తీన్మార్ మల్లన్నపై కవిత ఫిర్యాదు
శాసనమండలి ఛైర్మన్ గుత్తా ఇంటికి వెళ్లి ఫిర్యాదు అందించిన కవిత.;
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనను ఉద్దేశించిన మల్లన్న చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరారు. అనంతరం ఆమె మల్లన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారో. నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడతాం అంటే చూస్తూ ఊరుకోమన్నారు. మహిళలంటే మల్లన్నకు ఎంత చిన్న చూపో ఆయన వ్యాఖ్యల్లో తెలిసిపోతుందన్నారు. మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా? అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రజలపై కాల్పులు జరపడం ఏంటి? అంత క్రూరత్వం ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు. ఆడబిడ్డను ఇష్టారీతిన మాటలనేసి.. తర్వాత మాండలికం, యాస అని కప్పిపుచ్చుంటే ఎట్లా? అని నిలదీశారు. ముందు ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.
‘‘తీన్మార్ మల్లన్న.. నాపై తీవ్ర వ్యాఖ్యల చేశారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణతో మాట్లాడాలి’’ అని తెలిపారు. నోటికొచ్చిన మాట్లాడతా అంటే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా వ్యాఖ్యల్లో తప్పేంటి: మల్లన్న
అయితే తాను చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని తీన్మార్ మల్లన్న సంజాయిషీ చెప్పుకున్నారు. కంచం పొత్తు అంటే కలిసి బంతి భోజనం చేయడం అని, మంచం పొత్తు అంటే వియ్యం అందుకోవడం అని వివరించారు. అంతే తప్ప తాను ఎటువంటి తప్పు మాటలు మాట్లాడలేదని, అది తమ మాండలిక భాష అంటూ చెప్పుకొచ్చారు.