‘కేసీఆర్‌కు లేఖ నేనే రాశా..’

అసలు ఈ లేఖ ఎలా బహిర్గతం అయింది?;

Update: 2025-05-23 15:38 GMT

తెలంగాణ పాలిటిక్స్‌ను గురువారం రాత్రి నుంచి ఒక ఆరు పేజీల లేఖ ఓ ఊపుఊపేస్తోంది. కేసీఆర్‌కు కవిత రాశారంటూ వచ్చిన ఈ లేఖపై తాజాగా ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆమె అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చీరాగానే.. విమానాశ్రయంలోనే ఈ లేఖ అంశంపై మాట్లాడారు. ఆ లేఖ తానే రాశానని అంగీకరించారు. తన అభిప్రాయాలనే లేఖ రూపంలో రాశానని చెప్పారు. ఆ లేఖలో కార్యకర్తల అభిప్రాయాలే చెప్పారు. అసలు ఈ లేఖ ఎలా బహిర్గతం అయింది? అని కూడా ఆమె ప్రశ్నించారు. అంతర్గంతా తాను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థమేంటి? అని నిలదీశారు. పార్టీలోని లోపాలను సవరించుకుంటే పార్టీ భవిష్యత్తు బాగుంటుందనేని తన అభిప్రాయం అని చెప్పారు.

‘‘నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయిందని హంగామా జరిగినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం నేను కేసీఆర్ కు లేఖ రాయడం జరిగింది. గతంలో కూడా లేఖ ద్వారా కేసీఆర్ కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పడం జరిగింది. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఇటీవలే చెప్పాను. ఇప్పుడు లేఖ బహీర్గతం అవ్వడంతో ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పాను’’ అని అన్నారు.

‘‘ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమ లేదు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహీర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ దేవుడు.. కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి.. వారి వల్ల నష్టం జరుగుతోంది. కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయటికి వచ్చిందటే... పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి ? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది’’ అని కోరారు.

‘‘నేను కేసీఆర్ కు లేఖ ద్వారా వ్యక్తపర్చిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు. లేఖ బహీర్గతం కావడం బాధాకరం. లేఖ బహీర్గతం కావడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆర్ యే.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా మందుకెళ్తుంది. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. గ్రెస్, బీజేపీ పార్టీలు విఫలమయ్యాయి... వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News