ణమాదిగ చెప్పినంత మాత్రాన మాదిగలంతా బీజేపీకి ఓట్లేస్తారని తాను అనుకోవటంలేదన్నారు.

కావ్యను గెలిపించండి

తాను అవినీతిపరుడినని ఆరోపిస్తున్న వాళ్ళు ఆరోపణలు చేయటంకాకుండా ఆధారాలతో నిరూపించాలని సవాలు చేశారు. తాను అవినీతిపరుడినని, బీఆర్ఎస్ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నట్లు ఎవరైనా సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తే తాను ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటంతో పాటు తన కూతురు కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా ఉపసంహరిస్తానని చాలెంజ్ చేశారు. తాను ఆత్మాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేయటం ఇష్టంలేని చాలామంది తనపైన అనేక రకాలైన ఆరోపణలు చేస్తుంటారు కాబట్టి తాను లెక్కచేయనని చెప్పారు. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తన కూతురు కడియం కావ్యను గెలిపించాలని ఓటర్లకు కడియం శ్రీహరి విజ్ఞప్తిచేశారు.

Tags:    

Similar News