బీఆర్ఎస్ కు కవిత షాక్

బీసీలకు 42 శాతం బిల్లుకు మద్దతుగా దీక్ష చేస్తానని కల్వకుంట్ల కవిత చేసిన ప్రకటన పార్టీలో సంచలనంగా మారింది.;

Update: 2025-07-29 09:30 GMT
KTR and Kavitha

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు పార్టీ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద షాకే ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బీసీలకు 42 శాతం బిల్లుకు మద్దతుగా దీక్ష చేస్తానని కల్వకుంట్ల కవిత చేసిన ప్రకటన పార్టీలో సంచలనంగా మారింది. ఒకవైపు పార్టీయేమో బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ(Congress Party) డ్రామాలాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఒకవైపు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) మీద ప్రతిరోజు విరుచుకుపడుతున్నారు. ఇదేసమయంలో కవితేమో బిల్లు, ఆర్డినెన్సును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. పైగా బిల్లు, ఆర్డినెన్సును బీఆర్ఎస్(BRS) వ్యతిరేకించటం తగదని హితవుకూడా పలికారు. తమపార్టీ నేతలకు విషయం అర్ధంకాక బిల్లు, ఆర్డినెన్సును వ్యతిరేకిస్తున్నట్లు ఎద్దేవా కూడా చేశారు.

ఇన్నిరోజులు విమర్శలు, ఎద్దేవా వరకే పరిమితమైన కవిత ఈరోజు మీడియాతో మాట్లాడుతు బిల్లు(BC Reservations Bill)కు మద్దతుగా హైదరాబాద్ లో ఆగష్టు 4,5,6 తేదీల్లో దీక్ష చేస్తానని ప్రకటించటం కలకలం రేపుతోంది. ఈ అంశంపై అన్నా, చెల్లెళ్ళు పూర్తి వ్యతిరేక స్టాండ్ తీసుకున్నరన్న విషయం అర్ధమవుతోంది. అయితే పార్టీ అధినేత కేసీఆర్ స్టాండ్ ఏమిటన్నదే ఇంకా అర్ధంకావటంలేదు. ఇదేవిషయమై పార్టీలోని నేతలు చాలామంది అసలు నోరిప్పటంలేదు. అగ్రనేతల మధ్య విభేదాల కారణంగా తాము నోరిప్పితే ఏమవుతుందో అనే ఆందోళన కూడా కారణం అయ్యుండచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన బిల్లు, సిద్ధంచేసిన ఆర్డినెన్సును కేటీఆర్ మొదటినుండి తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, కవిత మాత్రం పూర్తి మద్దతుగా మాట్లాడుతున్నారు.

కవిత ప్రకటనలో లాజిక్ లేదా ?

బిసీ బిల్లు సాధన కోసం మూడురోజులు దీక్ష చేస్తానన్న కల్వకుంట్ల ప్రకటనలో లాజిక్ కనబడటంలేదు. ఎలాగంటే బీసీ బిల్లు ఎంతముఖ్యమో దేశమంతా తెలియచేసేందుకే తాను దీక్షకు కూర్చుంటున్నట్లు ప్రకటించారు. అదే నిజమైతే కవిత దీక్ష చేయల్సింది ఢిల్లీలోనే కాని హైదరాబాదులో కాదు. ఎందుకంటే హైదరాబాదులో కవిత(Kavitha) దీక్ష చేస్తే తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమవుతుంది. అదే ఢిల్లీ(Delhi)లో దీక్షచేస్తే యావత్ దేశం చూస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో రాజకీయంగా చిన్నపాటి డెవలప్మెంట్ జరిగినా ఇంగ్లీష్, హింది జాతీయ ఛానళ్ళు, ప్రింట్ మీడియా బాగా ప్రాధాన్యతిచ్చి కవర్ చేస్తాయి. అప్పుడు కవిత టార్గెట్ రీచైనట్లవుతుంది. అంతేకాని హైదరాబాదులోని ఇందిరా పార్క్ దగ్గర ఎన్నిరోజులు దీక్షచేసినా జాతీయ కవరేజి పెద్దగా ఉండదు. అప్పుడు కవిత టార్గెట్ పూర్తిగా రీచవ్వదు. ఫలితంగా బీసీ బిల్లుపై కవిత దీక్ష జాతీయస్ధాయిని ఆకర్షించటం అనుమానమే.

ఒకవైపు జాతీయస్ధాయిలో హైలైట్ అవ్వాలంటున్నారు, మరోవైపు మూడు రోజులు హైదరాబాదులో దీక్షంటున్నారు. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కాబట్టే కవిత ప్రకటనలో లాజిక్ మిస్సవుతున్నట్లు అనుమానంగా ఉంది. ఇంత చిన్న విషయాన్ని కవిత ఎందుకు మరిచిపోయారో అర్ధంకావటంలేదు. గతంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీల్లోని మహిళా ఎంపీలు, దేశంలోని మహిళా ప్రముఖుల మద్దతుగా దీక్ష చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో కవిత దీక్షకు వచ్చిన కవరేజి ఇపుడు రావాలంటే దీక్ష చేయాల్సింది హైదరాబాదులో కాదు ఢిల్లీలోనే అని గుర్తుపెట్టుకోవాలి.

Tags:    

Similar News