‘రోడ్డుపై కూర్చోవడం పద్దతేనా’.. బండిని ప్రశ్నించిన కడియం

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల రద్దు అంశం తీవ్ర రచ్చకు దారితీసింది. జీవో 29ని రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Update: 2024-10-21 10:14 GMT

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల రద్దు అంశం తీవ్ర రచ్చకు దారితీసింది. జీవో 29ని రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వాళ్లు అశోక్‌నగర్ రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ విషయంలో తమకు న్యాయం జరిపించాలంటూ వారు హైకోర్టు, సుప్రీం కోర్టులను కూడా ఆశ్రయించారు. కానీ కోర్టుల తీర్పు ప్రభుత్వానికే మద్దతుగా లభించింది. ఈరోజు 46 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కూడా వారితో కలిసి నిరసనకు దిగడంపై కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. తాను కేంద్రమంత్రి అన్న విషయాన్ని బండిసంజయ్ పూర్తిగా మర్చిపోయి సిగ్గు లేకుండా నడిరోడ్లపై దాడులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారాయన.

బండి సంజయ్‌కి అసలు జ్ఞానం అనేది ఉందా అంటూ విరుచుకుపడ్డారు. నిజంగా గ్రూప్-1 అభ్యర్థులకు మంచి జరగాలని కోరుకుని ఉంటే, అదే ఉద్దేశం ఉండి ఉంటే బండిసంజయ్ ఈ అంశంపై నేరుగా సీఎం రేవంత్‌తో మాట్లాడి పరిష్కరనకు పాటుపడాల్సిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్య అనేది ఉంటే దాని పరిస్కారం కోసం ప్రయత్నించాలే కానీ ఇలా రోడ్లపై కూర్చోవడం ఏమాత్రం పద్దతేనా అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే బీజేపీ, బీఆర్ఎస్‌లకు రవ్వంతైనా ప్రేమ ఉందా? ఉంటే ఇలా చేస్తారా? రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారా? అంటూ నిలదీశారు కడియం శ్రీహరి. రేవంత్ రెడ్డి.. అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని, బీఆర్ఎస్ చేసిన తప్పుల వల్ల రాష్ట్రంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

రాష్ట్రం అప్పులు రూ.7 లక్షల కోట్లు

‘‘రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. వడ్డీలు, జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్లకు మిగులుబాటు లేదు. సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. ఇంత కష్టంలో కూడా ఏ ఒక్కటి ఆలస్యం కాకుండా అందించాలన్న రేవంత్ రెడ్డి సంకల్పానికి అందరం అండగా నిలవాలి. బీఆర్ఎస్, బీజేపీ మాటలు నమ్మితే నష్టపోయేది ఎవరో కాదు. మనమే.. మన రాష్ట్రమే నష్టపోతుంది. బీఆర్ఎస్ ఏకాడికి మొసలి కన్నీరే కారుస్తోంది. వారి కన్నీటి వెనక నిజమైన ప్రేమ, ఆప్యాయత, ప్రజలకు మంచి చేయాలన్న తాపత్రయం లేదు. 2014లో కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయో ఒకసారి చూడండి. దమ్ముంటే దీనిపై కల్వకుంట్ల కుటుంబం ప్రజలక ముందుకు చర్చకు రావాలని ఛాలెంజ్ చేస్తున్నా. హరీష్ రావు నిజాయితీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు.. అసలు కేటీఆర్‌కు సిగ్గుందా’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి.

బండి బైఠాయింపు ఏంటంటే..

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని, జీవో29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు కొన్ని రోజులుగా తెలంగాణలో నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా శనివారం చలో సచివాలయం చేపట్టారు. ఆ ర్యాలీలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. ఆయన ఎంట్రీతో అక్కడ ఉద్రిక్తత మరింత అధికమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బండి సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల నిరసనలకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. ఇందులో భాగంగానే బండి సంజయ్ కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపైనే ఈరోజు కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News