రేప్ కేసులో కాళేశ్వరం ఎస్సైపై సీఎం సీరియస్... చర్యలకి ఆదేశాలు
కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ మహిళా కానిస్టేబుల్ ని రివాల్వర్ తో బెదిరించి పలుమార్లు లొంగదీసుకున్నాడనే ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అరెస్ట్ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ పై రేప్ కేస్ ఫైల్ అయింది. భవానీ సేన్ మహిళా కానిస్టేబుల్ ని రివాల్వర్ తో బెదిరించి పలుమార్లు లొంగదీసుకున్నాడనే ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్సైపై కఠిన చర్యలకు ఆదేశాలిచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఆ ఎస్సైను సర్వీసు నుంచి ప్రభుత్వం తొలగించింది.
రివాల్వర్ తో బెదిరించి అత్యాచారం...
నివేదికల ప్రకారం, ఎస్సై భవానీ సేన్.. ఫిర్యాదు చేసిన మహిళా కానిస్టేబుల్‌పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానంటూ రివాల్వర్ తో బెదిరించాడు. దీంతో మహిళా కానిస్టేబుల్ ఎవరికైనా చెప్పాలంటే భయపడింది. చివరికి ధైర్యం చేసి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్సై ఆగడాలు బయటపడ్డాయి. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి ఎస్సై భవానీ సేన్ తనపై పదేపదే దాడి చేసి అత్యాచారం చేశాడని మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంప్ హౌస్ సమీపంలోని పాత పోలీస్‌స్టేషన్ భవనంలో ఎస్సై ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో తెలిపారు.
ఫిర్యాదుపై వేగంగా స్పందించిన ఉన్నతాధికారులు మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐలతో విచారణ చేపట్టారు. ఎస్సై భవానీ సేన్ పై కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి, దాడి చేసేందుకు ఎస్సై తన రివాల్వర్ ను నిజంగానే ఉపయోగించాడని వారు నివేదించారు. అతనిపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారులు ధృవీకరించారు. నిందితుడి నుంచి సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తులో అతను కనీసం ముగ్గురు మహిళా పోలీసు కానిస్టేబుళ్లను బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సీనియర్ అధికారులు తేల్చారు.